బోధిసత్వుని ఉపాయం

ABN , First Publish Date - 2021-03-12T05:45:00+05:30 IST

మనిషికి మరణభయం, మరణ దుఃఖం సహజం. ఈ భయం నుంచీ, ఈ దుఃఖం నుంచి బయటపడవేసే మార్గాల్లో మానవీయమైనది బౌద్ధం. కన్నవారు, తోడబుట్టినవారు, ఆలుబిడ్డలు, ప్రియమైన బంధుమిత్రులు... ఇలా సన్నిహితుల మరణాలు మనిషిని

బోధిసత్వుని ఉపాయం

మనిషికి మరణభయం, మరణ దుఃఖం సహజం. ఈ భయం నుంచీ, ఈ దుఃఖం నుంచి బయటపడవేసే మార్గాల్లో మానవీయమైనది బౌద్ధం. కన్నవారు, తోడబుట్టినవారు, ఆలుబిడ్డలు, ప్రియమైన బంధుమిత్రులు... ఇలా సన్నిహితుల మరణాలు మనిషిని కుంగదీస్తాయి. కర్తవ్యం నుంచి దూరం చేస్తాయి. చిరకాలం దుఃఖంలో చిదిమేస్తాయి. కన్నబిడ్డ మరణం కలిగించే కడుపు కోత వర్ణనాతీతం. అలాంటి పుత్రశోకంలో పడి, కర్తవ్యాన్ని విస్మరించిన ఒక తండ్రికి... మరణ కారణాలను తెలిపి, దుఃఖం నుంచి దూరం చేసిన ఒక పండితుడి సందేశం ఇది. 


పూర్వం కేశవ మహారాజు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకొని... సమస్త జంబూద్వీపాన్నీ పరిపాలిస్తున్నాడు. కేశవుడు మహా యోధుడు. మల్ల యుద్ధంలో మేటి. చక్రాయుధాన్ని సంధించి - శత్రువుల తలలు నరకడంలో సిద్ధహస్తుడు. తన భుజబలంతో జంబూ దీపాన్నంతటినీ జయించాడు. చిరకాలం పరిపాలించాడు. కేశవునికి పదిమంది సోదరులు. అందరూ అతనికి అండగా ఉండేవారు. వారిలో తొమ్మిదోవాడు గొప్ప పండితుడు. అతని పేరు ఘటుడు. అందరూ అతణ్ణి ‘ఘట పండితుడు’ అనేవారు.


కాలక్రమంలో వారందరికీ సంతానం కలిగింది. వంశాభివృద్ధిని చూసి కేశవుడు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో... అతని ప్రియమైన పెద్దకొడుకు అకాల మృత్యువాత పడ్డాడు. ఎంతకాలమైనా కేశవుడు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయాడు. నిద్రాహారాలు మానేశాడు. చివరకు మంచం పట్టాడు. రాజ్య వ్యవహారాలు పూర్తిగా విస్మరించాడు. సోదరులు అతనికి ఎన్నో రకాలుగా చెప్పారు. మంత్రులు మొరలు పెట్టుకున్నారు. ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా అతని దుఃఖాగ్నిని చల్లార్చలేకపోయారు. పుత్రశోకం అతణ్ణి పట్టి పీడిస్తూనే ఉంది. తన అన్నను దుఃఖాగ్ని నుంచి దూరం చేయాలనుకున్నాడు ఘట పండితుడు. దానికోసం ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. రోహిణీయుడు అనే మంత్రిని పిలిచి, తన ఆలోచన చెప్పాడు. 


మరునాడు ఘట పండితుడు పిచ్చిపట్టిన వాడిలా మారాడు. నగర వీధుల్లో గెంతుతూ, దుస్తులు చించుకుంటూ, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ తిరగసాగాడు. ‘‘నాకు కుందేలు కావాలి. అదిగో... అల్లదిగో... ఆకాశంలోని చందమామలో కనిపించే కుందేలు కావాలి’’ అని కనిపించిన వారందరినీ అడుగుతూ, అరుస్తూ తిరగసాగాడు. ఈ విషయాన్ని మంత్రి రోహిణీయుడు వెళ్ళి, కేశవ మహారాజుకు చెప్పాడు.


‘‘అయ్యో! అమాత్యా! ఇదేమి కాలవైచిత్రి? పుత్రశోకంతో అలమటించే నాకు ఈ సోదరుని దుఃఖం మరొకటా! వెంటనే వెళ్ళి, ఘటుణ్ణి తీసుకురా’’ అని పంపాడు రాజు.ఘటుడు వచ్చాక - ‘‘సోదరా! నీకు అడవిలో తిరిగే అందమైన కుందేళ్ళు వందలు, వేలు తెప్పించి ఇస్తాను. కాదంటే బంగారు కుందేలు... లేదంటే వజ్రాల కుందేలు చేయించి ఇస్తా’’ అన్నాడు.‘‘వద్దు, వద్దు. నాకు చంద్రునిలోని కుందేలే కావాలి’’ అన్నాడు ఘటుడు. 


‘‘నీ పిచ్చి కాకపోతే... చంద్రుడిలో ఉండేది కుందేలు నీడ. దాన్నెలా తెస్తాం?’’ అన్నాడు కేశవుడు. ‘‘అన్నా! నీవు మంచి విషయం చెప్పావు. ఆ చెప్పే నీతులు మాకేనా? నీకు కూడానా?’’ అని అడిగాడు ఘటుడు. ‘‘నీవేమంటున్నావు ఘటా?’’ అని ప్రశ్నించాడు కేశవుడు. ‘‘అవును అన్నయ్యా! నేను చంద్రుడిలో నీడగా అయినా కనిపించే దాన్ని కోరుకుంటున్నాను. మరి నీవు? కనిపించని దాన్నే కోరుకుంటున్నావ్‌!’’ అన్నాడు ఘటుడు.


‘‘నేనా?’’ అన్నాడు కేశవుడు విస్మయంగా. ‘‘అవును అన్నయ్యా! చంద్రుడిలోని కుందేలును ఎలా తీసుకురాలేమో... పోయిన ప్రాణాలను కూడా అలాగే తీసుకురాలేం. ఎంత ధనాన్ని ధారపోసినా, ఎన్ని మంత్ర తంత్రాలు చేసినా, ఎన్నెన్ని ఔషధాలు ఉపయోగించినా తీరిన ఆయువులు తిరిగి వస్తాయా? పుట్టిన ప్రతి జీవికీ ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. దానికోసం ఇంతగా శోకించడం తగదు. ఈ విషయం నీకు తెలియదా! నీవు నన్ను పిచ్చివాడని అంటున్నావు... కానీ...’’ అన్నాడు ఘట పండితుడు.


దానితో... ఇంతకాలం తాను ఎంత పిచ్చిగా ప్రవర్తించినదీ కేశవుడు తెలుసుకున్నాడు. దుఃఖం నుంచి కోలుకున్నాడు.విముఖుణ్ణి సుముఖుడిగా చేసిన ఘట పండితుడి ఉపాయ కుశలతను అందరూ మెచ్చుకున్నారు. ఈ కథలో ఘట పండితుడే బోధిసత్వుడు.

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-03-12T05:45:00+05:30 IST