పులి సంచరిస్తోంది... తస్మాత్‌ జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-06-29T05:58:26+05:30 IST

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలో సుమారు రెండు వారాలుగా సంచరిస్తున్న పెద్దపులి (రాయల్‌ బెంగాల్‌ టైగర్‌) సోమవారం రాత్రి పాయకరావుపేట పక్కనే ఉన్న తుని మండలంలోకి వచ్చినట్టు అటవీశాఖ అధికారులు చెప్పడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

పులి సంచరిస్తోంది... తస్మాత్‌ జాగ్రత్త!
నక్కపల్లి మండలం చీడిక కొత్తూరు గ్రామస్థులతో మాట్లాడుతున్న అటవీ శాఖ సిబ్బంది

కాకినాడ జిల్లా సరిహద్దు మండలాల్లో అటవీ శాఖ హెచ్చరికలు

గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది


పాయకరావుపేట/ నక్కపల్లి, జూన్‌ 28: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలో సుమారు రెండు వారాలుగా సంచరిస్తున్న పెద్దపులి (రాయల్‌ బెంగాల్‌ టైగర్‌) సోమవారం రాత్రి పాయకరావుపేట పక్కనే ఉన్న తుని మండలంలోకి వచ్చినట్టు అటవీశాఖ అధికారులు చెప్పడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పాయకరావుపేట-తుని పట్టణాలకు ఆనుకుని వున్న తాండవ నది పరీవాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని, అందువల్ల నక్కపల్లి మండలంలోని మెరక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం అటవీ శాఖ సిబ్బంది మండలంలోని చీడిక, చీడిక కొత్తూరు, రేబాక, తిరుపతిపాలెం, ముకుందరాజుపేట, రమణయ్యపేట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొండప్రాంతంలోకి వచ్చిన పెద్దపులి    సుమారు రెండు వారాలపాటు చుట్టపక్కల సంచరించింది.   తరువాత అక్కడి నుంచి రౌతులపూడి మండలంలోకి వచ్చింది. సోమవారం రాత్రి తాండవ నది అవతల ఉన్న తుని మండలం కుమ్మరిలోవ ప్రాంతంలో రోడ్డు దాటినట్టు  పాదముద్రల ద్వారా స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు, అటవీశాఖ అధికారులకు తెలియపరిచారు. కాకినాడ ఎఫ్‌ఆర్‌ఓ ధనరాజు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది వచ్చి పరిశీలించారు. ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి ఈ ప్రాంతానికి వచ్చినట్టు గుర్తించారు. కుమ్మరిలోవ ప్రాంతంలో రోడ్డు దాటిన పెద్దపులి అరటితోటల్లో నుంచి తాండవ నది, కోటనందూరు రోడ్డు మీదుగా వంతెన దాటి వెళ్లినట్టు గుర్తించారు. దీంతో పాయకరావుపేట నుంచి కోటవురట్ల మండలం వరకు విస్తరించి ఉన్న కొండల్లో పెద్దపులి సంచరించే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో పులి మకాం మార్చుకుంటుందని, అందువల్ల ఆయా గ్రామాల ప్రజలు కొండల ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ సిబ్బంది సూచిస్తున్నారు.


Updated Date - 2022-06-29T05:58:26+05:30 IST