తీరు మారలేదు

ABN , First Publish Date - 2022-05-16T04:34:43+05:30 IST

జిల్లా కొత్తదే. అవినీతి పాతదే. ప్రతి పనికీ కమీషన్లే. కొత్త పాలనా యంత్రాంగంలో అవినీతి యథేచ్ఛగా సాగుతోంది.

తీరు మారలేదు

ప్రతి శాఖలో అవినీతి 

చిన్న పనికీ కమీషనే

పట్టించుకోని ఏసీబీ 

ఫిర్యాదు చేస్తేనే దాడులు 


జిల్లా కొత్తదే. అవినీతి పాతదే. ప్రతి పనికీ కమీషన్లే. కొత్త పాలనా యంత్రాంగంలో అవినీతి  యథేచ్ఛగా సాగుతోంది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఇదే తీరు నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు వస్తేనే ఏసీబీ స్పందిస్తోందని, లేకపోతే పట్టించుకోవడం లేదనే వాదన కూడా ఉంది. ఈ అవినీతికి అంతేమైనా ఉందా? అనే చర్చ సాగుతోంది.

-నంద్యాల, ఆంధ్రజ్యోతి



ఈ ఏడాది జనవరి 19న రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు గడివేముల తహసీల్దార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పంపిణీ నోచుకోని 38 పాసు పుస్తకాలను, కార్యాలయ సిబ్బంది వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.40 వేలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తమకు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని, మ్యూటేషన్‌ జరగడం లేదని రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోందని, డాక్యుమెంటు రైటర్లు అధికారులకు ముడుపులు ముట్టచెప్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 


ఈ రెండు కేసులను పరిశీలిస్తే ప్రజలు ఫిర్యాదు చేస్తేనే ఏసీబీ దాడులు చేస్తుందని, లేకపోతే అంతా సవ్యంగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వెళ్లినపుడు అఽధికారుల తీరుతో విసుగు చెందిన వారు ఫిర్యాదు చేస్తేనే ఏసీబీలో కదలిక వస్తోం ది. కొద్ది నెలల క్రితం నంద్యాలలో ఓ ఇరిగేషన్‌ ఇంజనీర్‌ ఇంట్లో సోదాలు చేయడం తప్ప రెండు మూడేళ్లలో ఏసీబీ అధికారులు పట్టుకున్న పెద్ద కేసులు ఏమీ లేవు. అలాగని జిల్లాలో అవినీతి ఏమైనా తగ్గిందా? అంటే అదీ లేదు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఎంత తీవ్రంగా ఉన్నదో ఫిర్యాదులే చెబు తున్నాయి. 


దాడులు చేస్తేనే..


మండలానికో ఏసీబీ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని, ఫిర్యాదులకు దిశ యాప్‌ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అవినీతి అంతం చేస్తామంటూ బీరాలు పలుకుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి హటాత్తుగా రాష్ట్రంలో అవినీతి గుర్తుకు వచ్చింది. అవినీతి లేని పాలన అందిస్తామని ప్రకటించారు. అవినీతిని నిర్మూలిస్తే అంతకంటే ఏం కావాలి? కానీ  ఏసీబీకి అవినీతిపరుల చిట్టా తెలియదా? ఏ ఏ శాఖల్లో ఏ అధికారులు లంచాలు దిగమింగుతున్నారో సమాచారం లేదా? అసలు ఆ శాఖలపై నిఘా ఉందా? లంచాలు తీసుకునే వారికి భయం కలిగేలా ఏమైనా చేస్తున్నారా? అంటే సమాధానం లేదు. ఏసీబీ అధికారులు మాత్రం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ఫిర్యాదు చేయడానికి నంబరు కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని, ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వెంటనే దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. ఇంత చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తప్ప పట్టించుకోకపోతే ఏం లాభం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


 పని జరగాలంటే..


అటు ఉమ్మడి జిల్లాలో గానీ,  కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో గానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా చేతి చమురు వదలకుండా పని జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి ముట్ట జెప్పాల్సింది వారికి ఇవ్వకపోతే పని కావడం లేదని అంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఈ తీరు ఎక్కువ. చిన్న పని దగ్గరి నుంచి పట్టాదారు పాసు పుస్తకాల వరకు ప్రతి దానికి ఓ రేటు. అది ఇవ్వకోపోతే సంవత్సరాలు గడిచినా పని జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కింది నుంచి పై దాకా  ప్రతి ఒక్కరి చేయి తడపాల్సిందే. వ్యవసాయ భూముల పాసు పుస్తకాలకు ఎకరానికి ఇంత అని లెక్కగట్టి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొన్ని చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేసినపుడు తహసీల్దార్‌ కార్యాలయంలో పంపిణీ కాని పాసు పుస్తకాలను గుర్తించారు. దీనిని బట్టి ఈ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బులు ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తున్నారని, డబ్బు ఇచ్చుకోలేని వారి పాసు పుస్తకాలు కార్యాలయాల్లో మగ్గిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పాఠశాల పిల్లలకు అవసరమయ్యే సర్టిఫికెట్లు, ఫ్యామిలీ మెంబరు సర్టిఫి కెట్లు.. ఇలా అన్నింటికీ కొంత మంది మండల రెవెన్యూ అధికారులు ధర ఇంత అని నిర్ణయించి లంచం తీసుకుం టున్నారన్న ఆరోపణలు ఎక్కువ గా వినిపిస్తున్నాయి. 


  పర్సంటేజీ ప్రకారం..


ఇక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా ల్లో అవినీతికి అంతే లేదు. ఏదైనా అస్తికి సంబంధించిన క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్‌ చేస్తే దానికి విలువలో ఇంత శాతం అంటూ తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. రూ. పది లక్షల విలువ చేసే భూమి కొంటే కనీసం పదివేల రూపాయల సమర్పించుకోవాల్సిందే! ఈ వ్యవహారం డాక్యుమెంటు రైటర్ల చేతుల మీదుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి వీరు తీసుకుని రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సిబ్బంది అందజేస్తారు. దానిని సిబ్బంది అంతా పంచుకుం టున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారం చూసుకు నేందుకు రిజిస్ట్రేషన్‌ సిబ్బంది ప్రత్యేకంగా ఓ మనిషిని నియమిం చుకుంటు న్నారన్న అరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలో కొంతమంది సబ్‌ రిజిస్ట్రార్ల తీరును గమనించి ఆ శాఖ ఉన్నతాధికారులు సంవత్సర కాలంలో పలువురిని బదిలీ కూడా చేశారంటే ఈ శాఖలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 


సామాన్యుడికి వణుకే..


 న్యాయం కోసం పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కితే రక్షణ అటుంచి పోలీసుల తీరుతో సామాన్యులు వణికిపోతున్నారు. తమకు న్యాయం జరగడం లేదని నంద్యాల త్రీ టౌన్‌ ఎదుట ఇద్దరు వ్యక్తులు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశారంటే పోలీసులు సామాన్యుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోంది. ఫిర్యాదును స్వీకరించేందుకు కూడా లంచాలు అడుగుతున్నారని జిల్లాలో ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఫిర్యాదు నమోదు చేయకుండా ఉండేందుకు కూడా అరోప ణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్థాయిని బట్టి లంచం వసూలు చేసు ్తన్నారనే విమర్శలు ఉన్నాయి. 



ప్రతి శాఖలో ఇదే తీరు..


అవినీతి ఏ ఒక్క శాఖకో పరిమితమైందనుకుంటే పొరబాటే. ఆదాయం ఎక్కువ ఉన్న ప్రతి శాఖలో డబ్బులు దండుకుంటున్నారనే  విమర్శలు ఉన్నాయి. జనావాసాలు పెరుగుతుండటంతో ప్రతి చోట లే అవుట్లు వెలుస్తున్నాయి. వీటి అనుమతి  పనులను ప్లానింగ్‌ విభాగం చూస్తుంది. లే అవుట్‌ విస్తీర్ణం చూసి, ఎకరాల చొప్పున ఇంత అని తీసుకుంటారు. పొలాలను సర్వే చేసే సర్వేయర్లది మరో లెక్క. డబ్బులను బట్టి సరిహద్దులు మారిపోతుంటాయి. వీరి తీరుతో సరిహద్దు వివాదాల్లో రెండు వర్గాల వారు సతమతమైన సందర్భాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. రవాణా శాఖలో దళారులు లేకుండా పని జరగడం దాదాపు అసాధ్యమే! ఇవన్నీ అందరికీ తెలిసి జరుగుతున్న వ్యవహారాలే! ఇలాంటి అధికారులపై ఏసీబీ  కొరడా ఝుళిపించాలని సామాన్యులు కోరుకుంటున్నారు.

Updated Date - 2022-05-16T04:34:43+05:30 IST