కుక్కేసి.. ఉరితీసి!

ABN , First Publish Date - 2022-08-13T05:48:14+05:30 IST

ఇరుకు గదుల్లో కుక్కేశారు. ఎదురించిన వారిని ఉరితీశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. బ్రిటీష్‌వారు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు.

కుక్కేసి.. ఉరితీసి!
ఒకప్పుడు బ్రిటీష్‌ పాలకులు ఉరిశిక్ష అమలు చేసేందుకు వినియోగించిన గది ఇదే

  పార్వతీపురంలో అప్పటి ఉరితీత కేంద్రం

  ఎంతోమంది గిరిజనులను నిర్బంధించిన వైనం

  1935 తరువాత సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

ఇరుకు గదుల్లో కుక్కేశారు. ఎదురించిన వారిని ఉరితీశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. బ్రిటీష్‌వారు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. పార్వతీపురం డివిజన్‌ కేంద్రంగా పార్వతీపురం, గరుగుబిల్లి, కురుపాం, సాలూరు, బొబ్బిలి, ఒడిశాలోని అలమండ, జైపూర్‌, బందుగాం, కొరాపుట్‌, రాయగడ, తదితర ప్రాంతాలను పాలించేవారు. 1935కు ముందు బ్రిటీష్‌ పాలకులు సబ్‌ జైలుగా వినియోగించిన కార్యాలయాన్ని ఆతర్వాత సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంగా మార్పు చేశారు. ఇక్కడ స్వాతంత్య్ర సమరయోధులను నిర్బంధించారు. ఏజెన్సీలో అల్లూరి సీతారామరాజు ప్రభావం వల్ల తీవ్రంగా ఉన్న స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ పాలకులు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. గిరిజన గూడేల్లోని ప్రజలను, పెద్దలను పట్టుకుని వచ్చి హింసించే వారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాలకొండ, సీతంపేట నుంచి గిరిజనులను తెచ్చి జైల్లో పెట్టేవారు. ఇక్కడే ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీశారు. 

గాంధీజీ రాలేని పరిస్థితి

విజయనగరం వరకు వచ్చిన మహాత్మాగాంధీ పార్వతీపురం వచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటి పరిస్థితులు దృష్ట్యా విజయనగరం నుంచే ఆయన వెనక్కి వెళ్లిపోయారు. జవహర్‌లాల్‌ నెహ్రూ బొబ్బిలి వచ్చి సమావేశం నిర్వహించి స్వాతంత్య్ర ఉద్యమానికి యువకులను చైతన్యపరిచారు. అయితే నెహ్రూ కూడా వెనక్కి పోవాల్సి వచ్చింది. బ్రిటీష్‌ పాలకులు ఎన్నో అడ్డంకులు కల్పించారు. 



Updated Date - 2022-08-13T05:48:14+05:30 IST