Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి గురువారం శాసనమండలిలోని తన ఛాంబర్‌లో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, సి.వెంకట్రామారెడ్డి చేత ప్రమాణం చేయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నూతన ఎమ్మెల్సీలకు మండలి రూల్స్‌ పుస్తకాలు, గుర్తింపుకార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్‌ మహమూద్‌ అలీ, జి.జగదీ్‌షరెడ్డి,  సత్యవతిరాథోడ్‌, తెలంగాణ లెజిస్లేచర్‌ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొని కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేయనున్నారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ స్పీకర్‌ మధుసూదనాచారితోపాటు బండ ప్రకాష్‌ ఈ నెల 6 తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం అనంతరం ఐదుగురు ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాసనమండలి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్‌ మాటిస్తే తప్పరని, హుజూరాబాద్‌ ప్రజలకు అండగా ఉంటానని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement