Abn logo
Jan 12 2021 @ 01:01AM

‘సుప్రీం’ మార్గం!

సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలే చేసింది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ అనేకరోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులతో కేంద్రప్రభుత్వం సవ్యంగా వ్యవహరించడం లేదన్నది న్యాయస్థానం అభిప్రాయం. రైతులకూ, కేంద్రప్రభుత్వానికీ మధ్య ఎంతో


కాలంగా తెగని ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికీ, పీటముడి విప్పడానికీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఒక స్వతంత్ర కమిటీ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదిస్తూ, అది ఏ విషయమూ తేల్చేలోగా ఈ వివాదాస్పద చట్టాల అమలును నిలిపివేయాలన్న ఆలోచన సుప్రీంకోర్టు ప్రకటించింది. కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే చర్చలు మరింత సవ్యంగా, ఫలప్రదంగా ఉండేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని సుప్రీంకోర్టు భావన. వాదోపవాదాల్లో అటార్నీ జనరల్‌ కేంద్ర ప్రభుత్వం హక్కులూ అధికారాల గురించి ఏమి చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు ప్రతిపాదన కచ్చితంగా పాలకులను ఒక పెద్ద సంక్షోభం నుంచి రక్షించి ఒడ్డున పడేసేదే.


చట్టాల అమలును ఇలా తాత్కాలికంగా పక్కనబెట్టిన పక్షంలో మీరు ఉద్యమం పూర్తిగా ఆపేస్తారా? అని, వాటి రద్దును కోరుతూ ఉద్యమిస్తున్న రైతులను ఉద్దేశించి ప్రశ్నిస్తోంది న్యాయస్థానం. రైతులు అనేక రోజులుగా ఎదుర్కొంటున్న కష్టాలు, భయంకరమైన చలి వాతావరణం, కొంతమంది రైతుల ఆత్మహత్యలు, కరోనా భయాలు ఇత్యాది అంశాల్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సరైనవే. ఎండనీ, చలినీ ఎదుర్కొంటున్న వృద్ధరైతులు, మహిళలు, పిల్లలపై కోర్టు ప్రత్యేకంగా సానుభూతి ప్రకటించింది. భారత సర్వోన్నత న్యాయస్థానం తన విధిని కచ్చితంగా నిర్వహిస్తుందని హామీ ఇస్తూ, వీరిని ఇళ్ళకు మరలిపొమ్మని కూడా ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు. చర్చలు జరుపుతున్నామంటున్నవారు ఇప్పటివరకూ ఏమీ సాధించకపోవడంతో ఇకపై తాను చురుకైన పాత్ర పోషించాలని న్యాయస్థానం నిర్ణయించుకొని, ఆ చట్టాలను మీరు నిలిపివేస్తారా, మమ్మల్ని ఆ పనిచేయమంటారా అని ప్రశ్నించింది. ఏదో జరుగుతుందని ఎంతో కాలంగా ఎదురు


చూసినా ఫలితం లేదు కనుక ఇక వ్యవహారం తామే తేల్చేస్తామని న్యాయమూర్తులు సంకల్పించారు. ఎంతో ప్రశాతంగా జరుగుతున్న ఈ రైతు ఉద్యమం ఒక చిన్న నిప్పురవ్వ కారణంగా శాంతిభద్రతలకు ప్రమాదకరంగా పరిణమించవచ్చునని న్యాయమూర్తులకు అనిపించింది. అలాగే, గుమిగూడిన వేలాదిమంది కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో అన్న అనుమానమూ కలిగి, కరోనా ఈ దేశంలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలోని తబ్లిగీ జమాతే ఉదంతం ఓ పోలికగా ముందుకు వచ్చింది. 


రిపబ్లిక్‌ డే దగ్గరపడుతున్న తరుణంలో, ప్రభుత్వం తనకు తానుగా ఈ మూడు చట్టాలూ ఉపసంహరించుకోకుండానే రైతులను రాజధానినుంచి ఖాళీచేయించగలిగితే పాలకులకు ఎంతో మంచిది. ఈ చట్టాలు రాజ్యాంగ విహితమా కాదా అన్నటువంటి న్యాయపరమైన అంశాలతో తమకు నిమిత్తం లేదనీ, అవి తమకు అన్యాయం చేస్తాయి కనుక రద్దుచేయాలని రైతులు అంటున్నారు. చట్టాలు చేసిన ప్రభుత్వమే వాటిని రద్దుచేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్నారు. ఈ అంశం న్యాయవ్యవస్థ చేతుల్లోకిపోతే తమ డిమాండ్‌ బలహీనపడుతుందన్న భయం వారిది. ప్రభుత్వం కూడా ఎంతో తెలివిగా చర్చలు జరుపుతున్నట్టు కనిపిస్తూనే రైతుల కోరిక ఒక్కటీ  నెరవేర్చకుండా ఊరుకుంది. అది ఇస్తాం ఇది చేస్తాం అంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనలేవీ రైతులను సంతృప్తిపరచవని పాలకులకు ముందే తెలుసు. ఆ మూడు చట్టాల్లోని అన్యాయాన్నీ, కాఠిన్యాన్నీ ఈ రాయితీలూ, మినహాయింపులు ఎంతమాత్రం సరిదిద్దవన్నది రైతుల వాదన. చేసిన చట్టాలు రాజ్యాంగవిహితమా కాదా అన్న వివాదం ఉత్పన్నమైనప్పుడు మాత్రమే న్యాయవ్యవస్థ జోక్యం సర్వసాధారణం. శాసనాలపై ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు మధ్యవర్తిగా జోక్యం చేసుకోవలసిన అవసరం నిజానికి న్యాయవ్యవస్థకు లేదు. కానీ, వ్యవసాయ చట్టాల వివాదాన్ని కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగదీసి, పరిస్థితిని ఇంతవరకూ తెచ్చింది. అందువల్ల, ఎంతకూ తెగని ఓ వివాదాన్ని పరిష్కరించడానికి ఉభయపక్షాలకూ సుప్రీంకోర్టు ప్రతిపాదన ఉపకరిస్తుంది. సభాచర్చలు, అవసరమైన సవరణలూ ఏమీ లేకుండా ఏకపక్షంగా తెచ్చిన ఈ మూడు చట్టాల విషయంలో తన వైఖరి సవరించుకోవడానికి ప్రభుత్వానికి కాస్తంత వెసులుబాటు దక్కుతుంది. అనేక రోజులుగా ఉద్యమించి చట్టాలపై తమ వ్యతిరేకతను చక్కగా నమోదు చేసిన రైతులు కొత్త మార్గంలోనూ తమ వాదనలు గట్టిగా వినిపించవచ్చు.

Advertisement
Advertisement
Advertisement