తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో విషాదం

ABN , First Publish Date - 2020-06-03T09:51:16+05:30 IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణకు సిద్ధం

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో విషాదం

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు


దౌల్తాబాద్‌ జూన్‌ 2 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది.  జెండా ఆవిష్కరణకు సిద్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలకు పైపు తగిలి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సునీత అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కోసం సునీత భర్త అశోక్‌, అంగన్‌వాడీ ఆయా కళావతితో కలిసి దిమ్మ వద్ద జెండా పైపును అమర్చుతున్నారు. కాగా ప్రమాదవశాత్తు పైన ఉన్న 11కేవీ విద్యుత్‌ తీగలకు వైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురైన వారు తీవ్ర గాయాలపాలయ్యారు.


వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా అశోక్‌(36) మార్గమధ్యలో మృతి చెందగా, కళావతి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. కాగా కళావతిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కాగా ఘటనలో మృతి చెందిన కరికె అశోక్‌(36)కు భార్య సునీత, కుమారులు రాహుల్‌ శేషు(11), శేషు(8) ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు రూ.5 లక్షల ఆర్థిక సహకారం ప్రకటించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  


తప్పిన పెను ప్రమాదం

అంగన్‌వాడీ టీచర్‌ సునీత భర్త అశోక్‌ విద్యుదాఘాతానికి గురవ్వగా, ఏమైందోనని పక్కనే ఉన్న నాలుగో సెంటర్‌ టీచర్‌ ఇందిర, ఆయా మహేశ్వరీ వారి దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అంతలోనే తేరుకొని వారు తీవ్ర ఆందోళనకు గురై అక్కడే కూర్చుండి పోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.

Updated Date - 2020-06-03T09:51:16+05:30 IST