ఉప్పుడు బియ్యం కథ కంచికే

ABN , First Publish Date - 2021-11-26T09:20:45+05:30 IST

తెలంగాణ మాగాణిలో ఉప్పుడు బియ్యం శకం ముగిసినట్లేనా? యాసంగి సీజన్‌లో బియ్యం ఉత్పత్తికి ఇక బ్రేక్‌ పడినట్లేనా? యాసంగిలో వరిసాగుచేస్తే..

ఉప్పుడు బియ్యం కథ కంచికే

  • కొనేది లేనే లేదని తేల్చిన కేంద్రం.. ఇకపై ఏ కాలమైనా ముడి బియ్యమే
  • నేడు తేల్చనున్న కోటా ముడి బియ్యానిదే
  • యాసంగిలో ముడిబియ్యానికి రైస్‌మిల్లర్లు ససేమిరా
  • అవి మరపట్టిస్తే క్వింటాకు కేవలం 40- 45 కిలోలే
  • నూకలతో వచ్చే నష్టానికి ప్రభుత్వ పరిష్కారమేంటి?
  • రాష్ట్రం చేతిలోనే యాసంగి సాగు నిర్ణయం
  • ఇప్పటికీ ఖరారు కాని సీజన్‌ సాగు ప్రణాళిక
  • పంట మార్పిడిపై ప్రోత్సాహకాల ఊసే లేదు


హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాగాణిలో ఉప్పుడు బియ్యం శకం ముగిసినట్లేనా? యాసంగి సీజన్‌లో బియ్యం ఉత్పత్తికి ఇక బ్రేక్‌ పడినట్లేనా? యాసంగిలో వరిసాగుచేస్తే.. మార్కెట్‌ ఒడిదుడుకులపై ఆధారపడాల్సిందేనా? వానాకాలంలో ముడి బియ్యం ఉత్పత్తికి మాత్రమే పరిమితం కావాలా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితులు ఔననే చెబుతున్నాయి. ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. యాసంగిలో తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా.. ఒత్తిడి తీసుకువచ్చినా.. కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ‘‘నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం నిల్వలున్నాయి. తెలంగాణలో తినని ఉప్పుడు బియ్యాన్ని ఆ రాష్ట్రంలో ఎందుకు పండిస్తున్నారు?’’ అంటూ కేంద్రం ఎదురు ప్రశ్నలు వేస్తోంది. బియ్యం కోటా లెక్కల్ని శుక్రవారం తేలుస్తామని కేంద్రం చెబుతున్నా.. అది కేవలం ముడి బియ్యానికే పరిమితం కానుంది. ఉప్పుడు బియ్యం ఊసే ఉండబోదు. ఈ పరిణామాలన్నీ.. తెలంగాణ వ్యవసాయ చరిత్రలోనే ఉప్పుడు బియ్యానికి స్వస్తి పలకాల్సిన పరిస్థితులకు దారితీస్తున్నాయి. ముడి బియ్యం సేకరణలోనూ కేంద్ర ప్రభుత్వం పట్టువిడుపు ధోరణితో ఉంది. గత ఏడాది 32.74 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించగా.. ఈ సారి టార్గెట్‌ను 40 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచింది. అయితే.. బియ్యం ఉత్పత్తిలో 90% భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాం డ్‌ చేస్తోందని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. 


ఇటీవల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన మంత్రులు, ఎంపీల బృందానికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇదే హామీని ఇచ్చారు. ఈ సీజన్‌లో ముడిబియ్యం కొనుగోలుపై శుక్రవారం స్పష్టం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల టార్గెట్‌ను మరింత పెంచుతామని సూత్రప్రాయంగా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. అంటే.. మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. మొత్తం 60 లక్షల మె ట్రిక్‌ టన్నుల బియ్యానికి అనుమతి వస్తే.. 90 లక్షల మె ట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్లవుతుంది. వానాకాలం సీజన్‌లో 62.13 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఎకరానికి 25 క్వింటాళ్ల సగటు దిగుబడి లెక్కన సుమా రు కోటిన్నర మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో ఉత్పత్తి అయినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలకు 42 లక్షల మెట్రిక్‌ టన్నులు, రైస్‌మిల్లర్లు కొనుగోలుచేసే 20 లక్షల టన్నులు పోతే... మిగిలిన 90 లక్ష ల మెట్రిక్‌ టన్నులు ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్‌ చేస్తే ఈ సీజన్‌కు సమస్య పరిష్కారం అవుతుంది.


యాసంగిలో ముడి బియ్యం ఉత్పత్తికి అనాసక్తి

యాసంగి సీజన్‌లో ముడి బియ్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్ర భుత్వంగానీ, రైస్‌మిల్లర్లు గానీ ఆసక్తి చూపించటంలేదు. ఎఫ్‌సీఐ నిబంధనలకు అనుగుణంగా... ఉప్పుడు బియ్యం అయితే క్వింటాలుకు 68 కిలోలు, ముడి బియ్యం అయితే క్వింటాలుకు 67కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కిలో అ టూఇటుగా బియ్యం ఉత్పత్తి అవుతుంది. ఇందులో కూ డా 25్ర వరకు నూకలకు అనుమతి ఉంది. వానాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, బియ్యం విరిగిపోయే ప్రమాదంతక్కువగా ఉండటంతో.. ముడి బియ్యం ఉత్పత్తికి సమస్య ఉండదు. యాసంగిలో మాత్రం ముడి బియ్యం ఉత్పత్తి చేయాలంటే రైస్‌మిల్లర్లు జంకుతున్నా రు. ఉష్ణోగ్రతలు పెరిగితే బియ్యం విరిగిపోతుందని, క్విం టాకు 40-45 కిలోల బియ్యం మాత్రమే వస్తుందని, సగానికంటే ఎక్కువగా నూకలు వస్తాయని చెబుతున్నారు. అదే ఉప్పుడు బియ్యం అయితే.. 67 కిలోల దాకా వస్తుం ది. నిజానికి పౌలీట్ర్ , బీర్ల తయారీ పరిశ్రమల నుంచి నూకలకు డిమాండ్‌ ఉన్నా.. క్వింటాకు రూ. 1,500- రూ.1,600 ధర మాత్రమే లభిస్తోంది. నూకలతో వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూడ్చడం కూడా ఓ పరిష్కారంగా ఉంది. నూకల సమస్య తేలితే.. యాసంగిలోనూ ముడిబియ్యం ఉత్పత్తికి వెసులుబాటు ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. మిల్లర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్‌ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని.. ఆ సమయంలో ముడిబియ్యం రూపంలో 20ు ఇవ్వొచ్చని, మిగతా 80 శాతాన్ని ఉప్పుడు బియ్యం రూపంలోనే ఇవ్వగలుగుతామని రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. ఒకవేళ యా సంగిలో కూడా ముడి బియ్యం ఉత్పత్తి చేయాల్సివస్తే.. ఇప్పుడున్న రైస్‌మిల్లుల్లోనే మిల్లింగ్‌ చేయొచ్చు.


ప్రత్యామ్నాయానికి ప్రోత్సాహకాలు.. బీమా!

రాష్ట్రంలో నూనెగింజలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యా లు సాగుచేసేందుకు అనువైన నేలలు ఉన్నాయి. యా సంగిలో.. కంది, శనగ, పెసర, మినుములు, ఇతర పుప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.45 లక్షల ఎకరాలు ఉంది. ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు తదితర నూనె గింజల సాధారణ సాగు వి స్తీర్ణం 3.75 లక్షల ఎకరాలుగా ఉంది. పప్పు ధాన్యాలు, నూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం యాసంగిలో 7.20 లక్షల ఎకరాలుగా ఉంటోంది. ఈ విస్తీర్ణాన్ని అసాధారణ స్థాయిలో పెంచితేనే పప్పు- నూనె గింజల ఉత్ప త్తి పెరిగి.. వరి సాగు తగ్గుతుంది. ఇక చిరుధాన్యాల(అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, వరిగలు, రాగులు) సాగు విస్తీర్ణం కేవలం వందల ఎకరాల్లోనే ఉంది. వీటి విస్తీర్ణం ఎంతపెంచితే.. వరిసాగు అంత తగ్గుతుంది. మొక్కజొన్నలకు కూడా మార్కెట్లో డిమాండ్‌ ఉంది. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గించేసరికి.. వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మక్కల సాగును ప్రతి సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో చేసుకోవచ్చని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలసాగుకు ఎలాంటి ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్స్‌)ఇస్తుందనేది తేలాల్సి ఉంది. పప్పు ధాన్యా లు, నూనె గింజలు, చిరు ధాన్యాలు సాగుచేయాలంటే.. తొలుత విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అవికూడా ఉచితంగా/సబ్సిడీపై పంపిణీ చేయాలనే డిమాండ్‌ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలపై 33-50ు సబ్సిడీ ఇచ్చేవారు. రాష్ట్రం లో రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి విత్త న సబ్సిడీని ఎత్తివేశారు. 


ప్రత్యామ్నాయ పంటల సాగు కు ప్రోత్సాహకంగా పంటబీమా పథకాన్ని అమలుచేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. యాసంగిలో అకాల వర్షా లు, వడగండ్ల వానలు వస్తుంటాయి. పంటలు ధ్వంసమైతే.. బీమా ద్వారా నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. రైతులు పూర్తిగా నష్టపోకుండా ఉపశమనం లభిస్తుంది. క్రాప్‌ ఇన్సురెన్స్‌ ప్రీమియం ప్రభుత్వమే చెల్లి స్తే.. రైతులు ముందుకొచ్చే అవకాశాలుంటాయి. వీటితోపాటు.. ప్రత్యామ్నాయ పంటలసాగు ప్రోత్సాహానికి.. రై తుబంధు తరాహాలో ప్రతి ఎకరానికి కొంత ఆర్థిక సహా యం ప్రకటించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. పంజా బ్‌, హరియాణా రాష్ట్రాలు ఈ తరహా ప్యాకేజీలు ప్రకటిం చి, రైతులను ప్రోత్సహించి వరి సాగును తగ్గిస్తున్నాయి. నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నాయి. అదే క్రమంలో యాసంగిలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్‌ భద్రత కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంటుంది. జొన్న, సజ్జ, మొ క్కజొన్న, రాగులు, శనగలు, పెసర్లు, మినుములు, వేరుశనగ, నువ్వులు, కుసుమలకు కేంద్ర ప్రభుత్వం కనీస మ ద్దతు ధర(ఎమ్మెస్పీ) ప్రకటిస్తోంది. చిరుధాన్యాలు, ఉలవలు, అలసందలకు మినహా ఇతర పంటలకు ఎమ్మెస్పీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌, హాకాలతోపాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైనా ‘నాఫెడ్‌’తో పంట ఉత్పత్తులు కొనుగోలుచేయిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. రైతులు ధైర్యంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లే అవకాశాలున్నాయి. ఇందుకు ‘మార్కె ట్‌ స్థిరీకరణ నిధి’ని ఏర్పాటుచేయాలి . బడ్జెట్‌ కేటాయింపులు కూడా అనివార్యం అవుతాయి.


యాసంగిలో వరికి బ్రేక్‌?  

ప్రస్తుత పరిస్థితులను బట్టి యాసంగిలో వరి సాగుకు బ్రేక్‌ వేయటం తప్ప వేరే మార్గంలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పంజాబ్‌ తరహాలో యాసంగిలో వరి సాగును పూర్తిగా నిలిపివేసి.. ఇతర పంటలవైపు రైతులను మళ్లించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. యాసంగిలో ఉత్పత్తి అయ్యే ఉప్పుడు బియ్యం తినేవారు రాష్ట్రంలో లేరు. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం వినియోగం ఉంటుంది. కానీ అక్కడ కూడా స్వయం సమృద్ధి సాధించటంతో, డిమాండ్‌ లేకుండాపోయింది. డిమాండ్‌లేని పంటను సాగు చేసేకంటే మార్కెట్లో డిమాండ్‌, వినియోగం ఉన్న పంటలసాగునే చేయాలనే సూచనలు వస్తున్నాయి. నిరుడు వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగైతే... యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే వానాకాలానికి సమానంగా వరి సాగు యాసంగిలో జరిగింది. ఈ ఏడాది వానాకాలం విస్తీర్ణం 62.13 లక్షల ఎకరాలకు పెరిగింది. నీటిలభ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత ఏడాది యాసంగి కంటే ఈ ఏడాది విస్తీర్ణం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరి తప్ప ఇతర ఏ పంటలు సాగుచేయలేని భూ విస్తీర్ణానికి కొంత మినహాయింపునిచ్చి.. మిగిలిన విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయించాలనే ప్రతిపాదన వస్తోంది. యాసంగిలో పండే కొద్దిపాటి వరికి ఇబ్బంది ఉండదని, 20ు ముడిబియ్యాన్ని కేంద్రం తీసుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


యాసంగి ప్రణాళిక ప్రకటన ఎప్పుడు? 

రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ప్రణాళికను ప్రకటించకపోవటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం తేల్చిచెప్పినా ముఖ్యమంత్రి, కేబినేట్‌ మంత్రులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. యాసంగి సాగులో నవంబరు 15 నుంచి డిసెంబరు 15లోపు నార్లు పోయటం పూర్తవుతుంది. జనవరి 15 తేదీలోపు నాట్లు వేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నెలాఖరు వరకు వరి కోతకు వస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు ఇప్పటికే యాసంగి వరికి శ్రీకారం చుట్టారు. కేంద్రం-రాష్ట్రం మధ్య పోరులో ‘ఆవులు ఆవులు కొట్లాడుకుని, లేగదూడల కాళ్లు విరగ్గొట్టినట్టు’ తమ పరిస్థితి తయారవుతుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంట ప్రణాళికలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమేంటి? అనేదానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి.

Updated Date - 2021-11-26T09:20:45+05:30 IST