Advertisement
Advertisement
Abn logo
Advertisement

తోక బెత్తెడు సాయమే!

  • రెండో విడత గొర్రెల పంపిణీలో జోరుగా రీసైక్లింగ్‌ దందా
  • 21 గొర్రెలకు బదులు పదే..  లేదంటే రూ.70-80వేలు
  • రెచ్చిపోతున్న దళారులు

జనగామ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పంపిణీ చేసిన గొర్రెలను గొల్ల కురుమల వద్దకొచ్చి ఎవరు చూస్తారు? లబ్ధిదారులకు గొర్రెలను ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంటే ఎవరేం చేయగలరు? గొర్రెలను పంపిణీ చేసినట్లు ఓ ఆధారంగా ఆ జీవాల ఎదుట లబ్ధిదారులను నిలబెట్టి ఓ ఫొటో తీయిస్తే సరిపోదా? గొర్రెలకు బదులుగా లబ్ధిదారులకు ఎంతో కొంత సొమ్ము చేతిలో పెడితే,  గొర్రెలే కావాలని గట్టిగా అడిగిన లబ్ధిదారులకు 21 జీవాలకు బదులు 10-11 గొర్రెలు అప్పజెబితే పంపిణీ పథకం పూర్తవ్వదా? రెండో విడత గొర్రెల పంపిణీ పథకంలో దళారులు, వారికి అండగా ఉంటున్న సంబంధిత అధికారుల తీరు ఇలానే ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పడుతోంది. పంపిణీలో భాగంగా జనగామ జిల్లాలో రీ సైక్లింగ్‌ దందా జోరుగా సాగుతోంది. గొర్రెలు అందక లబ్ధిదారులు నష్టపోతుంటే.. పంపిణీ పథకం కింద లక్షలు కొల్లగొడుతూ దళారులు పండుగ చేసుకుంటున్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టెలను ఓ యూనిట్‌గా పరిగణిస్తున్నారు. ఒక్కో యూనిట్‌ కోసం గతంలో ప్రభుత్వం రూ.1,25,000 ఇచ్చేది. లబ్ధిదారుడు తనవంతుగా రూ.31,250 డీడీ ద్వారా సర్కారుకు చెల్లించాలి. అయితే రూ.1.25 లక్షలతో 21 గొర్రెలు రాకపోవడంతో సర్కారు మరో రూ.50వేలు పెంచి.. యూనిట్‌ ధరను రూ.1.75 లక్షలుగా నిర్ధారించింది. లబ్ధిదారుడి వాటానూ పెంచింది. అదనంగా రూ.12,500 కట్టించుకుంది.  


క్షేత్రస్థాయిలో అమలు ఇలా.. 

గొర్రెల కొనుగోలుకు అధికారులు ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలు.. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, వినుగొండ ప్రాంతాలను ఎంపిక చేశారు. గ్రామాల వారీగా 20 యూనిట్ల చొప్పున లబ్ధిదారులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు అక్కడికి పంపిస్తారు. లబ్ధిదారులకు సూచనలు చేసేందుకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని తెలంగాణ పశుసంవర్ధక శాఖ నియమించింది. లబ్ధిదారులు అక్కడికి వెళ్లి సదరు అధికారిని కలవాల్సి ఉంటుంది. సదరు అధికారి వారికి గొర్రెల దళారులను పరిచయం చేసి చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. లబ్ధిదారులకు దళారులు బక్కచిక్కి ఉన్న, అనారోగ్యంతో ఉన్న గొర్రెలను అంటగడుతున్నారని చెబుతున్నారు. కాగా యూనిట్‌కు ప్రభుత్వం ఇస్తున్న రూ.1.75 లక్షలు తమకు సరిపోవడం లేదని.. ఆ మొత్తానికి 10 గొర్రెలనే ఇస్తామని దళారులు మెలిక పెడుతున్నారు. ఆ గొర్రెలు కూడా వద్దంటే రూ.70వేల నుంచి రూ.80 వేలు ఇస్తామంటున్నారు. కాగా గొర్రెలతో లబ్ధిదారులు ఉన్న ఫొటో తీసుకోవడం పూర్తి కాగానే అప్పటికే లబ్ధిదారులతో అగ్రిమెంట్‌ చేయించుకొని, గొర్రెలతో పాటే వచ్చిన ఏపీ దళారులు వాటిని అవే వాహనాల్లో ఎక్కించుకొని తిరిగి ఏపీకే వెళ్తున్నారు. 


పొద్దుగాల తెచ్చి..సాయంత్రం తీసుకుపోతున్రు

పథకం కింద యూనిట్‌కు 21 గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా  పదే ఇస్తున్నారు. లేదంటే రూ. 70 వేలు చేతిలో పెట్టి వెళ్తున్నారు. మా ఊరికి ఓ రోజు  పొద్దున గొర్రెలు రాగా ఫొటో దిగాం. సాయంత్రమయ్యేసరికి గొర్రెలు కనిపించలేదు. ఏం అయ్యాయని అడిగితే రిటర్న్‌ తీసుకెళ్లారని చెప్పారు. 

-బచ్చన్నపేట మండలానికి చెందిన ఓ సర్పంచి మాటలు


రీసైక్లింగ్‌ ఎక్కడా జరగడం లేదు

జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్‌ అనేది ఎక్కడా జరగడం లేదు. ఏపీ నుంచి ఎన్ని గొర్లు వస్తే అన్నింటికే డబ్బులు మంజూరు చేస్తున్నాం. రీసైక్లింగ్‌ జరుగుతున్నట్టుగా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.

 -వై. నర్సయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, జనగామ 

Advertisement
Advertisement