కరోనా నిర్దేశిస్తున్న కర్తవ్యం

ABN , First Publish Date - 2020-07-02T05:58:04+05:30 IST

కరోనా వంటి విశ్వమారులు ప్రబలడానికి బ్రహ్మంగారు, నోస్టర్‌డామస్‌ చెప్పినట్లుగా విధిలిఖితమని సరి పెట్టుకునేవారు కొందరైతే, ప్రకృతిలో సంభవిస్తున్న సహజ పరిణామాలే ప్రధాన కారణాలని భావించే వారు మరికొందరు. మానవ ప్రమేయం లేని...

కరోనా నిర్దేశిస్తున్న కర్తవ్యం

వాతావరణ మార్పులతో ఉత్పరివర్తనాలకు గురైన సహజ వైరస్‌లు, జీవ రసాయనిక ఆయుధంగా ప్రయోగశాలల్లో ప్రాణం పోసుకున్న కృత్రిమ వైరస్‌లు, పారిశ్రామిక, వ్యవసాయక కాలుష్యాల కారణంగా ఊపిరిపీల్చుకున్న  సూపర్‌ బగ్స్‌ మొదలైనవన్నీ సంకుచిత, స్వార్థ ఆర్థికాభివృద్ధి విధానాల ఫలితాలే అనడంలో సందేహం లేదు. కరోనా లాంటి రోగ కారక క్రిములు చేస్తున్న మారణహోమానికి తాత్కాలిక పరిష్కారాలుగా వ్యాక్సిన్‌లను కనుగొన్నప్పటికీ, శాశ్వత పరిష్కారం అభివృద్ధి నమూనాలో మౌలిక మార్పులే.


కరోనా వంటి విశ్వమారులు ప్రబలడానికి బ్రహ్మంగారు, నోస్టర్‌డామస్‌ చెప్పినట్లుగా విధిలిఖితమని సరి పెట్టుకునేవారు కొందరైతే, ప్రకృతిలో సంభవిస్తున్న సహజ పరిణామాలే ప్రధాన కారణాలని భావించే వారు మరికొందరు. మానవ ప్రమేయం లేని, విధిలిఖిత, స్వయం చాలిత ప్రకృతి వైపరీత్యాలుగా కొందరు మేధావులు చెబుతుండగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికా, చైనా, ఈయూ, రష్యా తదితర సామ్రాజ్యవాద దేశాల కుట్రలే ఇలాంటి ఉపద్రవాలకు మూలమని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


ఏది ఏమైనా కరోనా మహమ్మారికి భౌతికమైన పరిష్కారాన్ని (మందు) కనుగొనవలసిన బాధ్యత మానవులపైనే ఉంది కదా! ఇకపోతే, ‘స్వయం చాలితమైన చరాచర సృష్టిపై మనిషికి అదుపు వచ్చిందని అనుకోవడం అతిశయమే. మానవ ప్రమేయం లేని వైపరీత్యాలు ఇకముందూ జరుగుతూనే ఉంటాయి.’ అని కొంతమంది మేధావులు విచిత్రంగా విశ్లేషిస్తున్నారు. భూగోళం క్రమంగా భూ ఆవరణం (జియోస్పియర్‌), జీవావరణం (బయోస్పియర్‌) దశలను దాటి ‘బౌద్ధికావరణం’ (నూస్పియర్‌) దశకు చేరుకున్న స్థితిలో మానవుల ప్రత్యక్ష, పరోక్ష కార్యకలాపాల పరిధిలోనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి.


2007లో గృహ రుణాల సంక్షోభంతో ఆర్థిక మాంద్యంలోకి పీకల్లోతు కూరుకుపోయిన అమెరికా... నిరంతర సంక్షోభంలో కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత విధ్వంసకర స్థాయికి తీసుకుపోయింది. ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా పురోగమిస్తున్న చైనా అమెరికా ప్రపంచాధిపత్యానికి గండికొట్టింది. ఫలితంగా అమెరికా, చైనాల మధ్య భౌగోళిక ఆధిపత్య పోటీ సామాజిక, ఆర్థిక, సైనిక రంగాల్లో వెర్రితలల వేసింది. చైనా లోని వూహాన్‌ పారిశ్రామిక నగరంలోని మాంసోత్పత్తుల మార్కెట్‌ లేదా అమెరికాను దెబ్బతీయాలనే వ్యూహంతో చైనా రూపొందిస్తున్న జీవాయుధ పరిశోధనల నుంచి కరోనా వైరస్ ప్రభవించిందని అమెరికా, ఇతర సంపన్న పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అమెరికాను అధిగమించి ప్రపంచ అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాకు ఇలాంటి వైరస్‌ ద్వారా అల్లకల్లోలం సృష్టించి, ప్రత్యర్థులను ఓడించవలసిన అగత్యముందా?


కరోనా వైరస్‌కు మూలం వూహాన్‌లోని సముద్ర ఆహారోత్పత్తుల మార్కెట్లు కాదని, నిజానికది అమెరికా లోని మిలటరీ ఫోర్ట్‌డెట్రిక్‌లో, నిర్వహిస్తున్న జీవాయుధాల ప్రయోగశాల నుంచి వ్యాప్తి చెందిందని చైనా వైరాలజిస్టులు ధ్రువీకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఫోర్డ్‌డెట్రిక్‌ నుంచి విడుదలవుతున్న వైరస్ లు వివిధ కల్లోలాలకు కారణమవుతున్నందునే ఆ ప్రయోగశాల (సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) ను 2019 జూలైలో అమెరికా మూయించి వేసింది. ఆ తర్వాత అక్టోబర్‌ ఈవెంట్‌ - 201 పేరుతో అతి పెద్ద ‘కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ ఎక్స్‌ర్‌సైజ్‌’ (కంప్యూటర్‌లో కృత్రిమ వాతావరణం కల్పనతో చేసే ప్రయోగం)ను ‘జాన్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీ’ లో ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్ల్యూఈఎఫ్‌), ‘బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్’ సంస్థలు, సంయుక్తంగా నిర్వహించాయి. ప్రపంచ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ యవనికలో తమను అడ్డుకునేందుకే అమెరికా చేస్తున్న ప్రయత్నాల ఫలితమే కొత్త రకం కృత్రిమ కరోనా మహమ్మారి అని చైనా వాదిస్తోంది.


డబ్ల్యూఈఎఫ్‌, బిల్‌ గేట్స్‌కు చెందిన జీఏవీఐ (వ్యాక్సినేషన్‌, ఫార్మాస్యూటికల్స్‌ను ప్రోత్సహించే సంస్థ) రాక్‌ఫెల్లర్‌ రాథ్సెల్డ్స్‌ వగైరా కార్పొరేట్‌ సంస్థలు ‘ఎజెండా ఐడీ 2020’ అనే కార్యక్రమం ద్వారా - ఏకరీతి ప్రపంచాన్ని (ఒన్‌ వరల్డ్‌ ఆర్డర్‌)ను తీసుకురావాలనే పథకాన్ని రచించాయి. ఇందుకోసం అవసరమైన డేటా చిప్‌ను మొత్తం మానవాళి శరీరాల్లోకి ప్రవేశపెట్టాలని రహస్యంగా తీర్మానించుకున్నాయని తెలుస్తోంది. ఆ లక్ష్యంతోనే వరుసగా వైరస్‌ మహమ్మారులను సృష్టించడం, ఆ సాకుతో వాటికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయా దేశాల ప్రభుత్వాల ద్వారా బలవంతంగా నిర్వహింప చేసి ‘ఎజెండా ఐడీ 2020’ పథకాన్ని అమలు చేసే కుట్ర సాగుతోంది. ఈ నేపధ్యంలోనిదే 5జి టెక్నాలజీ కూడ.


లాక్‌డౌన్‌లు కరోనాను ఏ మేరకు నిలువరిస్తాయనే సందేహాలున్నప్పటికీ, అంతకంటే వేరే గత్యంతరం లేని స్థితి నెలకొని ఉంది. ప్రపంచీకరణ వల్ల అంతర్జాతీయంగా కోట్లాది దినసరి కూలీల, వలస కార్మికుల, ఉద్యోగుల, సాంకేతిక నిపుణుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కరోనా భూతాన్ని స్వల్ప నష్టాలతోనైనా చైనా చివరకు బంధించగలిగినా, అది అభివృద్ధి చెందిన పారిశ్రామిక పాశ్చాత్య దేశాల్లో కరాళ నృత్యం చేస్తోంది. అసలే సామాజిక, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి వున్న భారత్‌, కొవిడ్‌- 19 కట్టడి కోసం అమలు చేసిన లాక్‌డౌన్‌తో మరింత ఊపిరాడని స్థితిలోకి వెళ్ళిపోయింది. కరోనా కేసులు తగ్గకపోయినా గత్యంతరం లేక అన్‌లాక్‌డౌన్‌ మొదటి దశను మోదీ ప్రభుత్వం ప్రకటించడం, రాష్ట్రాలూ ఆ నిర్ణయాన్ని అనుసరించడంతో ఆ విశ్వమారి దేశంలో మళ్ళీ విజృంభించింది. ఇలా అపరిష్కృత విష వలయంలోకి కూరుకుపోయిన తరుణంలో, భౌగోళిక, రాజకీయ సమీకరణాల ఉచ్చు బిగుస్తోంది. చైనా సామ్రాజ్యవాదం దూకుడుకు నిలబడేందుకు భారత పాలకులు అమెరికాను ఆశ్రయించడంతో, ఆ దేశ శత్రువులందరూ మనకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ముందుకొచ్చింది. అనేక చోట్ల దాదాపు నేరుగా జోక్యం చేసుకోకుండా అమెరికా, కొన్ని దేశాలను తన ఏజెంట్లుగా మార్చుకుని వాటిని ప్రాదేశిక యుద్ధాల్లో దించి ప్రచ్ఛన్న ఆధిపత్యం కొనసాగిస్తోంది. అదే తీరులో చైనాను తమ సర్రొగేట్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చుకుని, చౌక శ్రమశక్తి, సాంకేతిక సామర్థ్యం, రాజకీయ-సామాజిక క్రమశిక్షణ ఉన్న చైనాను ఈయూకి పెట్టుబడుల పెంపక కేంద్రంగా, యూరోపియన్ సామ్రాజ్యవాద దేశాల కార్పొరేట్‌ వర్గాలు వినియోగించుకుంటున్నాయి.అలా అమెరికా సామ్రాజ్యవాదాన్ని, భౌగోళిక, ఆర్థిక ఆధిపత్యాన్ని, చైనా డ్రాగన్‌ను పురిగొల్పి దెబ్బకొట్టాయి. ఈ క్రమంలో చైనా వర్థమాన దేశం స్థాయి నుంచి సామ్రాజ్యవాద దేశంగా ఆవిర్భవించింది.


అయితే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్‌ రష్యా కూటమితో కొనసాగిన భారత్‌ను దెబ్బతీసేందుకు అమెరికా పాకిస్థాన్‌ను ఉపయోగించుకున్నది. ఒకవైపు చైనాను కట్టడి చేసేందుకు, మరొకవైపు తన ప్రాంతీయ ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన ఏజెంట్‌ను తయారు చేసుకునేందుకు అనువైన లక్షణాలున్న భారత్‌కు అమెరికా అండదండలు అం దించ సాగింది. అదే సమయంలో చైనా పోటీ నిలువరించేందుకు, రష్యావంటి అభివృద్ధి చెందిన దేశం సహకారం కోల్పోయిన తర్వాత, అమెరికాకు దగ్గరై గ్లోబల్‌ ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న భారత్‌ క్రమంగా అమెరికాకు దగ్గరైంది.


చౌక శ్రమశక్తి, గణనీయమైన యువజనుల, మధ్యతరగతి జనాభా, బ్రహ్మాండమైన సహజ వనరులు, యూరప్‌ దేశాలన్నీ కలిపినంత మార్కెట్‌ సామర్థ్యం ఉన్న భారత్‌ అండదండలతో భౌగోళిక, రాజకీయార్థిక ఆధిపత్యాన్ని అమెరికా సాధించగలదనే సందేహాలు చైనా, ఈయూ, రష్యా కూటమిని కలవర పెడుతోంది. దాన్ని నిలవరించడంలో భాగంగా భారత్‌ సరిహద్దుల్లోని నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలను చైనా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.


ఈ ప్రయత్నంలో భాగంగా జూన్‌ 15వ తేదీ రాత్రి కారాకోరం పర్వత సానువుల్లో ప్రవహించే గల్వాన్‌ నది వద్ద ఇరు దేశాలకు చెందిన సరిహద్దు సైనిక బలగాల మధ్య సంభవించిన ఘర్షణల్లో 21 మంది భారతీయ సైనికులు, 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. కరోనా విశ్వమారి మృత్యు విలయానికి చైనా బాధ్యత వహించాలని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో నిరసిస్తున్న సందర్భంలో, అమెరికా ప్రాదేశిక ప్రతినిదిగా ఇండియా మారుతోందన్న శంకతో, చైనా పాలకులు ఇలాంటి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాల్లో భారత పాలకులు అలీన విధానాన్ని విడనాడి, అమెరికా పక్షాన్ని ఎంచుకున్న కారణంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా పలు ప్రతికూలతలు, ఇబ్బందులను భారత్‌ ఎదుర్కుంటోంది. కొవిడ్‌- 19 విశ్వమారి విలయంతోపాటు, చైనా సృష్టించిన భౌగోళిక అష్టదిగ్భందనంతో మనదేశం మానవతా సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ప్రపంచార్థిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని సాధిస్తున్న చైనా సామ్రాజ్యవాదంతో మన దేశం ఈ దశలో సంయమనంతో వ్యవహరించాలి.


ప్రకృతి వనరుల విచక్షణారహిత దోపిడీ పునాదిపై సాగుతున్న అభివృద్ధి నమూనాల వల్ల పర్యావరణ విధ్వంసంలో అమెరికా, చైనాలు అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్‌, భారత్‌దేశాలు నిలుస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఉత్పరివర్తనాలకు గురైన సహజ వైరస్‌లు, జీవ రసాయనిక ఆయుధంగా ప్రయోగశాలల్లో ప్రాణం పోసుకున్న కృత్రిమ వైరస్‌లు, ఫార్మా తదితర పారిశ్రామిక, వ్యవసాయక కాలుష్యాల కారణంగా ఊపిరిపీల్చుకున్న సూపర్‌ బగ్స్‌ మొదలైనవి అన్నీ కూడా ప్రపంచంలో కొనసాగుతున్న వికృత, సంకుచిత, స్వార్థ, ఆర్థికాభివృద్ధి విధానాల వల్లే అనడంలో సందేహం లేదు. ఈ రోగ కారక క్రిములు చేస్తున్న మారణహోమానికి తాత్కాలిక పరిష్కారాలుగా మందులు, వ్యాక్సిన్‌ల వంటివి కనుగొన్నప్పటికీ, దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచ అభివృద్ధి నమూనాను సమూలంగా పునర్నిర్మించుకోక తప్పదు. ‘మనుషులు ప్రకృతి నుంచి జీవిస్తారు, అంటే ప్రకృతే మన శరీరమవుతుంది. మరణించకుండా ఉండాలంటే, ప్రకృతితో మనం నిరంతరాయంగా సంభాషించాల్సి ఉంటుంది’ ఒక పాశ్చాత్య తత్త్వవేత్త వ్యాఖ్యానాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి.

గోటేటి రామచంద్రరావు

(దివంగత ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఓ.ఎస్‌.డి)

Updated Date - 2020-07-02T05:58:04+05:30 IST