మొగ్గు ద్రౌపదికే!

ABN , First Publish Date - 2022-06-23T07:31:55+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము(64) విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి.

మొగ్గు ద్రౌపదికే!

ఒడిసా, బిహార్‌, సిక్కిం సీఎంల మద్దతు

రాష్ట్రపతి ఎన్నికలకు రేపు నామినేషన్‌!

27న యశ్వంత్‌ సిన్హా కూడా..

ద్రౌపదికి మద్దతుగా హాజరు కానున్న ప్రధాని, కేంద్ర మంత్రులు

యశ్వంత్‌ సిన్హాకే టీఆర్‌‘ఎస్‌’ ఎన్నికలో విపక్షాల అభ్యర్థికే మద్దతు

పవార్‌కు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌


న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము(64) విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. ఆమె స్వరాష్ట్రమైన ఒడిసా సీఎం-బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించా రు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టొరల్‌ కాలేజీలో బీజేడీకి 2.85ు ఓట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా విజయానికి 1.2ు ఓట్ల దూరంలో ఉన్న ఎన్‌డీఏకి.. ఆ పార్టీ మద్దతుతో మరింత మెజారిటీ లభించినట్లయింది. ఎన్‌డీఏ భాగస్వామి జేడీయూ అగ్ర నేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, సిక్కిం ముఖ్యమంత్రి-సిక్కిం క్రాంతి మోర్చా అధినేత ప్రేమ్‌చంద్‌ తమాంగ్‌ కూడా ద్రౌపదికి మద్దతు ప్రకటించారు. ఆమె 24న నామినేషన్‌ దాఖ లు చేయనున్నట్లు తెలిసింది. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా 27న దాఖలు చేయనున్నారు. నామినేషన్లపై ప్రధానే తొలి ప్రతిపాదకుడిగా సంతకం చేస్తారు. ప్రతి అభ్యర్థి నామినేషన్‌పైనా.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టొరల్‌ కాలేజీలోని కనీసం 50 మంది ఓటర్లు ప్రతిపాదకులుగా సంతకాలు చేయాలి. మరో 50 మంది సమర్థించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన కమలనాథులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారమిక్కడ సమావేశమయ్యారు. వీరంతా దేశమంతటా పర్యటించి ద్రౌపది తరఫున ప్రచారం సాగించనున్నారు.


ఆమె కూడా స్వయంగా రాష్ట్రాలకు వెళ్లి ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కోరనున్నారు. జూలై 18న పోలింగ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. 21వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. తమ అభ్యర్థి గెలవడానికి ఎన్‌డీఏకి 1.2ు తక్కువ ఓటర్లు ఉన్నారు. ఎలక్టొరల్‌ కాలేజీలో 2.85ు ఓట్లున్న బీజేడీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం.. ఏపీలోని పాలక వైసీపీ, తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకేల మద్దతుతో ఆమె గెలుపు సునాయాసమేనని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి గిరిజన  మహిళగా ఆమె చరిత్రకెక్కుతారు.   


అభ్యర్థిత్వంపై ముందే నిర్ణయం!!

నిజానికి ద్రౌపది అభ్యర్థిత్వం ముందుగానే ఖరారైనట్లు తెలుస్తోంది. నవీన్‌ పట్నాయక్‌ గత నెల 30న ఢిల్లీలో తనను కలిసినప్పుడే ప్రధాని ఆమె ఎంపికను ప్రస్తావించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నవీన్‌ ప్రధానిని కలిసిన  మూడ్రోజులకు అంటే ఈ నెల 2న ఆంధ్ర సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి మోదీతో భేటీ అయ్యారు. ఎన్‌డీఏ అభ్యర్థి ఎవరైనా పూర్తి మద్దతివ్వాలని ప్రధాని ఆయన్ను కోరారు. ఆర్థికంగా, కేసులరీత్యా తమపై పూర్తిగా ఆధారపడిన జగన్‌కు తమ అభ్యర్థిని సమర్థించడం తప్ప గత్యంతరం లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. నవీన్‌తో పాటు జగన్‌ మద్దతుంటే ద్రౌపది అవలీలగా గెలుస్తారని తెలిసిన మోదీ దాదాపు రెండు వారాల క్రితమే ఇద్దరినీ పిలిపించి మాట్లాడడం గమనార్హం. కాగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది అభ్యర్థిత్వానికి యూపీఏ భాగస్వామ్య పక్షమైన జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) కూడా మద్దతిచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. అటు జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కూడా ఆమె సమర్థురాలైన అభ్యర్థి అని వ్యాఖ్యానించారు.  ఒడిసా ముద్దుబిడ్డ ద్రౌపది రాష్ట్రపతి అయ్యేందుకు రాష్ట్ర ఎమ్మెల్యేలంతా పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా మద్దతివ్వాలని నవీన్‌ పట్నాయక్‌ కోరారు. ద్రౌపదికి బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ పూర్తి మద్దతు ప్రకటించారు. 


అభ్యర్థిని అవుతానని అనుకోలేదు..

 ‘మారుమూల మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన నేను దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిని అవుతానన్న ఆలోచనే రాలేదు. ఎన్‌డీఏ నిర్ణయం బీజేపీ నినాదం ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వా్‌స’ను ప్రతిబింబిస్తోంది. భూమిపుత్రిగా ఒడిసా అసెంబ్లీ సభ్యులు, ఎంపీలంతా నాకు మద్దతిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా, దేశానికి రబ్బరు స్టాంపు రాష్ట్రపతి పనికిరారని యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. 27న నామినేషన్‌ వేసి.. బిహార్‌, జార్ఖండ్‌ల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ఆయన.. అభ్యర్థిగా ఎంపికయ్యాక బుధవారం ఢిల్లీలోని ఎన్‌సీపీ కార్యాలయంలో మొదటి వ్యూహ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ’ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు. కానీ ఇది ఆమెకు, నాకు మధ్య పోరాటం కాదు. సైద్ధాంతిక సమరం. దేశానికి రబ్బరు స్టాంపు రాష్ట్రపతి ఉండకూడదు’ అని అన్నారు. కాగా.. యశ్వంత్‌ సిన్హాను బలపరుస్తూ.. ఆయన నామినేషన్‌ పత్రాలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, సీతక్క ఉన్నారు.


సంచారం నుంచి ఉన్నత స్థానాలకు..

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక కావడంతో... సంతాల్‌ తెగ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. గోండులు, భిల్లుల తర్వాత దేశంలో అధిక జనాభా ఉన్న గిరిజన తెగ సంతాలులే. ద్రౌపది ముర్ము ఈ తెగకు చెందినవారే. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము ఎంపిక కావడం తమ చరిత్రలో సువర్ణాధ్యాయం అని సంతాలులు భావిస్తున్నారు. సంతాలుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు అనేక ప్రత్యేకతలున్నాయి. సంతాల్‌ అంటే ‘ప్రశాంతంగా ఉన్న మనిషి’ అని అర్థం. సంతాలులు మొదట్లో సంచార జీవనం గడిపేవారు. క్రమంగా చోటానాగపూర్‌ పీఠభూమి ప్రాంతంలో స్థిరపడ్డారు. 18వ శతాబ్దం చివర్లో బీహార్‌లోని సంతాల్‌ పరగణాకు వలసపోయారు. అక్కడ నుంచి ఒడిశాకు వచ్చారు. భారతదేశ చరిత్రలో సంతాలుల తిరుగుబాటుకు చాలా ప్రాధాన్యం ఉంది. బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. అటవీ భూములపై గిరిజనుల హక్కుల కోసం సాయుధపోరాటం చేశారు. ముర్ము వంశీయులే ఇందులో కీలకంగా వ్యవహరించారు.


నక్సలైట్‌ ఉద్యమానికి కూడా సంతాలుల సాయుధ పోరాటమే పునాది అని కొందరు చరిత్రకారులు భావిస్తారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత జిల్లా మయూర్‌భంజ్‌లో కూడా సంతాలులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఒడిశాతోపాటు ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ తెగ విస్తరించింది. వీరి ప్రధాన వృత్తి, జీవనాధారం వ్యవసాయం.  అక్షరాస్యత విషయంలో చాలా ముందంజలో ఉన్నారు. రిజర్వేషన్లను ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అనేక కీలక స్థానాల్లో ఉన్నారు. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి బిశేశ్వర్‌ తుడు, కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ గిరీష్‌ చంద్ర ముర్ము సంథాల్‌ తెగకు చెందినవారే. సంతాలుల భాష ‘సంతాలీ’కి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తింపు లభించింది. వారి లిపి పేరు ఓల్‌-చికి. దీన్ని పండిట్‌ రఘునాథ్‌ ముర్ము కనుక్కున్నారు. ఒడిశాలోని అనేక స్కూళ్లలో ఓల్‌-చికి బోధనా భాషగా అమల్లో ఉంది. ఇతర తెగల కంటే అభివృద్ధి చెందినా సంతాలులు వారి మూలాలు, ఆచార సాంప్రదాయాలను మర్చిపోలేదు. ఈ తెగకు దామోదర్‌ నదితో ప్రత్యేక అనుబంధం ఉంది. చనిపోయినవారి అస్థికలు, ఎముకలను ఆ నదిలోనే కలుపుతారు. విడాకులు, విధవల పునర్వివాహాన్ని సంతాలులు ఆమోదిస్తారు. 


శివాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేసిన ద్రౌపది

రాయ్‌రంగపూర్‌: తనను ఎన్‌డీఏ అభ్యర్థిగా ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేసిన ద్రౌపది ముర్ము.. ఢిల్లీ బయల్దేరే ముందు.. బుధవారం ఉదయమే ఒడిసా మయూర్‌భంజ్‌ జిల్లా రాయ్‌రంగపూర్‌లో తమ ఏరియాలో ఉన్న శివాలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. వాస్తవానికి నిరుడు ఆగస్టులో జార్ఖండ్‌ గవర్నర్‌గా పదవీవిరమణ చేసి స్వగ్రామానికి చేరుకున్న ఆమె.. నాటి నుంచీ రోజూ శివాలయ ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేస్తూ వస్తున్నారు. బుధవారం కూడా ఆ పనిచేశారు. వేకువజామున 3-4 గంటల సమయంలో ఏనుగు దంతం రంగు చీర ధరించి చీపురు పట్టుకుని ప్రాంగణాన్ని ఊడ్చారు. అనంతరం స్నానం చేసి శివుడిని అర్చించి.. నందిని స్పృశించారు. సీఆర్‌పీఎఫ్‌ బృందం అప్పటికి గుడిని తమ అధీనంలోకి తీసుకుని రక్షణగా నిలిచింది. బీజేడీకి ఉన్న 2.85 శాతం ఓట్లు చూసే బీజేపీ ద్రౌపదిని అభ్యర్థిగా నిలిపిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత నరసింహ మిశ్రా అన్నారు. ఆమె సరైన అభ్యర్థే అయినా.. తాము మద్దతివ్వలేని పరిస్థితి అని చెప్పారు. కాగా.. రాయ్‌రంగపూర్‌ నుంచి ఆమె కారులో 285 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం రాత్రి భువనేశ్వర్‌ చేరుకున్నారు. గురువారం ఢిల్లీ వెళ్తారు.

Updated Date - 2022-06-23T07:31:55+05:30 IST