ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిస్టమ్‌ మారాలి

ABN , First Publish Date - 2022-05-24T05:05:32+05:30 IST

‘డాక్టర్లు ఉన్నచోట పేషెంట్లు లేరు.. పేషెంట్లు ఉన్న చోట డాక్టర్లు లేరు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిస్టమ్‌ మారాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

  • వైద్యశాఖ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


రంగారెడ్డి అర్బన్‌, మే 23 : ‘డాక్టర్లు ఉన్నచోట పేషెంట్లు లేరు.. పేషెంట్లు ఉన్న చోట డాక్టర్లు లేరు.. అలాగే వైద్య పరికరాలు ఉన్నచోట డాక్టర్లు లేరు... పరికరాలు లేనిచోట డాక్టర్లు ఉన్నారు..? ఇదేం తీరు.. ఇలాగైతే కష్టమే..! సిస్టమ్‌ మారాలి’ అని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు పేర్కొన్నారు. సోమవారం హరీ్‌షరావు జిల్లాలో పర్యటించారు. కొండాపూర్‌, హయత్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ వైద్యుల పనితీరుపై ఆయన మండిపడ్డారు. అనంతరం ఆయన సోమవారం రాత్రి జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా హరీ్‌షరావు మాట్లాడుతూ హయత్‌నగర్‌లో 38మంది సిబ్బంది ఉంటే.. 35మంది పేషెంట్లా? వీళ్లను పర్యవేక్షించేందుకు జిల్లా వైద్యాధికారి, కలెక్టర్‌, అలాగే దీనికో మంత్రి.. ఇలా ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అంటూ వైద్యశాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. హయత్‌నగర్‌లో సిబ్బంది జీతాలతో అక్కడకు వచ్చే  పేషంట్లందరికీ అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయవచ్చన్నారు. ముగ్గురు గైనకాలజిస్టులు ఉంటే నెలకు 35 ఆపరేషన్లు జరగడం ఏమిటని ప్రశ్నించారు. షాద్‌నగర్‌లో ఒక గైనకాలజిస్టు ఉంటే.. అక్కడ 150ఆపరేషన్లు జరగడం అభినందనీయమన్నారు. కొన్నిచోట్ల డాక్టర్లు అనుమతి లేకుండా దీర్ఘకాలిక సెలవులపై వెళ్తున్నారని, ఇలాంటి వారిని గుర్తించి తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వస్తే సీఎ్‌సఆర్‌ నిధులతో ఆసుపత్రులు నిర్మించాలన్నారు. ప్రభుత్వ డాక్టర్లుగా పనిచేసే వారికి పీజీ కోర్సుల్లో 35శాతం రిజిర్వేషన్లు కల్పించామని.. ఇది గమనించాలన్నారు. త్వరలో 13 వేల డాక్టర్ల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా నియామకాల ద్వారా వచ్చే డాక్టర్లకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ నిషేధిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నిబంధన కొత్త డాక్టర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. వైద్యపరికరాల నిర్వహణకు రూ.20కోట్లు కేటాయించినట్లు చెప్పారు. డెలివరీ అయిన తర్వాత మొదటి గంట గోల్డెన్‌ అవర్‌ అని, ఆ గంటలో శిశువులు తల్లిపాలకు దూరమవుతున్నారని.. గోల్డెన్‌ అవర్‌లో తల్లిపాల వలన చురుకుగా, శారీరకంగా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారని, ఎదుగుదల ఉంటుందన్నారు. మొదటిగంట తల్లిపాలు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేమని, జీవితంలో తిరిగి ఇవ్వలేమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  అనవసరంగా సిజేరియన్‌ ఆపరేషన్లు చేయవద్దని కోరారు. కొన్ని ఆసుపత్రుల్లో ముహుర్తాలు చూసుకుని ఆపరేషన్లు చేస్తున్నారని, సాధారణ డెలివరీల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వంద శాతం సి సెక్షన్లు చేస్తున్నారని, ఇది ఇక నుంచి తగ్గించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ సుగుణ తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాను పనిచేసే చోట ఆపరేషన్‌  థియేటర్‌ లేదని.. పని లేకుండా జీతం తీసుకోవడం ఇబ్బందిగా ఉందని..  తనను డిప్యూటేషన్‌ వేయాలని ఆమె కోరడంతో.. మంత్రి హరీశ్‌రావు ఆమెను అభినందించారు. వెంటనే షాద్‌నగర్‌కు డిప్యూటేషన్‌పై పంపించాలని ఆదేశించారు.  


కొత్తగా మూడు ఆసుపత్రులకు డయాలసిస్‌ కేంద్రాలు

ఇబ్రహీంపట్నం ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలని స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో కొత్తగా ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌ చేవెళ్ల ఆసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు సూచించారు. కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెటిక్‌, కంటి పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభీవాణిదేవి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితాహరినాథ్‌రెడ్డి, ప్రభుత్వవిఫ్‌ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, మంచిరెడ్డికిషన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌, కాలె యాదయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్లు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-24T05:05:32+05:30 IST