ముగ్గురమ్మలు... మూడు గుణాలకు ప్రతీకలు

ABN , First Publish Date - 2020-10-23T05:30:00+05:30 IST

దివ్యత్వంలోని స్త్రీ స్వభావానికి అంకితం చేసిన పండుగ... భారతీయుల నవరాత్రి పండుగ. దేవీ ఆరాధన భూమిపై అత్యంత ప్రాచీనమైన ఆరాధనా విధానం...

ముగ్గురమ్మలు... మూడు గుణాలకు ప్రతీకలు

దివ్యత్వంలోని స్త్రీ స్వభావానికి అంకితం చేసిన పండుగ... భారతీయుల నవరాత్రి పండుగ. దేవీ ఆరాధన భూమిపై అత్యంత ప్రాచీనమైన ఆరాధనా విధానం. భారతదేశంలోనే కాదు, ఐరోపా, అరేబియా, ఇంకా ఆఫ్రికాలోని అధిక శాతం ప్రాంతాలలో అనాదిగా ఇది కొనసాగుతూ వచ్చింది. దురదృష్టవశాత్తూ, పాశ్చాత్య దేశాలలో అన్యమతవాదాలనూ, బహుదేవతా ఆరాధననూ, విగ్రహారాధనగా పరిగణించే వాటినీ, వాటి ఆనవాళ్ళన్నిటినీ తుడిచిపెట్టే ప్రయత్నంలో దేవీ ఆలయాలన్నీ నేలమట్టం అయ్యాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సైతం ఇదే జరిగింది. 


కానీ దేవీ ఆరాధన ఇంకా కొనసాగుతున్న సంస్కృతి... మన భారతీయ సంస్కృతి. మన అవసరాలకు అనుగుణంగా దేవతలను సృష్టించుకొనే స్వేచ్ఛ కల్పించిన సంస్కృతి కూడా ఇదే. ప్రతి గ్రామానికీ తమ నిర్దిష్టమైన స్థానిక అవసరాలకు అనుగుణంగా సొంత ఆలయాన్ని ఏర్పాటు చేసుకొనే వీలును ఇది కల్పించింది. దక్షిణ భారతదేశంలోని ప్రతి గ్రామంలో ఇప్పటికీ ఒక అమ్మవారి ఆలయం లేదా దేవీ ఆలయం ఉండడం గమనించవచ్చు.


స్త్రీతత్త్వంలోని మూడు పార్శ్వాలుగా దుర్గ, లక్ష్మి, సరస్వతులను పరిగణిస్తారు. భూమికీ, సూర్యుడికీ, చంద్రుడికీ, అలాగే తామసం (జడత్వం), రాజసం (కార్యాచరణ, అభిరుచి), సాత్త్వికం (అతీతంగా ఉండడం, జ్ఞానం, స్వచ్ఛత) అనే లక్షణాలకు ప్రతీకలుగా వారిని చూస్తారు. బలాన్ని, శక్తిని ఆశించేవారు భూదేవినీ లేదా దుర్గా దేవి, కాళికా దేవి వంటి స్త్రీ శక్తి రూపాలనూ ఆరాధిస్తారు. సంపద, అభిరుచి, భౌతిక అంశాలు కోరుకొనే వారు లక్ష్మీ దేవిని లేదా సూర్యుణ్ణి ఆరాధిస్తారు. జ్ఞానం, మోక్షం పొందాలనీ, అనిత్యమైన శరీరం తాలూకు పరిమితులను అధిగమించాలని ఆశించే వారు సరస్వతీ దేవిని  లేదా చంద్రుణ్ణీ ఆరాధిస్తారు. తొమ్మిది రోజుల నవరాత్రి వర్గీకరణ ఈ మూడు లక్షణాలకు అనుగుణంగా జరిగింది. మొదటి మూడు రోజులూ దుర్గాదేవికీ, తరువాత మూడు రోజులూ లక్ష్మీదేవికీ, చివరి మూడు రోజులూ సరస్వతీదేవికీ ప్రత్యేకించారు. పదో రోజైన విజయదశమి మూడు గుణాలపై విజయానికి నిదర్శనం. ఇది కేవలం ప్రతీక మాత్రమే కాదు, శక్తి స్థాయిలో కూడా ఇది నిజం. మనుషులుగా మనం భూమి నుంచి ఉద్భవిస్తాం. చురుగ్గా ఉంటాం. కొంతకాలం తరువాత జడత్వంలోకి జారిపోతాం. మనకు మాత్రమే కాదు, యావత్‌ విశ్వానికీ ఇలా జరుగుతుంది. విశ్వం జడత్వ స్థితి నుంచీ ఉద్భవిస్తుంది. క్రియాశీలంగా మారుతుంది. మళ్ళీ జడత్వంలోకి వెళ్తుంది. అయితే ఈ చక్రాన్ని అధిగమించే సామర్థ్యం మనకు ఉంది. అమ్మవారిలోని మొదటి రెండు పార్శ్వాలూ మనుషుల మనుగడకూ, శ్రేయస్సుకూ అవసరం. మూడోది అన్నిటికీ అతీతంగా వెళ్ళాలనే ఆకాంక్ష. సరస్వతీ దేవి కిందకు దిగి వచ్చేలా చేయాలంటే అపారమైన కృషి కావాలి. లేకపోతే ఆమెను చేరుకోలేం.

- సద్గురు జగ్గీ వాసుదేవ్‌


Updated Date - 2020-10-23T05:30:00+05:30 IST