ధనిక రాష్ర్టాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-10-25T05:49:55+05:30 IST

కోట్లాది ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధి తెలంగాణా రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తే, నీళ్లు, నిధులు, నియామకం నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ వీటిని పక్కన పెట్టి గత ఏడేళ్లకాలంలో ధనిక రాష్ర్టాన్ని రూ.మూడు లక్షల

ధనిక రాష్ర్టాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌

రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

మరో రూ.మూడు లక్షల కోట్ల అప్పులకు సిద్ధంగా ఉంది.

కార్యకర్తల సమావేశంలో సీఎల్పీ నాయకుడు భట్టి


సత్తుపల్లి, అక్టోబరు 24: కోట్లాది ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధి తెలంగాణా రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తే, నీళ్లు, నిధులు, నియామకం నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ వీటిని పక్కన పెట్టి గత ఏడేళ్లకాలంలో ధనిక రాష్ర్టాన్ని రూ.మూడు లక్షల కోట్ల మేర అప్పుల రాష్ట్రంగా మార్చారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. మరో మూడు లక్షల కోట్ల మేర అప్పులు చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శనివారం సత్తుపల్లి మండలం గంగారంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు మరో సమరానికి కాంగ్రెస్‌ కేడర్‌ సిద్ధం కావాలని పిలునిచ్చారు. ఏడేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని అన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ చేపట్టిన ఇందిరాసాగర్‌, రాజీవ్‌ సాగర్‌లకు రూ.1500కోట్లు ఖర్చు చేస్తే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి ఉన్నా వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని రద్దు చేసి రూ.15వేల కోట్లతో సీతారామా ఎత్తిపోతల పథకం ప్రవేశపెట్టారని ఆరోపించారు.  సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కేడర్‌ పని చేయాలని కోరారు. ప్రజల పక్షాన పోరాడేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను గ్రామస్థాయిలోకి తీసికెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెట్సీ ఎన్నికల్లో విద్యావంతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. డబ్బుతో ఎన్నికలను ప్రభావితం చేసే వారికి బుద్ది చెప్పాలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ అభిరామ్‌రెడ్డి, సోమిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T05:49:55+05:30 IST