వార్షిక రుణ ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2022-05-28T07:11:09+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 79,190 హెక్టార్లు. ఇందులో ప్రధానంగ వరి, పత్తి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, జొన్న, కంది సాగు చేస్తారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,33,810 హెక్టార్లు. జిల్లాలో మొత్తం రైతులు 3,38,801 మంది ఉన్నారు.

వార్షిక రుణ ప్రణాళిక సిద్ధం

వ్యవసాయానికి రూ.4541 కోట్లు లక్ష్యం

ఖరీ్‌ఫలో రూ.2679 కోట్లు, రబీలో రూ.1862 కోట్లు పంట రుణాలు పంపిణీ 


కరీఫ్‌ సీజన్‌  మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రభుత్వం కూడా ముందుస్తు ఏరువాకకు సిద్ధమంటూ చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో పంట విత్తుకు అవసరమైన డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో లీడ్‌ డిస్ర్టిక్ట్‌ బ్యాంక్‌ వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌, రబీలో పంట రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలను ప్రణాళికలో పొందుపర్చింది.  ఖరీఫ్‌, రబీ సీజన్‌లో సుమారు 2.50 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటారు. అయితే ఏయే పంటలకు ఎంత సాగు పెట్టుబడి అనే అంశాలను పొందుపరుస్తూ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఎంత రుణాలు ఇవ్వాలో నిర్ణయించారు. అయితే ఇప్పటి దాకా ఆ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకుల నుంచి చాలా మంది రైతులకు రుణాలు అందలేదు. కొన్ని బ్యాంకులు లక్ష నుంచి రెండు లక్షల లోపు రుణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో బ్యాంకులు ఇచ్చే అరకొర పంట రుణం రైతులకు సరిపోక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ నూటికి రెండు నుంచి మూడు రూపాయల దాకా వడ్డీ తీసుకుంటున్నారు. దీంతో పంట దిగుబడి రాకపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 79,190 హెక్టార్లు. ఇందులో ప్రధానంగ వరి,  పత్తి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, జొన్న, కంది సాగు చేస్తారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,33,810 హెక్టార్లు. జిల్లాలో మొత్తం రైతులు 3,38,801 మంది ఉన్నారు.  అయితే ఖరీఫ్‌, రబీ సీజన్‌లో బ్యాంకుల నుంచి పంట రుణాలు రెండు లక్షలా 50 వేల మంది తీసుకుంటారు.


ఖరీఫ్‌ టార్గెట్‌

ఖరీఫ్‌, రబీ సీజన్‌లో రూ.4541.85 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఖరీ్‌ఫలో రూ.2679.69 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. సుమారు లక్ష మందికి పైగా రుణాలు తీసుకుంటారు. రబీలో రూ.1862.16కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవే కాకుండా వ్యవసాయ అనుబంధ రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.


స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణం అందేనా..?

పంట రుణాల మంజూరులో టార్గెట్‌ రీచ్‌ అవుతున్నప్పటికీ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణం అందడం లేదనే ఆరోపణలున్నాయి. ఆ ప్రకారం ఆయా పంటలకు రుణం ఇస్తే రైతు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించదు. బ్యాంకులు ఉదారంగా వ్యవహరించి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. లక్ష్యాన్ని పరిశీలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3,894 కోట్ల లక్ష్యానికి గాను రూ.4,183 కోట్లు ఇచ్చారు. రబీలో కూడా రూ.2,706 కోట్లు లక్ష్యంగా లక్ష్యాన్ని పూర్తి చేశారు. అయితే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులకు రుణం అందలేదని ఇటు రైతులు, అటు రైతు సంఘాల నేతలు వాపోతున్నారు.


రైతులందరికీ రుణాలు ఇస్తాం

- దుర్గాప్రసాద్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

అర్హత కలిగిన ప్రతి రైతుకు పంట రుణాలు ఇస్తాం. వచ్చే నెల నుంచి ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కానుంది. రుణాల మంజూరులో ఎలాంటి సిఫారసులు ఉండవు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారమే రుణాలు ఇస్తాం. గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పంట రుణాల పంపిణీలో లక్ష్యాన్ని అధిగమించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా లక్ష్యాన్ని అధిగమిస్తాం పంట రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలను కూడా అందరికీ ఇస్తాం.


ఏ పంటకు ఎంత రుణం అంటే..

============================

పంట రుణం రూ.వేలల్లో.. 

============================

వరి 34 నుంచి 38

పత్తి

  నీటి పారుదల 36 నుంచి 40

  వర్షాధారమైతే 34 నుంచి 38

పచ్చిమిర్చి 50 నుంచి 68

మిరప 66 నుంచి 88 

వేరుశనగ  

  నీటిపారుదల 30 నుంచి 32

  వర్షాధారం 24 నుంచి 26

పొద్దుతిరుగుడు 17.5 నుంచి 22

రాగి

 నీటిపారుదల 14 నుంచి 18

 వర్షాధారం 14 నుంచి 16 

కొర్ర

 నీటిపారుదల 16 నుంచి 19

 వర్షాధారం 14 నుంచి 15

జొన్న

 నీటిపారుదల 18 నుంచి 20

 వర్షాధారం 16 నుంచి 19

సజ్జ

 నీటిపారుదల 14 నుంచి 19

 వర్షాధారం 13 నుంచి 16

కందులు

 నీటిపారుదల 16 నుంచి 20

 వర్షాధారం 14 నుంచి 19

శనగలు

 నీటిపారుదల 26 నుంచి 30

పప్పుదినుసులు

 నీటిపారుదల 13 నుంచి 15

చెరుకు 71500 నుంచి 75900 

టమోట 25 నుంచి 30

 హైబ్రీడ్‌ అయితే 71500 నుంచి 77

తమలపాకు 65 నుంచి 75

పసుపు 77 నుంచి 80

బొప్పాయి 66 నుంచి 71500

తైవాన్‌ రకం 71 నుంచి 77

నిమ్మ, చీని 46 నుంచి 49500 

అలాగే మరికొన్ని పంటలకు ఖరారు చేశారు. 

Updated Date - 2022-05-28T07:11:09+05:30 IST