30 వేలు దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2020-07-14T07:42:14+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. సోమవారం కొత్తగా 1935 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో..

30 వేలు దాటేశాయ్‌!

  • 24 గంటల్లో.. 37 మరణాలు
  • ఒక్కరోజులో ఇదే అత్యధికం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. సోమవారం కొత్తగా 1935 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరుకుంది. ముఖ్యంగా గత ఏడు రోజుల వ్యవధిలోనే 10 వేల కేసులు బయటపడ్డాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం మొత్తం 19,247 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1919 మంది స్థానికులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 13 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 1030 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటి వరకు 16,464 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ఇక 24 గంటల్లో 37 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 369కి ఎగబాకింది. 


తూర్పుగోదావరిలో కల్లోలం

వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 313 కేసులు బయటపడ్డాయి. ఇవికాక సోమవారం సాయంత్రానికి మరింత మందికి పాజిటివ్‌గా తేలింది. కేసుల తీవ్రత పెరుగుతుండడంతో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు, రూరల్‌ మండలాల్లో మంగళవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి. పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయ అధికారి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుంటూరులో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ జిల్లాలో 191 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. సోమవారం సాయంత్రానికి భారీగానే కేసులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో మరో 176 మందికి వైరస్‌ సోకింది. ఈ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు మరణించడం ఆందోళన రేపుతోంది. కృష్ణా జిల్లాలో తాజాగా 111 మందికి పాజిటివ్‌గా తేలింది.


సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏడుగురికి

పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం సాయంత్రానికి 170 కేసులు బయటపడ్డాయి. నరసాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏడుగురుకి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో శానిటరీ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారికి, నరసాపురం నుంచి ప్రతిరోజు తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి విధులు నిర్వహించి వస్తున్న ఒక బ్యాంకు అధికారికి పాజిటివ్‌ వచ్చింది. విశాఖలో కొత్తగా 84 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా నలుగురు మృతి చెందారు. విజయనగరం జిల్లాలో 69, చిత్తూరు జిల్లాలో 168 కేసులు బయటపడ్డాయి. స్విమ్స్‌లో ఈ వారం పది రోజుల్లోనే 40 మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. నెల్లూరు జిల్లాలో 99 కేసులు నమోదయ్యాయి.


డీటీసీపీలో 4, సీఆర్డీయేలో 2 కేసులు

డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ), ఏపీ సీఆర్డీయే ప్రధాన కార్యాలయాల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు బయటపడడం కలవరానికి గురిచేస్తోంది. డీటీసీపీలో నలుగురికి, సీఆర్డీయేలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Updated Date - 2020-07-14T07:42:14+05:30 IST