హ్యాకింగ్‌ నిజమే అయితే..సీరియస్సే

ABN , First Publish Date - 2021-08-06T07:44:26+05:30 IST

ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్వోకు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది.

హ్యాకింగ్‌ నిజమే అయితే..సీరియస్సే

  • తీవ్రంగా పరిగణిస్తామన్న సుప్రీం కోర్టు
  • పెగాసస్‌పై ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
  • టెలిగ్రాఫ్‌, ఐటీ చట్టాలను ఎందుకు ఆశ్రయించరు
  • రెండేళ్ల కిందటే వెలుగు చూసింది కదా
  • ఇప్పుడే ఎందుకు వ్యాజ్యాలు దాఖలు చేశారు?
  • పిటిషనర్లకు సీజేఐ జస్టిస్‌ రమణ ప్రశ్నలు
  • జాబితా ఇప్పుడే వెలుగు చూసిందన్న కపిల్‌ సిబ్బల్‌
  • ఒక్కో యూజర్‌కు 39 లక్షల ఖర్చు అని అంచనా
  • ఐటీ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం
  • కోర్టుకు తెలిపిన న్యాయవాది అరవింద్‌ దతార్‌
  • అయితే.. హ్యాకింగ్‌ చేసిందెవరో తేలాలని వ్యాఖ్య
  • ప్రభుత్వం పౌరులపై చేస్తున్న యుద్ధం: దివాన్‌
  • కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

భారత టెలిగ్రాఫ్‌ చట్టం, సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం ప్రకారం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 2019లోనే పెగాసస్‌ అంశం బయటపడితే.. ఇప్పటి వరకూ కోర్టుకు ఎందుకు రాలేదు? పిటిషనర్లలో విద్యావంతులు, విషయ నిపుణులు ఉన్నారు. వారు తమకు అందుబాటులో ఉన్న వనరులతో వివరాలను సేకరించి, మరింత నిర్ధారించుకోదగ్గ సమాచారాన్ని సేకరించి ఉంటే బాగుండేది. 


న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్వోకు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలు, ఇతర ప్రముఖులను టార్గెట్‌ చేసుకుని హ్యాకింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే.. పెగాస్‌సను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. పెగాసస్‌ నిఘా ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన 9 పిటిషన్లను జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘పిటిషనర్లలో కొందరు తమ ఫోన్లపైనా నిఘా పెట్టారంటున్నారు. మరి వారు టెలిగ్రాఫ్‌ చట్టం, ఐటీ చట్టం ప్రకారం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 2019లోనే పెగాసస్‌ అంశం బయటపడితే.. ఇప్పటి వరకూ కోర్టుకు ఎందుకు రాలేదు?’’ అని ప్రశ్నించింది. 


పిటిషనర్లలో విద్యావంతులు, విషయ నిపుణులు ఉన్నారని గుర్తుచేస్తూ.. వారు తమకు అందుబాటులో ఉన్న వనరులతో వివరాలను సేకరించి, మరింత నిర్ధారించుకోదగ్గ సమాచారాన్ని సేకరించి ఉంటే బాగుండేదని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. ఈ దశలో.. జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ కల్పించుకుంటూ.. 2019లోనే పెగాసస్‌ వ్యవహారం బయటపడ్డా, ఇప్పుడిప్పుడే కొన్ని నివేదికల ద్వారా బాధితుల వివరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పాత నంబరు కూడా ఆ జాబితాలో ఉందని తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘‘నిజాలు బయటకు రావాలి. అది వేరే విషయం. ఎవరి పేర్లున్నాయో తెలియదు’’ అని అన్నారు. ఈ అంశంపై దాఖలైన 9 పిటిషన్ల ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తదుపరి విచారణలో కేంద్రం తరఫున ఓ ప్రతినిధి ఉండేందుకు అది దోహదపడుతుందన్నారు. కపిల్‌ సిబ్బల్‌ కల్పించుకుంటూ.. ‘‘పెగాస్‌సకు వ్యతిరేకంగా వాట్సాప్‌ చేపట్టిన దర్యాప్తులో హ్యాకింగ్‌ కోణం బయటపడింది. 


అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో దీనిపై వాట్సాప్‌ న్యాయపోరాటం చేస్తోంది. ఎన్‌ఎ్‌సవో తయారు చేసిన ఈ స్పైవేర్‌ కేవలం ప్రభుత్వాలకే విక్రయిస్తారని ఆ సంస్థ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంది’’ అని తెలిపారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడానా? అని ప్రశ్నించారు. ‘‘ఆ విషయం నాకు తెలియదు. ఒక న్యాయమూర్తి, కోర్టు అధికారులు కూడా పెగాసస్‌ జాబితాలో ఉండడం సీరియస్‌ అంశం. పెగాస్‌స/ఎన్‌ఎ్‌సవో వెబ్‌సైట్‌లో తమ స్పైవేర్‌ను ఉగ్రవాదంపై పోరుకోసం ప్రభుత్వాలకే అందజేస్తాం అని పేర్కొన్నారు. ఇక్కడ జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, విపక్ష నేతలు, ప్రముఖులపై దాన్ని ప్రయోగించారు. అంటే.. ప్రభుత్వం దృష్టిలో వారంతా ఉగ్రవాదులా? అనే విషయం తెలియాలి. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా సమగ్ర దర్యాప్తు అవసరం’’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం.. ఒక్క యూజర్‌పై పెగాస్‌సను ప్రయోగించేందుకు రూ. 39 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కోర్టుకు చెప్పారు. పెగాస్‌సను ఉగ్రవాదులపై కాకుండా, ఇతరులపై ఎందుకు ప్రయోగించారు? అసలు ఆ స్పైవేర్‌ను ఎవరు కొనుగోలు చేశారు? ఎంత ఖర్చు పెట్టారో నిగ్గు తేలాల్సి ఉందన్నారు. 


భారత్‌లో 300 మందిపై పెగాసస్‌ నిఘా అనే నివేదికలతో ప్రభుత్వం విభేదించలేదని చెప్పారు. సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ తరఫున హాజరైన న్యాయవాది మీనాక్షీ అరోరా మాట్లాడుతూ.. 2019లో కేంద్ర ప్రభుత్వం నిఘా ఏమీ పెట్టలేదని పేర్కొందని, ఇప్పుడు ప్రభుత్వమే ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలిందని చెప్పారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. జగ్దీప్‌ చొక్కర్‌ తరఫున శ్యామ్‌ దివాన్‌ వాదిస్తూ.. పెగాసస్‌ వ్యవహారంపై అమెరికా, ఫ్రాన్స్‌ ప్రభుత్వాలు దర్యాప్తు ప్రారంభించాయని, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరాయని గుర్తుచేశారు. ‘‘మన ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఆరోపణలు కేవలం మీడియా నివేదికలు మాత్రమే కాదు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిన నిజాలు. ప్రభుత్వమే పౌరులపై స్పైవేర్‌ను ప్రయోగించడం రాజ్యాంగ వ్యతిరేకం. పౌరులపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధం. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఒక స్వతంత్ర కమిటీ ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలి’’ అని కోర్టును కోరారు. 


జర్నలిసులుఉ రూపేశ్‌కుమార్‌ సింగ్‌, ఇప్సా శతాక్షి తరఫున సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దతార్‌ వాదనలు వినిపించారు. ‘‘ఐటీ చట్టంలోని సెక్షన్‌ 43 ప్రకారం.. పెగాసస్‌ బాధితుల జాబితాలో ఉన్న వారు నష్ట పరిహారం కోరవచ్చు. అయితే.. బాధితుల ఫోన్లను హ్యాక్‌ చేసింది ఎవరో తేలాలి. అందుకే దర్యాప్తు అవసరం’’ అని విజ్ఞప్తి చేశారు. 2008లో ఐటీ చట్టాన్ని సవరించినప్పుడు ఇంతటి అత్యాధునిక దాడి జరుగుతుందని ఎవరూ ఊహించలేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టే దారి చూపాలని కోరారు. కాగా, ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘మిస్టర్‌ శర్మా..! ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్‌ తప్ప మీ పిటిషన్‌ లో ఏముంది? దేనికోసం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు? మేమే సమాచారాన్ని సేకరించి మీ తరఫున వాదించాలా? ఇది పద్ధతి కాదు’’ అని బెంచ్‌ మందలించింది. పైగా ప్రతివాదిగా నరేంద్రమోదీ, అమిత్‌ షాలను వ్యక్తిగత హోదాలో చేర్చడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తులను చేరిస్తే నోటీసులు ఎలా ఇస్తాం? అని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ముందు పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో జర్నలిస్టులు గుహ థాకుర్తా, ఎస్‌ఎన్‌ఎం అబ్ది, ప్రేమ్‌శంకర్‌ ఝా, నరేంద్రకుమార్‌ మిశ్రా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు కూడా ఉన్నారు. స్పైవేర్‌ కాంట్రాక్టు, నిఘా వేసిన వారి గురించి కేంద్రాన్ని వివరాలు కోరాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ తన పిటిషన్‌లో కోరింది.

Updated Date - 2021-08-06T07:44:26+05:30 IST