చిత్తూరు జిల్లా ముంగిట మూడో ముప్పు..

ABN , First Publish Date - 2022-01-11T07:01:00+05:30 IST

కొవిడ్‌ మూడో అల ముంచుకొచ్చేస్తోంది.

చిత్తూరు జిల్లా ముంగిట మూడో ముప్పు..

  • ఆందోళన పెడుతున్న కొవిడ్‌ కేసుల గ్రాఫ్‌ 
  • సిద్ధంగా ఉన్నామంటున్న యంత్రాంగం


కొవిడ్‌ మూడో అల ముంచుకొచ్చేస్తోంది. వారం రోజులుగా జిల్లాలో పెరుగుతున్న కేసుల తీరును బట్టీ మూడో ముప్పు ముంగిట ప్రజలు ఉన్నారని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై తొలి అల నాటి రోజులను గుర్తు చేసుకుని, అప్పటిలా ఖచ్చితంగా ఉండకపోతే మాత్రం తొలి రెండు అలల కాలంలో ఉక్కిరిబిక్కిరి అయిన రీతిలోనే జిల్లా అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ప్రజలు కూడా తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమూహాలను, ప్రయాణాలను నియంత్రించుకోవా లని సూచిస్తున్నారు. రెండు కొవిడ్‌ అలలు జిల్లాలో చేసిన మరణమృదంగం ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్న సమయంలో మూడో ముప్పు మొదలైపోయింది. 


తిరుపతి - ఆంధ్రజ్యోతి: వారం రోజులుగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులను పరిశీలిస్తే మూడో దశలోకి జిల్లా ప్రవేశించినట్టే అని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ బాధితులకు కృత్రిమ ఆక్సిజన్‌ అసవరం ప్రస్తుతం పెద్దగా లేనప్పటికీ ఒమైక్రాన్‌ వేరియంట్‌ విస్తృతంగా వ్యాప్తి చెందే క్రమంలో ఆ పరిస్థితి కూడా రావొచ్చంటున్నారు.  దీంతో  ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. పలురకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొవిడ్‌ బారిన పడితే ఏ మేరకు వైద్యసాయం అందుతుందో అనే ఆందోళన మొదలైంది.  కేసులు విపరీతంగా పెరిగితే మాత్రం ఆస్పత్రుల్లో వైద్య సేవల కొరత ఏర్పడి మరణాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం రాత్రి కర్ఫ్యూను జిల్లాలో పలుచోట్ల అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతిలో సోమవారం నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష చెప్పారు. పండుగ సెలవుల్లో ఉన్న విద్యా సంస్థలను ఆ తర్వాత తెరుస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. కేసుల పెరుగుదల తీవ్రతను బట్టీ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. అయితే మూడో దశ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దంగా ఉన్నామని అధికార యంత్రాంగం చెబుతోంది. తొలి,మలి దశల్లో జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకుని మూడో దశను సమర్థవంతంగా ఎదుర్కొంటామని జిల్లా యంత్రాంగం చెబుతోంది.


సిద్ధమవుతున్న ఆసుపత్రులు 

ఇక మూడోవేవ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లాలో 4888 పడకలు అందుబాటులో తెచ్చామని జేసీ (అభివృద్ధి) శ్రీఽధర్‌ తెలిపారు. ఇందులో 589 ఐసీయూ, 2378 ఆక్సిజన్‌, 1921 సాధారణ పడకలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీలో 2 ఆక్సిజన్‌ సిలిండర్లు, సీహెచ్‌సీలో 50 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని చెప్పారు. కొవిడ్‌ కోసమే 2157 మంది వైద్యసిబ్బంది సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. స్టేట్‌ కొవిడ్‌ సెంటర్‌ అయిన స్విమ్స్‌ పద్మావతి ఆస్పత్రిలో 733 ఆక్సిజన్‌ పడకలు సిద్ధంచేశామని, వీటిలో 78 వెంటిలేటెడ్‌ బెడ్స్‌ వున్నాయని స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ చెప్పారు. గతంలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ కోసం ఇబ్బంది పడినట్టు కాకుండా ముందస్తుగానే ఆయా ఏజెన్సీలను అప్రమత్తం చేశామన్నారు. రుయా ఆస్పత్రిలో 126 ఐసీయూ బెడ్స్‌, 620 ఆక్సిజన్‌ బెడ్స్‌, 190 చిల్డ్రన్స్‌ బెడ్స్‌, 319 సాధారణ పడకలతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్లు, జనరేటర్స్‌ 4 చొప్పున సిద్ధం చేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి తెలిపారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో మూడో దశకోసం 40 బెడ్లు కేటాయించారు. అయితే ఇక్కడ సిబ్బంది కొరత కనిపిస్తోంది. ఇక ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను మూడో వేవ్‌ కొవిడ్‌ బాధితులకు కేటాయించాలని వైద్యశాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా కొవిడ్‌ వార్డులను సిద్ధం చేసుకుంటున్నాయి. 


రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు

తిరుపతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 244 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. కాగా యాక్టివ్‌ కేసుల విషయంలో కూడా 1110 కేసులతో జిల్లాయే రాష్ట్రంలో అత్యధిక కేసులు కలిగివుంది. ఈ నెల 4వ తేదీ నుంచీ జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య పెరుగుతునే వుంది. 4న 55 కేసులు, 5న 68 కేసులు, 6న 96 కేసులు, 7న 150 కేసులు, 8న 175 కేసులు, 9న 250 కేసులు చొప్పున నమోదయ్యాయి. తాజాగా ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 244 పాజిటివ్‌ కేసులను ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకుంటోంది. సరిగ్గా వారం రోజుల్లోనే వైరస్‌ కేసులు అనేక రెట్లు పెరిగాయి. ఈనెల 3వ తేదీన ఉదయానికి నమోదైన కేసులు కేవలం 13. అప్పటికి జిల్లాలో వున్న యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు కూడా కేవలం 228 మాత్రమే. కేవలం వారం రోజుల్లోనే యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1110కి చేరుకుంది. కాగా కొత్తగా గుర్తించిన కేసులు తిరుపతి నగరంలో 95, చిత్తూరులో 42, మదనపల్లెలో 15, తిరుపతి రూరల్‌లో 13, శ్రీకాళహస్తిలో 10, జీడీనెల్లూరులో 8, పుత్తూరు, చిన్నగొట్టిగల్లు మండలాల్లో 7 వంతున, బంగారుపాళ్యంలో 5, పీలేరు, ఏర్పేడు మడలాల్లో 4 చొప్పున, గుడిపాలలో 3, పుంగనూరు, ఐరాల, పాకాల, చంద్రగిరి, గంగవరం, పూతలపట్టు, పెనుమూరు, చౌడేపల్లె, రామచంద్రాపురం మండలాల్లో 2 వంతున, నగరి, పలమనేరు, రేణిగుంట, యాదమరి, పిచ్చాటూరు, వరదయ్యపాలెం, విజయపురం, ఎర్రావారిపాలెం, సదుం, ములకలచెరువు, బి.కొత్తకోట, కార్వేటినగరం, పీటీఎం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.


తక్షణం చేయాల్సినవి

అర్హులైన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలి.

60 యేళ్లు దాటిన వారిలో రెండు డోసులు వేసుకున్నవారు 9 నెలల తర్వాత బూస్టర్‌ డోసు వేసుకోవాలి.

మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం జీవనంలో భాగం అయిపోవాలి. 

ప్రయాణాలను వీలైనంతవరకూ తగ్గించుకోవాలి.

పండుగ సంబరాల్లో సమూహాలకు దూరంగా ఉండాలి.

Updated Date - 2022-01-11T07:01:00+05:30 IST