Abn logo
Sep 25 2021 @ 23:23PM

పార్టీ విధేయుడికే పట్టం

తుంపాల అప్పారావు

తుంపాల అప్పారావును వరించిన జడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవి

సబ్బవరం, సెప్టెంబరు 25 : వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందించిన తుంపాల అప్పారావును జడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవి వరించింది. శనివారం ఆయన జడ్పీ వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల మండలంలోని వైసీపీ శ్రేణులతో పాటు ఎల్లుపి పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అప్పారావుది రైతు కుటుంబం. ఎస్‌ఎస్‌సీ వరకు చదువుకున్న ఆయనకు భార్య పార్వతి, కుమారులు ప్రసాద్‌, సాయి ఉన్నారు. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ మండల కన్వీనర్‌గా 2019లో వైసీపీ విజయానికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ చొరవతో పార్టీ అధిష్ఠానం జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసి 4,015 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన గతంలో ఎల్లుప్పి పంచాయతీకి రెండుసార్లు ఉప సర్పంచ్‌గా, బోదివలస సెగ్మెంట్‌కు రెండు పర్యాయాలు ఎంపీటీసీగా, సబ్బవరం కో- ఆపరేటివ్‌ సంస్థకు రెండుసార్లు డైరెక్టర్‌గా పని చేశారు. ఆయనకు మండలంలో సౌమ్యుడిగా పేరుంది.