అధోస్థానం!

ABN , First Publish Date - 2022-09-21T06:04:45+05:30 IST

అంతర్జాతీయ సూచికల్లో చివరాఖర్లో ఉండటం మనకు కొత్తకాదు కనుక, ఇటీవల విడుదలైన మానవాభివృద్ధి సూచీలో మనది 132వ స్థానం అన్న వార్త అంత ఆశ్చర్యం కలిగించేదేమీ...

అధోస్థానం!

అంతర్జాతీయ సూచికల్లో చివరాఖర్లో ఉండటం మనకు కొత్తకాదు కనుక, ఇటీవల విడుదలైన మానవాభివృద్ధి సూచీలో మనది 132వ స్థానం అన్న వార్త అంత ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. కరోనా కారణంగా, దానిని వెంటతరుముతూ వచ్చిన ఉక్రెయిన్ యుద్ధం వల్లా చాలా దేశాలు ఈ సూచీలో వెనుకడుగువేసినందున, అనాదిగా జాబితా చివర్లోనే ఉంటున్న భారతదేశం మరింత జారిపోవడం సహజం. దేశం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదనీ, మిగతాదేశాలన్నీ కరోనాతో దెబ్బతిన్నా మనం తట్టుకున్నామనీ పాలకులు చెప్పుకుంటున్న స్థితిలో ఈ నివేదిక మన డొల్లతనాన్ని ప్రశ్నిస్తున్నది. ప్రపంచస్థాయి నివేదికలను, విశ్లేషణలు, వ్యాఖ్యలను కుట్రలుగా తీసిపారేస్తున్నవారు ఈ ఐక్యరాజ్యసమితి లెక్కలనూ కాదంటారేమో! 


ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారతదేశం 191 దేశాల్లో 132వ స్థానాన్ని సంపాదించుకుంది. పొరుగున ఉన్న పాకిస్థాన్, నేపాల్, మయన్మార్‌లు భారత్ కంటే వెనుకబడివున్నప్పటికీ, తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, దానిని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలని అందరూ వాదించే శ్రీలంక 73వ స్థానంలో, నిరుపేద బంగ్లాదేశ్ 129 స్థానంలో, భూటాన్ 127వ స్థానంలో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం, పర్యావరణ విధ్వంసం ఇత్యాది పలు సంక్షోభాల కారణంగా అత్యధికదేశాలు మానవాభివృద్ధి విషయంలో క్షీణతనే నమోదుచేశాయి. గత ముప్పైరెండేళ్ళలో మొదటిసారిగా మానవాభివృద్ధి నిలిచిపోయిందని యుఎన్‌డీపీ కూడా వ్యాఖ్యానించింది. తదనుగుణంగానే ఇండియా హెచ్‌డీఐ కూడా తగ్గింది. అయితే, ప్రపంచ సగటుకంటే అది చాలా తక్కువగా ఉండటం, రెండు ర్యాంకులు పడిపోవడం వంటివి పరిగణనలోకి తీసుకోకతప్పదు. మరీ ముఖ్యంగా, కరోనా ప్రభావంతో ఈ సూచీ విలువ పతన క్రమాన్ని గమనిస్తే, భారతదేశంలో అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. హెచ్‌డిఐ విలువ కరోనా ప్రవేశించిన 2020లో కొంతతగ్గి, మరుసటి ఏడాది మైనస్ 1.4శాతంతో ఏకంగా అంతకు మూడురెట్లు పడిపోయింది. కానీ, ప్రపంచస్థాయిలో ఈ పతనం 2021లో 0.4 శాతంతో, 2020తో పోల్చితే బాగా తక్కువగానే ఉన్నది. భారతదేశ సూచీ విలువలు పడిపోయిన ప్రభావం మొత్తం దక్షిణాసియా ర్యాంకులను ప్రభావితం చేసింది. ఇందుకు భిన్నంగా, యూరప్, మధ్య ఆసియా, తూర్పు ఆసియాలో హెచ్‌డీఐ మెరుగ్గా ఉంది. చెప్పుకోదగ్గస్థాయి పతనం చూపించినవి మళ్ళీ లాటిన్ అమెరికా దేశాలే. 


మహమ్మారి కాలంలో మనం మరీ ఎక్కువగా దెబ్బతిన్న విషయాన్ని అటుంచితే, గత ఆరేళ్ళకాలంలో పతనం వేగంగా ఉన్నమాట నిజం. ఇదే కాలంలో చైనా 19 ర్యాంకులు, బంగ్లాదేశ్ 11, శ్రీలంక 9, భూటాన్, మాల్దీవుల వంటివి ఆరేసి ర్యాంకులు మెరుగుపరుచుకున్నాయి. ప్రస్తుత సూచీలో దేశం పనితీరు గణనీయంగా తగ్గిపోవడానికి ఆయుర్దాయం క్షీణతే ప్రధానకారణం. కరోనా తొలి సంవత్సరం సగటు ఆయుర్దాయంలో క్షీణత 1.1శాతం ఉంటే, మరుసటి ఏడాది అది 4.1శాతానికి హెచ్చింది. కానీ, పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో అందుకు భిన్నంగా మొదటి ఏడాది పతనమైనప్పటికీ, మరుసటి ఏడాది రెట్టింపు కోలుకుంది. 


అంతటి మహమ్మారి చుట్టుముట్టినప్పుడు అన్ని రంగాలపై దాని ప్రభావం తప్పదు కనుక, ఆయుర్దాయం నుంచి విద్య వరకూ సమస్తమూ దెబ్బతిని, మానవాభివృద్ధిని నిర్దేశించే ప్రమాణాలు పడిపోవచ్చు. కానీ, పతనం పెద్దగా లేని, ఉన్నా వెంటనే సరిదిద్దుకున్న దేశాలను లోతుగా గమనించినప్పుడు మన అడుగులు సక్రమంగా పడిందీ లేనిదీ తెలుసుకోవచ్చు, ఇకనైనా, పాలకులు నిబద్ధతతో వ్యవహరించగలిగితే, ప్రజారోగ్యం, విద్య, పోషకాహారం ఇత్యాది రంగాలపై దృష్టిపెడితే హెచ్‌డీఐ స్కోరు పెంచుకోవచ్చు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయన్న హెచ్చరికలను పాలకులు లక్ష్యపెట్టడం లేదు. సామాజికార్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇటువంటి సూచీలు మనకు తెలియచెబుతాయి. హెచ్‌డీఐ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాలన్నీ అంతరాలను విజయవంతంగా అధిగమించిన దేశాలే. ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థనీ, గ్రేట్ బ్రిటన్‌ను దాటేశామనీ చెప్పుకుంటున్న దేశం ప్రజాసంక్షేమానికి చేయవలసింది ఎంతో ఉన్నదని ఈ కొత్త మానవాభివృద్ధి సూచీ హెచ్చరిస్తున్నది.

Updated Date - 2022-09-21T06:04:45+05:30 IST