‘సుప్రీం’ మార్గం!

ABN , First Publish Date - 2021-07-02T06:39:18+05:30 IST

కకరోనాతో కన్నుమూసినవారి కుటుంబాలకు ఎంతోకొంత పరిహారం చెల్లించాల్సిందేననీ, అది ఎంతన్నది ఆరువారాల్లో నిర్ణయించాలని సుప్రీంకోర్టు బుధవారం చెప్పిన తీర్పు ప్రశంసనీయమైనది...

‘సుప్రీం’ మార్గం!

కకరోనాతో కన్నుమూసినవారి కుటుంబాలకు ఎంతోకొంత పరిహారం చెల్లించాల్సిందేననీ, అది ఎంతన్నది ఆరువారాల్లో నిర్ణయించాలని సుప్రీంకోర్టు బుధవారం చెప్పిన తీర్పు ప్రశంసనీయమైనది. విపత్తులనుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా, పరిహారం కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. జాతీయ విపత్తుల సంస్థ తన విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించడంలో విఫలమైందని విమర్శిస్తూ, ప్రాణరక్షణ నుంచి పరిహారం వరకూ ఆరువారాల్లోగా విధివిధానాలను తయారుచేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు.


పోయినవారి కుటుంబాలకు ఇలా పరిహారాలు ఇచ్చుకుంటూ పోతే, ఉన్నవారిని కాపాడుకోవడం కష్టం కదా అంటూ వాదనల సందర్భంగా ప్రభుత్వం దీర్ఘాలు తీసింది. కచ్చితంగా ఇంత ఇవ్వాలని విపత్తుల చట్టంలో లేదనీ, పైగా పన్నెండు నిర్దిష్టమైన విపత్తుల్లో మాత్రమే ఆర్థికసాయం నిబంధనలున్నాయి తప్ప, అందులో కరోనా లేదని కూడా ప్రభుత్వం వాదించింది. దేశ వనరులను సహేతుకంగా వాడుకోవాలన్న అపరిమితమైన బాధ్యత కారణంగా, కొవిడ్‌ మృతులకు నాలుగులక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వలేనని సుప్రీంకోర్టుకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. పిటిషన్‌దారులు కోరుతున్నట్టుగా నాలుగులక్షలు కాకున్నా, ఎంతోకొంత ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తులు అంతిమంగా ఆదేశించారు. జాతీయ విపత్తు నిధి, రాష్ట్రవిపత్తునిధి, చివరకు భారతసంచితనిధిని కూడా వాడేయాల్సివస్తున్నదంటూ ప్రభుత్వం వాపోతూంటే న్యాయమూర్తులు చేయగలిగేదేమున్నది? తీర్పులో భాగంగా, కరోనా మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలనీ, మరీ ముఖ్యంగా చనిపోయిన తేదీతో పాటు మరణకారణాలను కూడా అందులో ప్రస్తావించాలనడం ప్రశంసనీయమైనవి. బాధిత కుటుంబీకులు కోరితే డెత్‌సర్టిఫికేట్లు సవరించాలనీ, ఒక వ్యక్తి కొవిడ్‌ పాజిటివ్‌ అయిన మూడునెలలకు చనిపోయినా దానిని కరోనామరణంగానే ధ్రువీకరించాలనీ పేర్కొనడం ప్రభుత్వాలను కచ్చితంగా ఇరుకునపెట్టేవే. మరణాలు వేలాదిగా ఉన్నా, అధికారికంగా వందల్లో చూపుతూ ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయి. మరణకారణాలు వేరేవి చెబుతూ లెక్కలు తారుమారుచేస్తున్నాయి. లక్షలాది చావుల వెనుక ఉన్న నిజాన్ని గుర్తించ నిరాకరించిన ప్రభుత్వాలు ఇప్పుడు, మూడునెలల వరకూ సంభవించే ప్రతీ మరణాన్నీ కరోనాకోటాలోనే వేయాలన్న సుప్రీం ఆదేశాన్ని మౌనంగా స్వీకరిస్తాయని అనుకోలేం.


ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం ప్రభుత్వాలు బాధిత కుటుంబీకులకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా, 2015లో మోదీ ప్రభుత్వమే దీనిని నాలుగులక్షల రూపాయలుగా సవరించింది. కరోనాను ఈ జాతీయ విపత్తుల జాబితాలో చేర్చినందున, కొవిడ్‌ మరణాలు సైతం పరిహారానికి అర్హమైనవే కనుక, సెక్షన్‌ పన్నెండులో పేర్కొన్న ప్రకారం నాలుగులక్షల రూపాయలు ఇవ్వాలని పిటిషన్‌దారులు అడుగుతున్నారు. కేంద్రప్రభుత్వం గతంలో ఇదే మొత్తాన్ని పరిహారంగా ప్రస్తావిస్తూ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసి, కొద్దిగంటల్లోనే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ, అధికారిక లెక్కల ప్రకారమే 3.90 లక్షలమంది కరోనాతో మరణించినందున 15వేలకోట్ల రూపాయలకు పైబడి పరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది కనుక ప్రభుత్వం కుదరదని అంటున్నది. మిగతా విపత్తులకూ దీనికీ హస్తిమశకాంతరం ఉన్నదనీ, వరుస వేవ్‌లు ముంచెత్తుతూంటే పరిహారం ఇస్తూపోవడం అసాధ్యమని అంటున్నది. పిటిషన్‌దారులు కరోనా మరణాల చుట్టూ ప్రభుత్వాలు అల్లిన మాయని ఛేదించే దిశగా చేసిన ప్రయత్నం మెచ్చుదగినది. పోస్టుమార్టమ్‌ లేకుండా, డెత్‌సర్టిఫికేట్‌లో గుండెపోటు, శ్వాసనిలిచిపోవడం వంటివి రాస్తూ, కరోనా మిగల్చిన దుష్ప్రభావాలతో సంభవించిన మరణాలను లెక్కకే తీసుకోని ప్రభుత్వాలకు ఈ తీర్పు బాధ్యతను గుర్తుచేసింది. నిజానికి ప్రభుత్వాల భారీ వ్యయాలతో పోల్చితే ఈ పరిహారం భరించలేనిదేమీ కాదు. ప్రజారోగ్యపరిరక్షణలో విఫలం చెంది, సకాలంలో ఆక్సిజన్‌ కూడా అందించక వేలాది చావులకు కారణమైనవారు, ఇలా న్యాయస్థానాలతో చెప్పించుకొనేకంటే, ముందే సానుకూలంగా స్పందిస్తే బాగుండేదేమో!

Updated Date - 2021-07-02T06:39:18+05:30 IST