రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారు

ABN , First Publish Date - 2021-10-20T05:00:20+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకులు రోజుకో దొంగ ఉత్తరం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారు
హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

- దళితబంధు వద్దని లేఖ రాసినట్లు నిరూపిస్తారా

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌, అక్టోబరు 19: టీఆర్‌ఎస్‌ నాయకులు రోజుకో దొంగ ఉత్తరం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌, శాలపల్లి-ఇందిరానగర్‌, రంగాపూర్‌, రాజాపల్లి, రాంపూర్‌, చిన్నపాపయ్యపల్లి, కనుకులగిద్దె గ్రామాల్లో ఈటల రాజేందర్‌  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని మొదట ఇక్కడ ప్రారంభించలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారన్నారు. సీఎం కేసీఆర్‌కు నిజంగా ఈ పథకంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని తానే డిమాండ్‌ చేశానన్నారు. ఈ పథకంపై కలెక్టర్ల పెత్తనం, బ్యాంకుల పెత్తనం ఉండద్దని కోరానన్నారు. దళితబంధు ప్రకటించి 70 రోజులు గడిచినా అందరికీ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ దళితబంధు ఇవ్వకపోతే దళితుల తరుపున తానే కొట్లాడుతానన్నారు. దళితులకు ప్రకటించిన మూడెకరాల భూమిని ఎవరు అడ్డుకున్నారని, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితబంధు వద్దని నేను లేఖ రాసినట్లు నిరూపిస్తావా...? చెల్పూర్‌లోని పోచమ్మ తల్లి గుడికి తడి బట్టలతో వస్తా... నువ్వు వస్తావా కేసీఆర్‌.. పసుపు కుంకుమతో వస్తా.. నువ్వు వస్తావా హరీష్‌రావు అని అన్నారు. ఏ పదవి ఇచ్చినా పదవికి వన్నె తెచ్చానని, అదే కేసీఆర్‌కి నచ్చలేదన్నారు. ప్రభుత్వ సొమ్ము పేదలకు దక్కాలి కానీ సంపన్నులకు కాదని కొట్లాడానన్నారు. అనంతరం చెల్పూర్‌లో ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ మాజీ ఉప సర్పంచ్‌ అయిత హరీష్‌ బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, చెల్పూర్‌ సర్పంచ్‌ నేరెళ్ల మహేందర్‌గౌడ్‌, రంగాపూర్‌ సర్పంచ్‌ బింగి కరుణాకర్‌, జూపాక సింగిల్‌ విండో చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు రాముల కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:00:20+05:30 IST