ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్పాలి!

ABN , First Publish Date - 2020-10-22T05:56:18+05:30 IST

యుక్తవయస్సుకు వచ్చిన పిల్లలు ఎదుర్కొనే సవాళ్లు

ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్పాలి!

యుక్తవయస్సుకు వచ్చిన పిల్లల్లో కొత్త సవాళ్లు, హార్మోన్‌ మార్పులు ఉద్రేకానికి కారణం అవుతాయి. 13 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఉద్రేక సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఉద్రేకాన్ని నియంత్రించుకోవడం ఎలాగో వారికి చెప్పాలి. ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవడం అనేది యువతరం అలవరచుకోవాల్సిన జీవన నైపుణ్యాలలో ఒకటి. నలుగురి ముందు మాట్లాడడం, ఆటల్లో రాణించడం వంటి విషయాల్లో ఇది పాజిటివ్‌గా పనిచేస్తుంది. అయితే ఉద్రేకాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతే మానసిక ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఉద్రేకాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. పిల్లలను ఉద్రేకం నుంచి బయటపడేసేందుకు తల్లితండ్రులు ఏం చేయాలంటే...


  1. వారు ఒత్తిడి, భయానికి గురయ్యే పనులను చేసేలా ప్రోత్సహించాలి. దాంతో వారిలో భయం పోతుంది. అయితే వారిని మరింత ఒత్తిడి చేయకూడదు. ముందుగా చిన్నచిన్న లక్ష్యాలతో మొదలెట్టాలి. వాటిని చేరుకోవడం వల్ల కష్టమైన పనులు చేయగలమన్న ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. 
  2. పరీక్ష, ప్రజెంటేషన్‌ లేదా ముఖ్యమైన సమావేశం... ఇలా ఉద్రేకం కలిగించే పనులు చేసేముందు స్నేహితులతో మాట్లాడడం, కామెడీ వీడియోలు చూడడం, సంగీతం వినడం వంటివి చేయాలని చెప్పాలి. దాంతో వారిలో ఉద్రేకం తగ్గుతుంది. 
  3. స్నేహితులతో కలిసి యోగా, డాన్స్‌ చేయడం, వేగంగా నడవడం వల్ల కూడా ఉద్రేకం తగ్గుతుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండడం అలవడుతుంది. ఎక్సర్‌సైజ్‌ క్రమం తప్పకుండా చేసే యువతలో ఉద్రేకం తాలూకు లక్షణాలు చాలా వరకు తగ్గాయని అధ్యయనంలో తేలింది.
  4. తొందరగా ఉద్రేకానికి లోనయ్యేవారు తమ బలాలు, బలహీనతలను కాగితం మీద రాసుకోవాలి. ఒకసారి తమ బలం ఏంటో తెలిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
  5. ఒక్కోసారి పిల్లలు ఏమి పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన తల్లితండ్రులు చొరవ తీసుకొని వారిలో ధైర్యం నింపాలి.

Updated Date - 2020-10-22T05:56:18+05:30 IST