Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థిక చాణక్యుడి అస్తమయం

  • కొణిజేటి రోశయ్య కన్నుమూత
  • ఉదయం నిద్రలేవకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
  • మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచిన నేత
  • కుటుంబ సభ్యులు, నాయకుల దిగ్ర్భాంతి
  • పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ
  • తెలంగాణ సీఎం కేసీఆర్‌, చంద్రబాబు,కేవీపీ సహా పలువురు ప్రముఖులు కూడా
  • నేటి ఉదయం గాంధీభవన్‌కు భౌతికకాయం
  • అనంతరం దేవరయాంజాల్‌లో..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • ఉభయ రాష్ట్రాల్లో 3రోజులు సంతాప దినాలు


ఆర్థిక మంత్రి అంటే ఆయనే గుర్తుకొస్తారు! నోరు పారేసుకోరు కానీ... చురకత్తి మాటలతో ప్రత్యర్థులను గుచ్చేస్తారు! తానుగా  పదవులు ఆశించరు. ఇచ్చిన పదవికి వందశాతం న్యాయం చేస్తారు. బలమైన రాజకీయ నేపథ్యం లేదు. సొంత వర్గమూ లేదు. అయినా సరే... అనేక శాఖలను నిర్వహించిన మంత్రిగా ఖ్యాతి గడించారు. అనుకోని పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్‌ పదవి తర్వాత ప్రశాంత జీవితం గడుపుతున్నారు. అంతే ప్రశాంతంగా కన్ను మూశారు! ఆయనే... రాజకీయ కురువృద్ధుడు రోశయ్య! ఆ పెద్దాయన ఇక లేరు!


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌, అజాతశత్రువుగా పేరొందిన రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య (88) ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఉదయాన్నే 5.30కి నిద్రలేచిన రోశయ్య.. కాలకృత్యాల అనంతరం మళ్లీ నిద్రపోయారు. సాధారణంగా ఉదయం 7.15కి ఆయన నిద్రలేస్తారు. 7.30 వరకూ లేవకపోవడంతో.. నాడి పరిశీలించిన కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే రోశయ్య మరణించారని వైద్యులు ఉదయం 8.20 గంటలకు ప్రకటించారు. 10.20కి భౌతిక కాయాన్ని అమీర్‌పేట్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయనకు భార్య శివలక్ష్మి, వీరికి ముగ్గురు కుమారులు శివ సుబ్బారావు, త్రివిక్రమరావు, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు. రోశయ్య కొంత కాలంగా వయస్సు రీత్యా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకాలేదు. కాగా.. రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాంధీ భవన్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా శనివారం నుంచి సోమవారం దాకా సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు తెలిపింది.

ఇలా జరుగుతుందనుకోలేదు: కుటుంబసభ్యులు

వయసు మీద పడడంతో కొంతకాలంగా నాన్న ఇంట్లోనే ఉంటున్నారని రోశయ్య పెద్ద కుమారుడు శివసుబ్బారావు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు అందరితో మాట్లాడి నిద్రపోయారని.. తెల్లవారుజామున కాలకృత్యాలకు నిద్రలేచిన తర్వాత మళ్లీ పడుకున్నారని, ఉదయం 7.30 అనంతరం లేవకపోవడంతో ఆందోళనకు గురై నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారని చెప్పారు. మామయ్య ఒక్కసారిగా ఇలా అవుతాడని అనుకోలేదని.. బీపీతో పల్స్‌ పడిపోయిందని భావించామని, చికిత్స అందిస్తే కుదురుకుంటాడని అనుకున్నామని.. ఇంతలోనే మమ్మల్ని విడిచి వెళ్లారని చిన్నకోడలు సుహాసిని వాపోయారు.

ఎన్వీ రమణ, కేసీఆర్‌ నివాళి

రోశయ్య మృతిపై కుటుంబసభ్యులు, స్నేహితులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. హైదరాబాద్‌లోనే ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్‌ కూడా ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావును అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అమరావతి నుంచి హైదరాబాద్‌ వచ్చి రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు. ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉభయ రాష్ట్రాలకు చెందిన మాజీ మంత్రులు డి.శ్రీనివాస్‌, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, వినోద్‌, డీకే అరుణ, మండలి బుద్దప్రసాద్‌ , జేసీ దివాకర్‌రెడ్డి, మారెప్ప, మాజీ ఎంపీలు వివేక్‌, వీహెచ్‌, పొన్నం ప్రభాకర్‌, లగడపాటి రాజగోపాల్‌, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు గణేశ్‌ గుప్తా, దానం నాగేందర్‌, భూమన కరుణాకర్‌రెడ్డి, కాసు మహేశ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఏ ఫరూక్‌, శంభీపూర్‌రాజు, జీవన్‌రెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, టీడీపీ సీనియర్‌ నేతలు నన్నపనేని రాజకుమారి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ జససమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వర్‌చంద్ర తదితరులు కూడా పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, రోశయ్య అభిమానులు పెద్దసంఖ్యలో నివాసానికి తరలివచ్చారు.


రోశయ్య నివాసంలో.. కేవీపీ అన్నీ తానై!


హైదరాబాద్‌ : రోశయ్య మృతి నేపథ్యంలో శనివారం ఆయన నివాసం వద్ద ఏపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నీ తానై వ్యవహరించారు. రోశయ్యను ఆస్పత్రిలో చేర్పించిన విషయాన్ని తెలుసుకున్న కేవీపీ.. హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే రోశయ్య మృతి చెందడంతో పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చేవరకు కేవీపీయే అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోశయ్య నివాసం వద్దనే ఉన్నారు. రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు సీఎం కేసీఆర్‌ రాగా.. కేవీపీ ఆయన వద్దకు వెళ్లారు. కేసీఆర్‌ అక్కడున్నంతసేపూ ఆయన వెంటే ఉన్నారు. రోశయ్య నివాసానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వచ్చినప్పుడు కూడా ఆయన వెంటే ఉన్నారు.

నేడు హైదరాబాద్‌కు ఖర్గే

రోశయ్య పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తరపున రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నివాళులు అర్పించనున్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వచ్చి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కాగా.. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ), కార్యవర్గ ఉమ్మడి సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరిగింది. రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించింది. ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో స్మృతివనం, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్లు పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ మీడియాకు వెల్లడించారు.

రోశయ్యతో అనుబంధం: కేటీఆర్‌ 

రాజకీయాల్లో రోశయ్య అజాత శత్రువు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నాటి ముఖ్యమంత్రి అయిన రోశయ్యతో ప్రత్యేక అనుబంధం ఉండేది. తెలంగాణ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన గొప్పవ్యక్తి. 

విపక్షంలోనూ అభిమానులు: హరీశ్‌

రోశయ్య హఠాన్మరణం చాలా బాధాకరం. స్వపక్షంతోపాటు విపక్షంలోనూ అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి ఆయన. ఉద్యమ సమయంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో నాకు ఎక్కువసార్లు మాట్లాడే అవకాశం లభించింది. 


పదవుల కోసం పాకులాడలేదు: జానా

రోశయ్య మరణం బాధాకరం. ఆయన ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదు. సహచర మంత్రులుగా చాలా కాలం కలిసి పనిచేశాం. ఎన్నో సమస్యల పరిష్కారానికి సలహాలు సూచనలు తీసుకున్నాం. ఆర్థికశాఖపై పట్టున్న వ్యక్తి. 


ప్రతిపక్షాలకూ నిధులిచ్చారు: రేవంత్‌

రోశయ్య మరణం తీరని లోటు. పార్టీలకతీతంగా యువ నాయకులను ఆయన ప్రోత్సహించాను. ప్రతిపక్ష నేతలుగా కొట్లాడిన సమయంలోనూ నిధులు కేటాయించి ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. శాసనసభలో రోశయ్య ప్రశ్నలకు ముఖ్యమంత్రులు జాగ్రత్తగా సమాధానాలు ఇచ్చేవారు. తెలంగాణ సమస్యలను కేంద్రం దృష్టికి నిజాయితీగా తీసుకె ళ్లారు. రోశయ్య కుటుంబ సభ్యులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. వారితో సోనియా, రాహుల్‌గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నడిబొడ్డున రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలి.

Advertisement
Advertisement