పార్టీ విధేయుడికే పట్టం

ABN , First Publish Date - 2022-01-27T06:22:01+05:30 IST

కామారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా పార్టీ విధేయుడికే పార్టీ అధిష్ఠానం పట్టం కట్టింది. కామారెడ్డికి చెందిన మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్‌కు జిల్లా అధ్యక్ష పదవిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టబెట్టారు.

పార్టీ విధేయుడికే పట్టం
ముజిబొద్దిన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభుత్వ విప్‌

- పది మంది ఆశించినా చివరకు ముజీబ్‌కే పట్టం

- పార్టీ పదవులను పొందడమే కాకుండా పార్టీ పటిష్టవంతానికి కృషి చేసినందుకే..

కామారెడ్డి, జనవరి 26: కామారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా పార్టీ విధేయుడికే పార్టీ అధిష్ఠానం పట్టం కట్టింది. కామారెడ్డికి చెందిన మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్‌కు జిల్లా అధ్యక్ష పదవిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టబెట్టారు. పార్టీ సమావేశాలకు ముందుగా వెళ్లి సభలు, సమావేశాలకు దగ్గరుండి పనిచేసే నాయకునిగా గుర్తింపు పొందిన ముజిబుద్దీన్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ తగిన గుర్తింపును ఇచ్చింది. గతంలో కామారెడ్డి పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే కాకుండా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో, వరంగల్‌, గజ్వెల్‌, హైదరాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి సమావేశాలన్నింటికీ తానై పార్టీ కోసం పని చేయడంతోనే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితకు విధేయుడిగా పని చేశారు. పార్టీ కోసం ఎక్కడ పిలుపునిచ్చినా అక్కడికి వెళ్లి పార్టీ బ్యానర్లు, కటౌట్‌ల ఏర్పాట్లు సభ సమావేశ స్థలాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా పని చేయడంతో అధిష్ఠానం దృష్టిలో మంచి విధేయుడిగా పేరు పొందారు. ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించి భంగపాటు పడిన ముజిబుద్దీన్‌కు తగిన గుర్తింపు నిస్తామని పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో పార్టీ విధేయుడిగా ఉంటూ పని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవిని మొదటిసారిగా ముజిబుద్దీన్‌కు అధిష్ఠానం కట్టబెట్టడంతో ఆయన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించినట్లయింది.  పార్టీ కార్యక్రమం ఏదైనా ముందుండి పని చేయగల నాయకుడిగా గుర్తింపు పొందినా ఆయన ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కు అత్యంత విశ్వాసనీయుడిగా పని చేస్తున్నారు. ముజిబుద్దీన్‌కు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడంతో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు తన అనుచరులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తన ఇంటికి ముజిబ్‌ను పిలిపించి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, రామారెడ్డి, రాజంపేట మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున జిల్లా కేంద్రానికి తరలివచ్చి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌లకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని పార్టీ పటిష్టవంతానికి మరింత కృషి చేస్తానని ముజిబుద్దీన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు. పార్టీ పదవిని కట్టబెట్టినందుకు అధిష్ఠానానికి కృతజ్ఞతలను తెలిపారు.

10 మంది ఆశించినా చివరకు ముజీబ్‌కే పట్టం

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి కోసం జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, లోయపల్లి నర్సింగ్‌రావు, గండ్ర మధుసూదన్‌రావు, బాన్సువాడకు చెందిన స్పీకర్‌ పోచారం తనయులు ఇద్దరు, గాంఽధారి మండలానికి చెందిన తానాజీరావు, సత్యంరావు, ఎల్లారెడ్డికి చెందిన మరో ఇద్దరు నాయకులు జిల్లా అధ్యక్ష పదవిని ఆశించి ప్రయత్నించారు. జిల్లా అధ్యక్ష పదవికి పోటీలో ఉండకున్న పార్టీ విధేయుడిగా పని చేస్తున్న ముజిబుద్దీన్‌ సేవలను గుర్తించిన అధిష్ఠానం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పట్టం కట్టింది. చివరి వరకు జిల్లా అధ్యక్ష పదవిని ఆశించి ప్రయత్నాలు చేసిన వారు పదవి రాకపోవడంతో కొంత నారాజులో ఉన్నారు. స్పీకర్‌ చెప్పిన వ్యక్తులకే అధిష్ఠానం పట్టం కడుతుందని జిల్లా నాయకులు ఆశించారు. నాయకుల ఆశలను కాకుండా పార్టీ విధేయుడిగా పని చేస్తున్న వారిని గుర్తించి అధిష్ఠానం ముజిబుద్దీన్‌కు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్లయింది. జిల్లాలో పార్టీని అన్ని మండలాల్లో నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టవంతం చేయడంతో పాటు రాష్ట్రంలోనే కామారెడ్డి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును ముందుగా చేయించడంలో కీలకపాత్ర పోషించిన ముజిబుద్దీన్‌ నిజామాబాద్‌ జిల్లా సభ్యత్వన మోదుకు ఇన్‌చార్జీగా పార్టీ నియమించింది. ఎక్కువగా కామారెడ్డి జిల్లాకే సేవలు అందించడంతో పాటు పార్టీ పటిష్టవంతానికి కృషి చేస్తున్నారనే పేరు సంపాదించుకున్న ముజిబుద్దీన్‌కు అధిష్ఠానం పట్టం కట్టినట్లయింది.

Updated Date - 2022-01-27T06:22:01+05:30 IST