ఈసారి నిమజ్జనానికి ఓకే!

ABN , First Publish Date - 2021-09-17T08:49:46+05:30 IST

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ) వినాయకుడి విగ్రహాలను ఈ ఏడాదికి హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే.

ఈసారి నిమజ్జనానికి ఓకే!

  • నిమజ్జనానికి వచ్చే ఏడాది నుంచి 
  • ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే
  • చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు
  • రాష్ట్ర సర్కారుకు ఊరట
  • ఏటా ఇదే సమస్య.. కోర్టు ఆదేశాలను 
  • ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
  • ప్రజలూ సహకరించాలి.. క్రమశిక్షణ 
  • ఉండాలి: సీజేఐ జస్టిస్‌ రమణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ) వినాయకుడి విగ్రహాలను ఈ ఏడాదికి హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హుస్సేన్‌ సాగర్‌లో పీవోపీ వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి చివరిసారిగా అనుమతించింది. ‘‘ఇదే మీకు చివరి అవకాశం. వచ్చే ఏడాది నుంచి నిమజ్జనానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలి’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. హుస్సేన్‌ సాగర్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వచ్చే ఏడాది నుంచి అమలు చేయడానికి ఏ చర్యలు తీసుకున్నారో తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నిర్దేశించారు. వచ్చే ఏడాది నుంచి నిమజ్జనానికి హుస్సేన్‌ సాగర్‌ను ఉపయోగించబోమని, ఈ ఏడాది కలుషితం కాకుండా చూస్తామని, నిమజ్జనం జరిగిన వెంటనే విగ్రహాలను బయటకు తీసి వ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హామీ ఇవ్వడంతో జస్టిస్‌ రమణ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్‌ సాగర్‌లో పీవోపీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని నిషేధించడంతోపాటు ఉత్సవాలపై మార్గదర్శక సూత్రా లు జారీ చేసిన హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ హిమా కోహ్లీ కూడా ఉన్నారు. అయితే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో తాను వినాయక చవితికి సంబంధించి ఇటువంటి ఆదేశాలే జారీ చేశానని, అందువల్ల విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.




ఏటా ఇదే సమస్య!

హైదరాబాద్‌లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రతి ఏడాదీ ఇదే సమస్య పునరావృతమవుతోందని, కోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జస్టిస్‌ రమణ తప్పుబట్టారు. ఏటా నిమజ్జనాలు జరుగుతుండడంతో కాలుష్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా, ఉత్సవాలు జరుగుతుండగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఇతర చెరువుల్లో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయలేమని తుషార్‌ మెహతా నిస్సహాయత వ్యక్తం చేశారు. దాంతో, పెద్ద పెద్ద పీవోపీ విగ్రహాలను ముందుగానే నిషేధించి ఉండాల్సిందని చీఫ్‌ జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు.ఫలానా చర్యలు పాటించాలంటూ చివరి నిమిషంలో ఇప్పుడు ఆదేశించడం సరికాదని, అందుకే, అఫిడవిట్‌ దాఖలు చేస్తే ఈ ఏడాదికి నిమజ్జనాన్ని అనుమతిస్తామని, వచ్చే ఏడాది నుంచి ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని నిర్దేశించారు. ‘‘ఏటా చెరువు సుందరీకరణకు ఎంతో డబ్బును ఖర్చు చేస్తారు. నిమజ్జనానికి అనుమతిస్తే ఈ ఖర్చుకు అర్థమేముంది? మీరు ముందే చర్యలు తీసుకుని ఉండాల్సింది’’అని స్పష్టం చేశారు. దాంతో, అందుకే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని అఫిడవిట్‌లో హామీ ఇచ్చామని, ఇప్పుడు మాత్రం సమస్యను నివారించే దశగా చర్యలు తీసుకుంటామని సొలిసిటర్‌ జనరల్‌ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-09-17T08:49:46+05:30 IST