American Supreme Court: జో బైడెన్ అధికారాలకు కత్తెర

ABN , First Publish Date - 2022-07-01T19:21:45+05:30 IST

వాతావరణ మార్పులకు కారణమవుతున్న కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు

American Supreme Court: జో బైడెన్ అధికారాలకు కత్తెర

వాషింగ్టన్ : వాతావరణ మార్పులకు కారణమవుతున్న కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇటువంటి నిబంధనల జారీకి ఫెడరల్ ప్రభుత్వానికి ఉన్న అధికారాలపై పరిమితి విధించింది. క్లీన్ ఎయిర్ యాక్ట్ ప్రకారం పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA)కు ఉన్న అధికారాలను పరిమితం చేస్తూ 6-3 మెజారిటీ తీర్పు ఇచ్చింది. 


బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను క్రమబద్ధీకరించేందుకు EPAకు ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు పరిమితం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఆరుగురు కన్జర్వేటివ్ జడ్జిలతో కలిసి రాబర్ట్స్ ఈ తీర్పు ఇచ్చారు. ముగ్గురు జడ్జిలు దీనిని వ్యతిరేకించారు. కొత్త నిబంధనలను రూపొందించడం కోసం జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తోంది. 


దేశాన్ని వెనుకకు నెట్టే తీర్పు 

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జో బైడెన్ స్పందిస్తూ, మన దేశాన్ని వెనుకకు నెట్టే లక్ష్యంతో ఇచ్చిన మరొక విధ్వంసకర తీర్పు అని పేర్కొన్నారు. మన దేశ గాలిని పరిశుభ్రంగా ఉంచేందుకు, వాతావరణ మార్పులతో పోరాడేందుకు మన దేశ శక్తి, సామర్థ్యాలకు నష్టం కలిగించే తీర్పు ఇది అని వ్యాఖ్యానించారు. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రజారోగ్యాన్ని కాపాడటంలో తనకుగల చట్టబద్ధమైన అధికారాలను వినియోగించేందుకు తాను వెనుకంజవేయబోమనని స్పష్టం చేశారు. ఈ తీర్పును సమీక్షించాలని తన లీగల్ టీమ్‌కు చెప్పానని తెలిపారు. ప్రభావిత సంస్థలతోపాటు జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఈ సమీక్ష నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఉద్గారాలతో సహా కాలుష్యం నుంచి రక్షణ లభించే విధంగా చేయడం కోసం ఫెడరల్ చట్టం ప్రకారం ఉన్న అవకాశాలను గుర్తించాలని చెప్పినట్లు తెలిపారు. 


Updated Date - 2022-07-01T19:21:45+05:30 IST