Abn logo
Sep 26 2021 @ 01:56AM

జడ్పీ ఛైర్మెన్‌, వైస్‌ ఛైర్మెన్ల ప్రమాణస్వీకారం పూర్తి

జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ప్రమాణస్వీకారం

జడ్పీటీసీలతో ప్రమాణస్వీకారం చేయించిన కలెక్టర్‌

హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు


చిత్తూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సుమారు రెండున్నరేళ్ల తర్వాత జడ్పీ పీఠంపై కొత్త పాలకులు కొలువుదీరారు. జడ్పీ చైర్మన్‌ , వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిమిత్తం నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ సభ్యులందరికీ జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి తొలుత స్వాగతం పలికారు. ఉదయం 10 గంటల తర్వాత కోఆప్షన్‌ సభ్యులుగా పీలేరుకు చెందిన మహమ్మద్‌ షఫీ, పెనుమూరుకు చెందిన హమీద్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రిసైడింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌ హరినారాయణన్‌ జడ్పీటీసీలందరితో ఒకేసారి ప్రమాణస్వీకారం చేయించారు. 3 గంటలకు జడ్పీ చైర్మన్‌ , వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరిగింది. జడ్పీ  చైర్మన్‌గా వి.కోట జడ్పీటీసీ శ్రీనివాసులు (వాసు)ను పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్‌ ప్రతిపాదించగా.. కురబలకోట జడ్పీటీసీ జ్యోతి బలపరిచారు. మొదటి వైస్‌  చైర్మన్‌గా యాదమరి జడ్పీటీసీ ధనంజయరెడ్డి పేరును సదుం జడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి ప్రతిపాదించగా.. ఎర్రావారిపాలెం జడ్పీటీసీ కరుణాకర రెడ్డి బలపరిచారు. అలాగే రెండో వైస్‌ ఛైర్‌పర్సన్‌గా గుడిపాల జడ్పీటీసీ రమ్య పేరును వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్‌ రెడ్డి ప్రతిపాదించగా.. నారాయణవనం జడ్పీటీసీ సుమన్‌కుమార్‌ బలపరిచారు. చైర్మన్‌ , వైస్‌ చైర్మన్ల పదవులు ఏకగీవ్రం కావడంతో చైర్మన్‌గా శ్రీనివాసులును, వైస్‌ చైర్మన్లుగా ధనంజయరెడ్డి, రమ్యలను ప్రిసైడింగ్‌ అధికారి  హరినారాయణన్‌ ప్రకటించారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ ప్రత్యేక ఆహ్వానితుడిగా వి.కోట మండలానికి చెందిన ఎస్‌ఏ గౌస్‌ను ఎన్నిక చేసినట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. చైర్మన్‌ , వైస్‌ చైర్మన్ల ప్రమాణస్వీకారం సందర్భంగా జడ్పీ  కార్యాలయ ఆవరణంతో పాటు.. ప్రధాన రహదారి మీద వారి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. దీంతో ఆ రోడ్డు మీద ఉదయం నుంచే రాకపోకలను నిలిపివేశారు. డీఎస్పీ సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటుచేశారు. ఎన్నిక సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు అంబేడ్కర్‌, వైఎస్సార్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు.రాజంపేట, చిత్తూరు ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, పీలేరు, చిత్తూరు, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, పలమనేరు, మదనపల్లె ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ద్వారకనాథరెడ్డి, మధుసూదన రెడ్డి, ఆదిమూలం, వెంకటే గౌడ, నవాజ్‌ బాషా, డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌, రెవెన్యూ, ఆసరా జేసీలు రాజబాబు, రాజశేఖర్‌, డీఆర్వో మురళి, డీపీవో దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళతా: జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

జిల్లా సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు.జిల్లా సమగ్ర అభివృద్ధికి బాట వేస్తానన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీలంతా తమ మండలాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. సీఎం నిర్ణయంతో అన్ని వర్గాల వారికీ రాజకీయ పదవుల్లో సమ న్యాయం జరుగుతోందన్నారు.మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ  జడ్పీటీసీలకు అందుబాటులో ఉండి సహకరిస్తానన్నారు.కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసిన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. 


 తడబడి... పొరబడి

జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్లో శనివారం జరిగిన  ప్రత్యేక సమావేశంలో అమాత్యుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా ప్రసంగాల్లో తడబడ్డారు.జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రమ్య తప్పులతడకగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆమెకు సీఈవో ప్రభాకర్‌రెడ్డి పక్కనే వుండి సరిదిద్దారు. ఆమె గురించి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు అంటు పొరబాటుగా చెప్పారు.వైస్‌ చైర్మన్‌ ధనంజయరెడ్డి గురించి జడ్పీ ఉపాధ్యక్షుడు అనబోయి ఉప ముఖ్య మంత్రి అన్నారు. ఆ తరువాత పొరబాటును సరిదిద్దుకుని వైస్‌ చైర్మన్‌ అన్నారు.ఎంపీ రెడ్డెప్ప ప్రసంగం చివర్లో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. ఫవేదికపై ఎమ్మెల్యేలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్‌, ఇతర వైసీపీ నేతలు ఆశీనులయ్యారు.ఫఎన్నికల సమయంలో జడ్పీటీసీలు తప్ప ఇతరులెవ్వరూ లోపల ఉండకూడదంటూ కలెక్టర్‌ పలుమార్లు సూచించినా ప్రజా ప్రతినిధులు, జడ్పీటీసీల అనుచరులు, కుటుంబసభ్యులు వందమందికి పైగా మీటింగ్‌ హాల్లోనే ఉన్నారు.ఫసమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు కరుణాకరరెడ్డి,చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, ఎంఎస్‌ బాబు, తిరుపతి ఎంపీ గురుమూర్తి హాజరుకాలేదు. 

జడ్పీటీసీల ప్రమాణస్వీకారం