మాజీ ఎమ్మెల్యే పూడి హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-09-17T12:31:39+05:30 IST

మాజీ శాసనసభ్యుడు పూడి మంగపతిరావు (65) బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఈనెల 14వ తేదీన అనారోగ్యానికి గురైన ఆయన్ను విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ

మాజీ ఎమ్మెల్యే పూడి హఠాన్మరణం

రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన మంగపతిరావు

విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు

చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి


విశాఖపట్నం/కె.కోటపాడు, సెప్టెంబరు 16: మాజీ శాసనసభ్యుడు పూడి మంగపతిరావు (65) బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఈనెల 14వ తేదీన అనారోగ్యానికి గురైన ఆయన్ను విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిల్లాలోని కె.కోటపాడు మండలం మేడిచర్ల గ్రామానికి చెందిన మంగపతిరావు 2004 ఎన్నికల్లో విజయనగరం జిల్లా ఉత్తరాపల్లి నియోజకవర్గం (నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి కోళ్ళ అప్పలనాయుడుపై 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ కేటాయించలేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం వైసీపీకి దగ్గరయ్యారు. 2014లో మాడుగుల నియోజకవర్గ టిక్కెట్‌ కోసం యత్నించారు. టిక్కెట్‌ దక్కకపోవడంతో టీడీపీలో చేరి అందులోనే కొనసాగుతున్నారు. మంగపతిరావు మరణవార్త విని ఆయన అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు దిగ్ర్భాంతి చెందారు. మంగపతిరావు మృతిపట్ల టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు, పార్టీ నాయకులు పైల ప్రసాదరావు, పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మంగపతిరావుకు భార్య నారాయణమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఎన్టీపీసీలో, మరొకరు ప్రైవేటు స్టీల్‌ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. 

మేడిచర్లలో విషాద ఛాయలు

విశాఖలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందిన మంగపతిరావు భౌతికకాయాన్ని బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మేడిచర్లకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులతోపాటు యావత్‌ గ్రామస్థులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. గురువారం మధ్యాహ్నం  అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-09-17T12:31:39+05:30 IST