సుమతీ శతకం పోతనకు ముందరిదే

ABN , First Publish Date - 2021-01-18T10:25:09+05:30 IST

తిక్కన, పోతన పద్యాలలో, కొందరి కావ్యాలలో సుమతీ అని ఒకవేళ సంబోధనగానో పాదాంతంలోనో ఉంటే అది యాదృచ్ఛికమే కాని వారిని...

సుమతీ శతకం పోతనకు ముందరిదే

తిక్కన, పోతన పద్యాలలో, కొందరి కావ్యాలలో సుమతీ అని ఒకవేళ సంబోధనగానో పాదాంతంలోనో ఉంటే అది యాదృచ్ఛికమే కాని వారిని సుమతీశతకకారుడు అనుసరించాడని కాదు. 


సోమవారం , జనవరి 4 నాటి ఆంధ్రజ్యోతి, వివిధలో భట్టు వెంకటరావు రాసిన ‘నేలదున్ని మనుట చాల మిన్న’ అనే వ్యాసంలో శాఖాచంక్రమణంగా సుమతీ కర్తృత్వ కాలాలను గురించి చర్చించారు. పోతన భాగవతంలో ఒక పద్యం సుమతీ అనే సంబోధనతో ఉందని, అది మోడల్‌గా బద్దెన స్వీకరించాడని ఒక పద్యం చూపించారు. నిజానికి ‘సుమతీ’ అనే సంబోధనతో ఉన్న పద్యం తిక్కన భారతంలోనూ ఉంది. శాంతిపర్వం చదుర్థాశ్వాసము, 180వ పద్యం చూడండి. ‘డెందమునకింద్రియములకు/నొందగరాకున్న లేకయున్నే తత్త్వం/ బెందు? నపరభాగంబున/బొందవు చూడ్కులవిలేక పోవునె సుమతీ’’. 


మరి దీన్ని మోడల్‌గా స్వీకరించి ఉంటే పోతన్నకంటే ముందే కావచ్చు. ఇదికూడా ఒక ఉపదేశాత్మకమైన పద్యమే. రెండవ అంశం వారు చూపినది, ‘అడిగిన జీతం బియ్యని’ పద్యంలోని సామాజిక సెటప్‌. (వారిభాషలోనే). బ్రిటి్‌షపరిపాలనాకాలంనుండే మొదలయిందని అన్నారు. జీతము, దొర, ఎద్దులు అనేవి బ్రిటిషువారి రాకకుముందే తెలుగునాట ప్రచారంలో ఉన్న మాటలు. ఏ తెలుగుసాంఘిక చరిత్ర చదివినా తెలుస్తుంది. 


పోతన్న పద్యంతో సుమతీ పద్యం ఎప్పటికెయ్యది ప్రస్తుతమనేది పోల్చి చూడమన్నారు. వారు చూపిన పోతనపద్యం ‘బాలా జన శాలా ధన/ లీలాజనముఖ్యవిభవలీల మనీషా లాలసులగుమానవులను /గాలమువంచించు దురవగాహము సుమతీ’. ఈ పద్యంలో సంస్కృత సమాసాలతో నిండిన గణాలున్నాయి. పాదాతిక్రమణం (ఒకపాదంనుండి సమాసం మరొకపాదంలోకి చొచ్చుకొని వచ్చినవి) ఉంది. కాని సుమతీ పద్యంలో ‘ఎప్పటి, కెయ్యది, ప్రస్తుత, మప్పటి కామాటలాడి యన్యుల మనముల్‌/ నొప్పింపక తానొవ్వక/ తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ’’ నిర్మాణంలో పదానికొక గణంగా విరిగిపోయాయి. సమాసాలు లేవు. పాదాతిక్రమణలేదు. దాదాపు సుమతీ శతకంలోని పద్యాలన్నీ ఏ పదానికి ఆ పదంగా గణంగా విడిపోయి ఉండడం వల్ల దానిదైన లయ, శైలి ఏర్పడ్డాయి. వినదగునెవ్వరు చెప్పిన, ఉపకారికి నుపకారము,కొఱగానికొడుకుపుట్టిన, నమ్మకుమీకసుగాయలు, నీరే ప్రాణాధారము ...ఇట్లా ఎన్ని పద్యాలు తీసుకున్నా వాటి పదాల గణాల పొందిక ప్రత్యేమైనది. దీర్ఘ సమాసాలు, పాదాతిక్రమణలు లేవు. ఇది నిర్మాణపరమైన భేదం. 


ఇక భావం పోతన పద్యంలో నీతి ఉన్నది కనుక ఇది కూడా నీతిని తెలుపడానికి ఉపయుక్తమైంది అని చెప్పడం యాదృచ్ఛికమే కాని అనుకరణకాదు. శాంతి పర్వంలో కుమారా, వత్సా, వివేకమతీ, ధీమతీ, పుత్రా, నృపా వంటి సంబోధనలతో అనేక కందపద్యాలున్నాయి. కందాన్ని తిక్కన్న వైవిధ్యంగా వాడుకున్నాడు కనుకనే కందమునకు తిక్కన అన్న నానుడి వచ్చింది. నిజానికి తిక్కన్నకు ముందే సుమతీ శతకం వచ్చి ఉంటుందని, వేములవాడ రాజధానిగా పాలించిన చాళుక్యబద్దెగుడే దీని కర్త అనీ, అక్కడి కుర్క్యాల శాసనం లో ఇప్పటికీ తొలికందపద్యాలున్నాయనీ, పదవ శతాబ్దంలోనే మల్లియ రేచన కవిజనాశ్రయం పేరుతో ఛందశ్శాస్త్రం రాశాడనీ, అందులో లక్షణాలన్నీ కందపద్యాలేననీ మరెన్నో ఆధారాలున్నాయని సాహిత్య చరిత్రకారులు ముదిగంటి సుజాతారెడ్డిగారు, ఆచార్య ఎస్‌.వి.రామారావుగారు, తమ సాహిత్య చరిత్రల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయాలపై పండితులు చర్చ చేయవచ్చు. డా. మచ్చహరిదాసు ‘తథ్యము సుమతీ’ పేరుతో ప్రామాణికమైన పరిశోధనా గ్రంథం రాశారు. వీరెవరూ పోతనను మోడల్‌గా తీసుకున్నారని రాయలేదు. అది అసమంజసం కూడా. తిక్కన, పోతన పద్యాలలో, కొందరి కావ్యాలలో సుమతీ అని ఒకవేళ సంబోధనగానో పాదాంతంలోనో ఉంటే అది యాదృచ్ఛికమే కాని వారిని సుమతీశతకకారుడనుసరించాడని ఆయన కాలాన్ని పోతనకీవలకు చెప్పడం సరియైునది కాదు. సుమతీ పద్యాలే ప్రజలలో పండితులలో బాగా ప్రచారమయి ఆ ప్రభావమే ఆయా కవుల కావ్యాలలో పద్యాలలో సుమతీ అని దొర్లి ఉండవచ్చుకదా అనుకుంటే వారందరికంటే ముందటివాడు బద్దెన. ముందరిది సుమతీ శతకం అవుతుంది.

డా. గండ్ర లక్ష్మణ రావు

Updated Date - 2021-01-18T10:25:09+05:30 IST