ముంచుకొస్తున్న మతవాదం ముప్పు

ABN , First Publish Date - 2020-11-18T05:37:59+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో స్థానిక రాజకీయ కారణాలతో బిజెపి స్వల్ప మెజార్టీతో గెలిచింది. గెలుపు-ఓటములు టిఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కాదు...

ముంచుకొస్తున్న మతవాదం ముప్పు

తెలంగాణ సహజీవన సంస్కృతిపై బీజేపీ దాడి చేసి మధ్యయుగం లోకి తీసుకు పోవాలనే ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకులకు, అరాచకవాదులకు, మూకవాదులకు తెలంగాణలో స్థానం లేదు. తెలంగాణను మతవాదుల నుండి రక్షించుకోవ డానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు ముందుకు రావాలి.


దుబ్బాక ఉప ఎన్నికలో స్థానిక రాజకీయ కారణాలతో బిజెపి స్వల్ప మెజార్టీతో గెలిచింది. గెలుపు-ఓటములు టిఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కాదు. అందుకే ఓటమిని వినమ్రంగా ఒప్పుకొని, కారణాలను సమీక్షించుకొని ప్రజల సేవకు పునరంకితం అవుతామని మంత్రి  కేటీఆర్ ప్రకటించారు.  అయితే బిజెపి నాయకులు  తామే తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని, తామే దేశభక్తులమని,  తమ పార్టీలో సభ్యులు కాని హిందువులందరూ హిందువులు కానట్లుగా, తమదే హిందువుల పార్టీ అని ప్రగల్భాలు పలుకుతున్నారు. బీజేపీ దేశభక్తి వట్టి బూటకం. దేశాన్ని మతం పేరిట, హిందూ మతాన్ని కులాల పేరిట విభజించడం తప్ప వీరు దేశానికి చేసింది మేలు ఏమీలేదు. హింస, ద్వేషం, అసహనం, అసమానత్వం, కులతత్వం, మతతత్వం లతో ప్రజల మనస్సులో విభజన, విద్వేష బీజాలు నింపడం తప్ప  బీజేపీ వారు చేసింది గుండు సున్నా అని మనకు చరిత్ర చెబుతుంది. బిజెపి హిందుత్వ రాజకీయ హిందూవాదమే. 


దేశభక్తి, జాతీయత అంటే ఏమిటి? దేశమంటే సరిహద్దులు, మట్టి, రాళ్ళా? దేశమంటే గురజాడ అన్నట్లుగా మనుషులు కాదా? భారతదేశం అంటే, భారత ప్రజలంటే దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, పేదలు, మత మైనార్టీలూ కాదా? అభివృద్ధిలో వీరికి భాగస్వామ్యం లేదా? దళితులకు, బలహీన వర్గాలకు, మహిళలకు రిజర్వేషన్లను బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ పదే పదే ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? హిందూ మతస్థులు, దేశ జనాభాలో సగభాగమైన  బీసీలకు రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? 


హిందూ మతస్థులలో అధిక సంఖ్యాకులుగా ఉన్న శూద్రులు, ఆదిశూద్రులు, మహిళలకు సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీకి ఎందుకు అంత వ్యతిరేకత? పూజారి, వ్యాపార వర్గాల వారిని ప్రథమశ్రేణి పౌరులుగా, శూద్రులు, ఆదిశూద్రులు, మహిళలను రెండవ శ్రేణి పౌరులుగా చూసే మనుస్మృతిపై బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎందుకంత మక్కువ? ముస్లిం మైనార్టీలను ఊహాజనిత శత్రువులుగా చూపిస్తూ, మెజార్టీ హిందువులను (శూద్ర, ఆదిశూద్ర, మహిళ) పాలితులుగా, మైనార్టీ హిందువులను (పూజారి, వ్యాపార వర్గాలు) పాలకులుగా ఉండేట్లు చేయడమే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ల లక్ష్యం కాదా? మీ అసలు రహస్య ఎజెండా ఇదే కదా! 


ఈ దేశంలోని రైతులు, కూలీలు, కార్మికులు శూద్రులు, ఆదిశూద్రులనేది వాస్తవం. మరి రైతులను, కార్మికులను తీరని  అవస్థల పాలు జేసే చట్టాలను మోదీ ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చింది? రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చుననే సాకుతో కార్పొరేట్‌ కంపెనీలు, దళారీలు ఎక్కడనైనా పంట  ఉత్పత్తులను కొనే సౌలభ్యాన్ని కల్పించడమే   కొత్త  వ్యవసాయ చట్టాల లక్ష్యం అనేది స్పష్టం.  అందుకే రైతులు దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతావనిలో ఆ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దసరా పర్వదినాన రావణ దహనానికి బదులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీన్ని బట్టి  దేశంలో రైతులు బీజేపీని ఏవిధంగా వ్యతిరేకిస్తున్నారో మనకు అర్థం అవుతుంది. మొక్కకజొన్నలను అంతర్జాతీయ మార్కెట్‌లో విదేశాల నుండి దిగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తూ వాటిపై సుంకాలను తగ్గించారు. ఫలితంగా తెలంగాణలో మొక్కజొన్న రైతులు మార్కెట్‌లో ధరలు లేక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో మొక్కజొన్న ధరలు పడిపోవడానికి మోదీ ప్రభుత్వం కారణం కాదా?


తన పాలనలో గుజరాత్‌ అపూర్వంగా పురోగమించిందని, భారతదేశం మరింతగా వెలుగొందేలా చేస్తాననే హామీతో  మోదీ అధికారంలోకి వచ్చారు. కరోనా విలయంలో లక్షలాది వలస కార్మికులు వేలాది కిలో మీటర్ల దూరాన ఉన్నతమ స్వస్థలాలకు కాలినడకన వెళ్ళవలసిన దుస్థితి పాలయ్యారు. దీన్ని బట్టి ‘సబ్ కా సాత్‌-సబ్‌కా వికాస్‌’ నినాదం వట్టి బూటకమని తేలిపోయింది. 


నిత్యం స్వదేశీ మంత్రం జపించే బీజేపీ  వారు ప్రభుత్వ రంగ సంస్థలయిన బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేస్, బ్యాంకింగ్‌, మైనింగ్‌ లాంటి వాటిని ప్రైవేటీకరించడం ఎవరి ప్రయోజనాల కోసం? రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను  అనుమతించడం ఎలా దేశభక్తి అవుతుంది? డిమానిటైజేషన్‌, జిఎస్టీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ తీసి, ఈ రోజు జీడీపీ  వృద్ధి -22 శాతం మేరకు పడిపోవడానికి మోదీ ప్రభుత్వం కారణం కాదా? డిమానిటైజేషన్‌ ద్వారా నల్ల ధనాన్ని బయటకు రప్పిస్తానని ఊదరగొట్టిన నరేంద్ర మోదీ జాతీయ బ్యాంకుల ద్వారా తన మిత్రులకు వేల కోట్ల రూపాయలను పంచిపెట్టింది వాస్తవం కాదా? 


బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లు నిత్యం వీరులుగా కీర్తించే సావర్‌కర్‌, గోల్‌వంకర్‌లు, వారి హిందూ మహాసభ, దేశ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ పాలన కొనసాగాలని కోరుకున్నది వాస్తవం కాదా? చరిత్ర చెబుతున్న సత్యం ఇదే కదా! సావర్‌కర్‌, తాను జైలు నుండి విడుదల కావడం కోసం బ్రిటీష్‌ వారికి వ్రాసిన క్షమాపణ పత్రాలు నేటికి గ్రంథాలయాలలో భద్రంగా ఉంచబడ్డాయి. తెలంగాణ బిజెపి నాయకులు వాటిని చదివితే బాగుంటుంది. మహాత్మాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తే, సావర్‌కర్‌ 'స్టిక్‌ ది పోస్ట్‌' అనే నినాదంతో బ్రిటీష్‌ అధికారానికి సంపూర్ణ సహకారం అందించడం వాస్తవం కాదా? గాంధీని చంపిన గాడ్సెకు సావర్‌కర్‌ సహకరించాడనేది చారిత్రక సత్యం. అందుకే బిజెపి నాయకులు గాంధీని చంపిన గాడ్సెను దేశభక్తునిగా పదే పదే కొనియాడతారు. 


భారత స్వాతంత్య్ర పోరాటంలో వీరి పాత్ర శూన్యం అయినప్పటికి స్వాతంత్య్ర పోరాట సందర్భంలో దేశంలో విభజన వాదాన్ని పెంపొందించడంలో వీరి పాత్ర ఎక్కువ. కాంగ్రెస్‌, సోషలిస్టు, కమ్యూనిస్టులు ఏకజాతి సిద్ధాంతంతో దేశమంతా ఐక్యంగా ఉండాలని, ఇండియా ఒకే దేశంగా ఏర్పడాలని కోరుకున్నారు. కాని ముస్లిం లీగ్‌ (అలీ జిన్నా) మరియు హిందూ మహాసభ దేశం మత ప్రాతిపదికన విడిపోవాలని కోరుకున్నారు. మరి దేశ స్వతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి, దేశభక్త పార్టీ ఎట్లా అవుతుందో బిజెపి నాయకులు చెప్పాలి.


భారత స్వాతంత్య్ర పోరాటంలోనే కాదు, తెలంగాణ సాయుధ పారాటంలోగానీ, నిజాం వ్యతిరేక హైదరాబాద్‌ విలీన ఉద్యమంలోగాని సంఘ్ పరివార్ పాత్ర ఏమీ లేదు. తెలంగాణలో నిజాం భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు నాయకత్వం వహిస్తే హైదరాబాద్‌ విలీనానికి కాంగ్రెస్‌-నెహ్రూ కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వీరి పాత్ర ఇత్తువేసి పోత్తుగూడడం తప్ప మరొకటి కాదు. 


తెలంగాణ ఏర్పాటు ఇష్టంలేని బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై విషం చిమ్ముతున్నది. బిడ్డను బ్రతికించి, తల్లిని చంపారని ప్రధాని మోదీ పదే పదే అనడం, తలుపులు మూసి అక్రమంగా తెలంగాణ ఇచ్చారని అమిత్‌షా అనడం ద్వారా బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టంలేదని మనకు అర్థం అవుతుంది.


సుదీర్ఘ పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడ్డది. స్వయంపాలన ఏర్పాటు చేసుకున్న తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలతో ప్రగతి పథంలో పయనిస్తుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ సహజీవన సంస్కృతిపై బీజేపీ దాడి చేసి మధ్యయుగంలోకి తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకులకు, అరాచకవాదులకు, మూకవాదులకు తెలంగాణలో స్థానం లేదు. తెలంగాణను మతవాదుల నుండి రక్షించుకోవడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు ముందుకు రావాలి. 

డి. రాజారాం యాదవ్‌

తెలంగాణ రాష్ట్ర సమితి

Updated Date - 2020-11-18T05:37:59+05:30 IST