Abn logo
Feb 22 2021 @ 00:29AM

ఉర్దూ భాషలో పలికిన ఉపఖండ ఆత్మ

ప్రపంచ ప్రపంచ సాహిత్యంలో ప్రకాశించే ఉపఖండ రచయితల పేర్లలో సాదత్‌ హసన్‌ మంటో ముఖ్యమై నది. మంటో రచనలు చేసిన కాలం చరిత్రలో ప్రత్యేక మైనది. ఆ కాలంలో సృజనకారులు - రచయితలు, చిత్రకారులు, సంగీతకారులు చాలామంది కొత్త దారులు వేసినవారే. తమ తమ రంగాలలో సంచలనాత్మకమైన మార్పులు తెచ్చినవారే. అప్పటి రాజకీయ, ఆర్థిక నేపథ్యాలను బట్టి అట్లా తప్ప మరొక విధంగా కళాసృష్టి చేయటం సాధ్యంకాని రోజులవి. 


మంటోకి (1912) కాస్త ముందు వెనక సంవత్సరాలలో జన్మించిన రచయితలను గుర్తు తెచ్చుకోండి. ఆనాటి చరిత్ర తలచుకోండి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాల్యం జారిపోయి- రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం సిద్ధమైన రోజులలో యవ్వనంలోకి వచ్చి- సోషలిస్టు భావాలూ, సమాజాలూ వ్యాపించి విస్తరిస్తున్న ఉత్సాహాన్నీ ఉద్వేగాన్నీ చూస్తూ, రెండవ ప్రపంచ యుద్ధంలో మనిషికి తన శత్రువు ముఖంలేనివాడైన స్థితినీ, ట్రెంచిలలో జరిగే యుద్ధాలలో, మానవుడు ‘యాంత్రోపస్‌ ఎరక్టస్‌’గా మిగలని పరిస్థితినీ, ఒకవైపు దేశాలు స్వతంత్రంకోసం, జాతులు విముక్తికోసం తహతహలాడు తున్న సందర్భాన్నీ, మరోవైపు తన తోటి మనిషిని దారుణంగా హింసించి, చంపి, అత్యాచారం చేయగల అమానుషత్వాన్ని జాతి మత విద్వేషకాండలు మనుషులకు నేర్పుతున్న సమయాన్నీ, అను భవిస్తూ, ఆకళింపు చేసుకుంటూ ఒక రచయితగా, కళాకారుడిగా జీవించటం ఎంత కష్టం! అదే సమయంలో ఎంత అద్భుతం! 


ఆ క్షణాలను గదా చేజిక్కించుకోవాలి. ఆ కాలాన్ని గదా ఒడిసి పట్టుకోవాలి. ఆ సంక్లిష్టతను గదా సంవిధానపరచాలి. ఒక సవాలు గదా సృజనకారులకు. కాలం వారి కలాలకూ, గళాలకూ, కుంచెలకూ రక్తాన్నీ, కన్నీటినీ, మానవ స్వభావపు అనేకానేక వర్ణ వైచిత్రులనూ ముడిసరుకులుగా అందించింది. మహామహులు చరిత్రనూ, మానవ జీవిత సారాన్నీ అక్షరబద్ధం చేశారు. 


అలాంటి రచయుయితలలో తన బాధాతప్త హృదయాన్ని మరింత మండించుకుని, దుఃఖం, ప్రేమ, కరుణ, వంచన, కపటత్వం, మూర్ఖత్వం, భూలోక నరక యాతనలను చితిరంచి తనను తాను దహించి వేసుకున్న రచయిత మంటో. ఉర్దూ భాషలో పలికిన ఉపఖండ ఆత్మ మంటో.


మంటో కథలను ఉపఖండంలోని వివిధ భాషలలోకి మార్చటం, చేర్చటం, వాటిని చదివి చర్చించుకోవటం వర్తమాన చరిత్ర గమనానికి అత్యవసరం. అలాంటి సమయంలో మెహక్‌ హైదరా బాదీ (పి.వి. సూర్యనారాయణ మూర్తి) మంటో రాసిన 27 కథలను ఆంగ్ల, హిందీ భాషల నుంచి కాకుండా నేరుగా ఉర్దూ నుంచి అనువదించి తెలుగు పాఠకులకు ఒక సవాలు విసిరారు. మంటో కథలను అర్థం చేసుకుని ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దు కోగలరా అని ప్రశ్నిస్తున్నట్టుగా వచ్చిందీ పుస్తకం. 


నిజమే. కాలాన్ని బందీ చేసేదే కళ. మనం మన గతానికి బందీలం. గతాన్ని మరచిన స్వేచ్ఛ అర్థరహితం. మంటో కథలు చదువు తూంటే మన గతం మనల్ని వదలకపోయినా, గతం మనల్ని వంచించిందనే జ్ఞానం మన దృష్టిని గతాన్నుండి వర్తమానానికి మళ్ళిస్తుందని అనిపిస్తుంది. ఈ సంకలనంలోని ఆరు కథలు దేశ విభజన నాటి కల్లోలానికి సంబంధించినవి. ఆ విభజన పర్వంలో- దేశవిభజనో, జాతివిభజనో, స్త్రీలవిభజనో అర్థంకాని అయోమయంలో, మంటో తప్ప మరొకరు రాయలేని కథలివి. మతోన్మాదం ఆవ హించిన మనుషులు ఏమవుతారో సాదాసీదాగా, తేటతెల్లంగా చెప్పిన కథలివి. జరిగిన బీభత్సాన్ని మంటో భాషాడంబరంతో, వర్ణనా వైచిత్రితో చెప్పలేదు. భయంతో, బాధతో, బిక్కవోయి, ఇదేమి అన్యాయమని తోటి మనిషిని అడిగినట్లుగా చెప్పాడు. చిన్నపిల్లవాడు ఖాలిద్‌ భీతిల్లినంత వాస్తవంగా చెప్పాడు ‘తమాషా’ కథలో. అందువల్లనే ఈ కథలు మరింత శక్తివంతమైనవి అయ్యాయి. మనల్ని ఒణికింపజేసేవి అయ్యాయి. మత కలహాల సమయంలో ‘బిస్మిల్లా’గా పాకిస్థాన్‌లో ఉండిపోయిన హిందూ అమ్మాయిని, శవప్రాయమై ఏ మాట వినపడినా సల్వార్‌ బొందు విప్పే స్థితిలో పడివున్న సకీనాని, ఆమె తండ్రి సిరాజుద్దీన్‌ని, మంటో కథలలో తెలుసుకున్న తర్వాత కలుసుకున్న తర్వాత మతోన్మాదం స్త్రీలనేం చేస్తుందో ఆలోచించకపోతే, ఆ ఉన్మాదంలోనే కొట్టుకుపోతే అక్షరానికిక అర్థమే లేదనిపిస్తుంది. దేశ విభజన జరిగినపుడు రెండు వైపులా స్త్రీల మీద అత్యాచారాలు జరిగాయి. స్త్రీల అపహరణ జరిగింది. స్త్రీలను ఎత్తుకుపోయి అత్యాచారాలు చేశారు. నిస్సహాయులై, జీవ చ్ఛవాల వంటి ఆ స్త్రీలు కొన్నిసార్లు తమను ఎత్తుకుపోయిన వారి తోనే ఉండిపోయి, మతం మార్చుకుని పిల్లల్ని కన్నారు. ‘అల్లా మీద ఒట్టు’ కథలో ముస్లిం యువతి తనకోసం గాలిస్తున్న తల్లికి కనపడకుండా, తనను ఎత్తుకుపోయినవాడో, ఆశ్రయమిచ్చినవాడో అయిన సిక్కు యువకుని వెనక దాక్కుంటుంది. జరిగినది తెలిస్తే కుటుంబాలు తమను రానివ్వరని ఆ స్త్రీలకు తెలుసు. ముసలి తల్లి చనిపోతున్నా ముఖం చూపలేని స్థితి భాగ్‌భరీది. ఐతే కొన్నేళ్ళకు ప్రజల ఉన్మాదం నయమయింది. ఇకప్పుడు రాజ్యాల ఉన్మాదం పెరిగిపోయింది. స్త్రీలంటే తమ దేశ గౌరవ పతాకాలనే మరొక పిచ్చి తలకెక్కింది. ఆత్మలు చచ్చి ఎలాగో బతుకుతున్న స్త్రీల శరీరాల వేట మొదలయింది. మా స్త్రీలు మీ దేశంలో ఉంటే మా పరువు ప్రతిష్టలకు భంగం అని తలచి వెతికి పంపమని ఆదేశాలు జారీ చేశారు. వెతికి వెతికి వెనక్కు తెచ్చారు. కుటుంబాలు వారికి తలుపులు మూసేశాయి. శరణాలయాలు గతయ్యాయి. దేశ విభజన అంటే ఏమిటో ఎందుకో అర్థంగాని స్త్రీలు మొన్న మొన్నటివరకూ ఆ శరణాలయాల్లో కాలం గడిపి చరిత్రలో కలిసిపోయారు. భాగ్‌భరి తల్లికి అందకుండా దాక్కోవటం వెనక ఇంత కథ ఉంది. ఆ విషాద గాథలను వినిపించాడు మంటో. ఎందుకు మళ్ళీ అదంతా మనం తెలుసుకోవాలి అని అడిగేవారికి ఏం చెప్పాలి? ఏ దేశం? ఏ జాతి? ఎప్పుడు వచ్చావు? ఆధారా లేమిటి? అవి చాలవు, కావలసిన కాగితాలు లేవు అంటూ మనుషుల మాన ప్రాణాలను కాగితాలతో, తేదీలతో కొలిచి విలువ కట్టి శిబిరాల పాలు చేసే చరిత్ర పునరావృతమవుతున్నపుడు ఈ కథలు తెలుసుకుని చరిత్ర గతిని మార్చుకోవాలనే స్పృహలోకి వచ్చేందుకు ఈ కథలు చదవాలి. హింసలో ఉండే యాతననీ, అవమానంలో ఉండే సిగ్గునీ, వంచనలో ఉండే అన్యాయాన్నీ ఎదుర్కొనే శక్తి పొందటంకోసం చదవాలీ కథలు. అట్లా ఎదుర్కొనే శక్తి పొందే  క్రమంలోనే మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పొంద గలుగుతాం. 


ఈ సంకలనంలో దాదాపు ఇరవై కథలు స్త్రీ పురుష సంబంధా లకు, ముఖ్యంగా లైంగిక సంబంధాలకు సంబంధించినవి. 30, 40 దశాబ్దాలలో రచయితలు స్త్రీపురుష సంబంధాల గురించి లోతుగా, భిన్నంగా ఆలోచించటం మొదలుపెట్టారు. తెలుగు సాహిత్యంలో చలం, కొడవటిగంటి కుటుంబరావులు ఆ దశాబ్దాలలోనే ప్రేమ, మోహం, కామం, సెక్సు- వీటి గురించి ఉన్న భ్రమలను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. స్త్రీ పురుష సంబంధాలలోని కపటత్వాన్నీ, క్రౌర్యాన్నీ చాలా నగ్నం చేశాడు మంటో. మూడు కథలలో కేవలం భార్యభర్తల సంభాషణ మాత్రమే ఉంటుంది. ఒక గంటలోపు వారు మాట్లాడుకునే మాటల్లోంచే వారి సంసార సంబంధ సారాన్నంతా బైటపెడతాడు రచయిత. ‘దైవమిచ్చిన భార్య’ వంటి కథలో మంచి తనాన్నీ చూపించి దారి చూపుతాడు. మంచితనంతో, మానవ త్వంతో ఉండటంలోని తెరిపినీ, హాయినీ ఆర్భాటం లేకుండా చూపిస్తాడు. స్త్రీకి మాతృత్వ భావన భారంగా మారి చివరికి ఉన్మాదంగా ఎట్లా మారుతుందో ‘సంతానం’ కథలో మంటో రాసిన తీరుకి మన తల తిరిగిపోతుంది. భ్రమలను సృష్టించుకుని అందులోనే బతకగలిగిన శక్తి మానవ మస్తిష్కానికి ఎంత ఉందా అని ఆశ్చర్యం కలిగించే కథ అది. మనుషులు ఏ ప్రయోజనాల కోసమో సృష్టించుకుని, అందులోనే బతికే భావజాలాలు, ఆచారాలు, భావనలు వారికి ఎలాంటి ఉన్మాదాన్ని ఎలాంటి స్థాయిలో కల్పి స్తాయో చెప్పే కథ ఇది. రాయటం సాహసమే కాదు, చాలా కష్టం కూడా అనిపించే కథ ‘వాసన’. చాలా క్లిష్టమైన కథా వస్తువుల్ని ఎంచుకుని అతి సులువుగా రాసినట్లు అనిపింపజేసే కథాశిల్పి మంటో. ‘ఉక్కు కౌగిలి’ కథలో అతను ఫాతిమాను ఎందుకు అసహ్యించుకు న్నాడు? ఎందుకు ప్రేమించాడు? ఎందుకు కలకత్తా తీసుకుపోయి పెళ్ళి చేసుకుని కూడా నువ్వంటే నాకు అసహ్యం అంటాడు? ఫాతిమా దానికి నవ్వుతూ నువ్వు అసహ్యించుకోవటమే కావాలని ఎందుకు అంటుంది? కథ ఒకటిరెండు సార్లు చదవాలి. కథలో రాయవలసినదేమిటి, రాయకూడనిదేమిటి, దాచవలసినదేమిటి అనేది మంటోకి తెలిసినట్టు మరొక రచయితకు తెలియద నిపిస్తుంది కొన్ని కథలు చదువుతుంటే. హాస్యం, వ్యంగ్యం రెంటినీ తన కైవసం చేసుకున్నాడు మంటో. అనేక కథలలో అతని హాస్యప్రియత్వాన్ని చూడవచ్చు. అంత హాస్యప్రియుడయ్యీ ఎంత యాతన పడ్డాడో కదా అనిపిస్తుంది. 


మంటో 43ఏళ్ళ వయసులో మరణించాడు (1955). మానవులు నిజమైన స్వేచ్ఛ సాధించే వరకూ నిలిచివుండే కథలు రాశాడు. తన కథలను అసభ్య, అశ్లీల కథలని కొందరు తెగనాడుతుంటే చలం గారిలాగానే ‘‘నా కథలు నీచంగా, రోత కలిగించేవిగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే వాళ్ళు ఆ నీచ, రోత సమాజంలో ఉంటున్నట్టు లెక్క. నా కథల ద్వారా నేను నిజాలను అక్షరీకరించానంతే’’ అని సమాధానం ఇచ్చాడు. కేవలం సెక్సు కథలు రాశాడు మంటో అనేవారిని చూస్తే కొ.కు ‘కురూపి’ కథలో రాసిన మాటలు గుర్తొస్తాయి. ‘‘కొంత కాలం అసలు సెక్సు అనేది లేనట్టుగా నటించిందీ సమాజం. దానికి ప్రతీకారంగా ఇపుడు ఎక్కడ చూసినా సెక్సు’’ అంటాడు. అలాగే ప్రేమ కోసం చేతులు సాచినప్పుడల్లా ఆడవాళ్ళ అవయవాలే దొరుకుతుంటే చలంగారిని సెక్సు గురించే రాస్తాడని తప్పు బట్టటం దేనికని అంటాడు కొ.కు మరోచోట. మంటో కథలు కొన్ని చదివినపుడు ఆ మాటలు గుర్తొచ్చాయి. బతికున్న రోజుల్లో అవమానాలు, వెలివేతలు ఎదుర్కొన్న మంటో మరణానంతరం పాకిస్థాన్‌ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలు పొందారట. 


మెహక్‌ హైదరాబాదీ ఇంతకుముందు జీలానీ బాను (ఉర్దూ రచయిత్రి) కథలను తెలుగులోకి అనువదించారు. ఇపుడు మంటో కథలను అందించారు. హైదరాబాదు వచ్చి స్థిరపడటమంటే ఉర్దూ భాషా సాహిత్యాలను ప్రేమించటమని భావించిన ఆయనను అభినందించాలి. ఆ భాషలోని విలువైన రచనలను తెలుగులోకి తీసుకొచ్చే పనితలకెత్తుకున్నందుకు ధన్యవాదాలు తెలపాలి. భారతీయ భాషలు నేరుగా ఒక భాష నుంచి మరొక భాషకు వచ్చే అవకాశా లున్నపుడే తులనాత్మక సాహిత్య అధ్యయనం చేయగలుగుతాము. ఇంగ్లీషులో మంటో రచనలు చదివినప్పటికంటే తెలుగులో ఈ కథలు చదివినప్పుడు మంటో కథలనూ ఆయన కథాశిల్పాన్నీ బాగా అర్థం చేసుకోగలిగాను. తెలుగు రచయితలతో పోల్చుకోగలిగాను. అదంతా మెహక్‌ హైదరాబాదీ అనువాద ప్రతిభ వల్లనే. 

ఓల్గా


Advertisement
Advertisement
Advertisement