టమాటా రోడ్డున పడింది

ABN , First Publish Date - 2022-08-16T06:18:01+05:30 IST

రైతు కలల్తో కష్టంతో ఎర్రగా పండిన టమాటా ఆకు పచ్చ తోటకు వెలుతురు నిచ్చింది ఒక్కో మొక్కనంటిపెట్టుకుని...

టమాటా రోడ్డున పడింది

రైతు కలల్తో కష్టంతో ఎర్రగా పండిన టమాటా

ఆకు పచ్చ తోటకు వెలుతురు నిచ్చింది

ఒక్కో మొక్కనంటిపెట్టుకుని

ఎందరెందరు చిన్న చిన్న సూర్యుళ్ళో!

ఇక చీకటి లేదు, తోట లోంచి వెల్తురు వ్యాపించి

తననూ ఇంటినీ బతికిస్తుందని రైతు సంబరపడ్డాడు


ఇంతలో జోరున వాన! నిగనిగలాడే టమాటా తడిసి

ముప్పావొంతు పుట్టిన తోటలోనే కుళ్లిపోయింది

ఇక మిగిలిందే దక్కిందనుకుని ఖర్చునబడి కోత కోసి

ఆశల నిండుదనంతో మార్కెట్ చేరితే ఏది ఆసరా

వేలు పోసి కాపు గాసి పంట తీస్తే మార్కెట్ పెడ మొగం పెట్టింది

ఇవాళ కాకపోతే రేపు అమ్మే సరుకా టమాటా?

ముద్ద బంగారం కాదది నిల్వ వుండడానికి, ధర పలకడానికి-


నాల్కకు రుచినీ ఒంటికి చేవనూ ఇచ్చే అమూల్య ఫలం!

కానీ, కిలోకు ఒక్క రూపాయి ధర కూడా దక్కని దుర్దశ!

మృదువైన ఎరుపెరుపు కలలు ఒక్కసారిగా చితికిపోయాయి

సాగే బరువైందనుకుంటే పంట అమ్మకం అడుక్కోవడమయింది


తోట మట్టీ రైతు చెమటా సొమ్మూ వృధా అయిపోయాయి

ఏ దాపరికమూ లేని నిఖార్సయిన సేద్యం దిక్కు లేనిదయింది

కొనాల్సిన మార్కెటేమో కదలదు, భరోసాలు కాగితాల మీంచి లేవవు

మరింక చేసేదేమీ లేక బాధాగ్రహంతో టమాటాను రోడ్ల మీదనే

కుమ్మరించి రైతు ఖాళీ చేతులతో మిగిలిపోయాడు

కోతల తర్వాత మిగిలిన ఖాళీ తోట లాగా!


రోడ్డు మీద టమాటా ఇపుడు అనాధ! దాన్ని పండించిన రైతు కూడా!

అతడిపుడు నిలువెల్లా ఆవేశమై అడుగుతున్నాడు

‘ఇంకెప్పుడు మీరు పంటల్ని పట్టించుకుంటారు?

ఈ దేశంలో రైతు అసలు బతకాలా వద్దా?’


ఉత్సవాలు సరే, ముందు రైతుకు జవాబు చెప్పండి!

దర్భశయనం శ్రీనివాసాచార్య

(గిట్టుబాటు ధర లేక పంటను రోడ్లమీద పారబోస్తున్న 

టమాటా రైతులకు సంఘీభావంగా)


Updated Date - 2022-08-16T06:18:01+05:30 IST