స్విమ్స్‌ తరహాలో ట్రయేజ్‌ను పటిష్ఠం చేయాలి

ABN , First Publish Date - 2021-05-06T06:45:32+05:30 IST

‘స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ హాస్పిటల్‌ నిర్వహిస్తున్న ట్రయేజ్‌ సిస్టం బాగుంది.

స్విమ్స్‌ తరహాలో ట్రయేజ్‌ను పటిష్ఠం చేయాలి
వైద్యాధికారులతో మాట్లాడుతున్న వీరబ్రహ్మం

రుయా వైద్యాధికారులకు జేసీ సూచన

తిరుపతి (వైద్యం), మే 5: ‘స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ హాస్పిటల్‌ నిర్వహిస్తున్న ట్రయేజ్‌ సిస్టం బాగుంది. ఆ తరహాలోనే రుయా కొవిడ్‌ ఆస్పత్రిలోనూ పటిష్ఠం చేయండి’ అని వైద్యాధికారులకు జేసీ వీరబ్రహ్మం సూచించారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశాల మేరకు బుధవారం రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో వైద్యాధికారులతో సమీక్షించారు. ట్రయేజ్‌ పటిష్ఠంగా ఉంటేనే కొవిడ్‌ బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించవచ్చన్నారు. దీనివల్ల వ్యాధి తీవ్రతను అరికట్టే వీలుందన్నారు. కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా డిశ్చార్జి విషయంలో పల్స్‌ 95 నిలకడగా ఉందని నిర్ధారించుకున్నాక హోమ్‌ ఐసొలేషన్‌ లేదా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపితే.. మరో సీరియస్‌ బాధితుడికి అడ్మిషన్‌ ఇవ్వొచ్చన్నారు. ఆక్సిజన్‌ వృథా కాకుండా నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆర్‌ఎంవో, నోడల్‌ అధికారి డాక్టర్‌ హరికృష్ణకు సూచించారు. ముఖ్యంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇచ్చేటప్పుడు ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌, ఫిజీషియన్‌ ప్రిస్కిప్షన్‌ ఉండాలని స్పష్టం చేశారు. వైద్యులు విధిగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండాలని చెప్పారు. అనంతరం బాధితులకు అందుతున్న ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భారతి, ఆర్‌ఎంవోలు హరికృష్ణ, డాక్టర్‌ ఈబీ దేవి, అభివృద్ధి కమిటీ వర్కింగ్‌ చైర్మన్‌ బండ్ల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T06:45:32+05:30 IST