టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ వేడి!

ABN , First Publish Date - 2021-08-26T08:53:54+05:30 IST

నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నటులు రానా దగ్గుబాటి, రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సహా పది మంది సినీ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ వేడి!

  • నాలుగేళ్ల నాటి కేసులో ఈడీ రంగ ప్రవేశం
  • రకుల్‌, రానా, రవితేజ, పూరీ, చార్మీ సహా 
  • మొత్తం 12 మందికి నోటీసులు జారీ
  • హాజరు కావాలని ఆదేశాలు??


హైదరాబాద్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నటులు రానా దగ్గుబాటి, రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సహా పది మంది సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించనుంది. డ్రగ్స్‌ క్రయ విక్రయాల్లో భారీగా మనీలాండరింగ్‌ జరిగిందనే సమాచారం మేరకు ఈడీ రంగంలోకి దిగింది.


ఎక్సైజ్‌ శాఖ నుంచి వివరాలు సేకరించి సినీ ప్రముఖులు సహా మొత్తం 12 మందికి బుధవారం నోటీసులు జారీ చేసింది. వీరిలో సినీ నటులు రకుల్‌, రానా, రవితేజ పూరీతో పాటు చార్మీ కౌర్‌, నవదీప్‌, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, నందు, తరుణ్‌ ఉన్నారు. మిగతా ఇద్దరిలో ఒకరు రవితేజ కారు డ్రైవర్‌ శ్రీనివాస్‌, మరొకరు ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌. ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 22 వరకు నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో రకుల్‌, రానా, రవిజేత పూరీని నిందితులుగా చేర్చలేదని, మనీలాండరింగ్‌లో వీరి ప్రమేయం ఉందని చెప్పడం తొందరపాటే అవుతుందని ఈడీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్టు 30న పూరీ, సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ , 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ కేసును తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలోని సిట్‌ దర్యాప్తు చేస్తోంది. కోర్టులో చార్జీషీట్‌ కూడా దాఖలు చేసింది. ఈ సమయంలో ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. 


నాలుగేళ్ల క్రితం సంచలనం

2017  జూలైలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురిని ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసు విచారణలో పలువురు సినీప్రముఖుల పేర్లను నిందితులు వెల్లడించడం సంచలనమైంది. ఇప్పటికే సదరు సినీప్రముఖులను సిట్‌ విచారించింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో 12 కేసులను నమోదు చేసి, 30 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. 11 చార్జీషీట్లను కోర్టులో దర్యాప్తు అధికారులు దాఖలు చేశారు. ఈ కేసులో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ అమ్మకాలు, కొనుగోలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ను వినియోగించినట్లు సిట్‌ గుర్తించింది. సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పెద్ద మొత్తంలో మనీలాండరింగ్‌ జరిగి ఉంటుందని ఈడీ భావిస్తోంది. 

Updated Date - 2021-08-26T08:53:54+05:30 IST