Abn logo
Aug 3 2021 @ 03:59AM

హస్తినలో ‘ఉక్కు’ గర్జన

  • ‘ఆంధ్రుల హక్కు’ నినాదంతో దద్దరిల్లిన జంతర్‌ మంతర్‌ 
  • పోలీసుల వేధింపుల నడుమ ధర్నా విజయవంతం  
  • విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు
  • క్రయ, విక్రయదారులను అడుగుపెట్టనీయం
  • దేశాన్ని అమ్మేసేందుకు మోదీ సర్కార్‌ యత్నం
  • భారత్‌ను కబ్జా చేసేస్తున్న అదానీ, అంబానీలు 
  • భారీ వర్షంలోనూ ఆగని నేతల ప్రసంగాలు


న్యూఢిల్లీ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు‘ నినాదం జంతర్‌ మంతర్‌ వద్ద ప్రతిధ్వనించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సోమవారం తొలిరోజు చేపట్టిన ధర్నా.. పోలీసు ఆంక్షలు, వేధింపులు, నిర్బంధాల నడుమ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. నిరసనలు, నినాదాలతో ధర్నా ప్రాంగణమైన జంతర్‌ మంతర్‌ దద్దరిల్లింది. నష్టాల ముసుగులో ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆందోళనకారులు కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా రాజీలేని పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని శపథం చేశారు. విశాఖ నుంచి ఢిల్లీకి తరలి వచ్చిన ఉద్యోగులు, ఆందోళనకారులను ఆదివారం రాత్రి నుంచే ఢిల్లీ పోలీసులు అనేక కుంటిసాకులతో రైల్వేస్టేషన్‌ వద్దే అడ్డుకోవడం, రెండున్నర గంటలు నిర్బంధించడం తదితర చర్యలతో వేధింపులకు పాల్పడ్డారు. వామపక్షపార్టీల జాతీయ నాయకుల జోక్యంతో ఎట్టకేలకు పోలీసులు వారిని విడిచిపెట్టారు. సోమవారం ఉదయం జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న సందర్భంలోనూ వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు. అయితే, వీరు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాలో పాల్గొనేందుకు రాలేదని వామపక్ష నేతలు తెలపడంతో ఎట్టకేలకు జంతర్‌మంతర్‌వద్ద ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ ధర్నాలో దాదాపు వెయ్యి మంది వరకు ఉద్యోగులు, మద్దతుదారులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే నడపాలంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.  మధ్యాహ్నం 1.20 గంటలకు భారీ వర్షం కురిసినా వారంతా చెక్కుచెదరకుండా నిగ్రహంతో ధర్నాను కొనసాగించడం విశేషం. వామపక్షపార్టీల జాతీయ నేతలతోపాటు టీడీపీ, వైసీపీ ఎంపీలు కూడా వర్షంలో తడిసి ముద్దయ్యారు. అయినా తమ ప్రసంగాలను కొనసాగిస్తూ ఆందోళనకారుల్లో ఉత్సాహం నింపారు.   సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ, సీపీఐ, సీపీఎం, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా నేతలు కూడా పాల్గొన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.

నేడు ఏపీభవన్‌ వద్ద ధర్నాఉక్కు ధర్నాలో ‘గాంధీజీ’

అనంతపురం జిల్లాకు చెందిన బీఎ్‌సఎన్‌ఎల్‌ రిటైర్డు ఉద్యోగి గడుపూటి తిరుపతయ్య మహాత్మాగాంధీ వేషధారణతో ఢిల్లీలో ‘ఉక్కు ధర్నా’లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన సొంత ఖర్చులతోనే అనంతపురం నుంచి వచ్చి ధర్నాకు సంఘీభావం తెలుపుతున్నానని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. విశాఖలోనూ ఉక్కు ఉద్యోగుల ఆందోళనల్లో గత 175 రోజులుగా పాల్గొంటున్నానని చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. బీఎ్‌సఎన్‌ఎల్‌నూ ప్రైవేటీకరణ బాట పట్టించారని ధ్వజమెత్తారు.


విశాఖ కార్పొరేటర్ల నిరసన దీక్ష

విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్టణం కార్పొరేటర్లు జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి నేతృత్వంలో వైసీపీ, సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు దీక్షలో పాల్గొన్నారు. శిబిరాన్ని సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.


దేశాన్ని అమ్మేసే యత్నం.. 

మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే తప్పుడు విధానాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంటును అమ్మాలని చూస్తోంది. దుర్గాపూర్‌, సేలం స్టీల్‌ పరిశ్రమలనూ అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు మోదీ సర్కార్‌ చర్యలు వేగవంతం చేసింది.  ప్రభుత్వ రంగ సంస్థలకు లేని సొంత గనులు జిందాల్‌ వంటి ప్రైవేటు సంస్థలకు ఎలా వస్తున్నాయి? 

-తపన్‌ సేన్‌, సీఐటీయూ జాతీయ ప్రధానకార్యదర్శి 


దేశాన్ని అదానీ, అంబానీలు కబ్జా చేస్తున్నారు

మన దేశాన్ని అదానీ, అంబానీలు కబ్జా చేస్తున్నారు. ఇందుకు మోదీ ప్రభుత్వం సహకరిస్తోంది. లాక్‌డౌన్‌ సందర్భంలోనూ ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లోనే ఉన్నాయి. కరోనా రెండో దశలో ఆక్సిజన్‌ కూడా అందించాయి. ఆ సమయంలో అదానీ, అంబానీలు ఎక్కడికి వెళ్లారు? దేశ సంపదంతా కొందరు కుబేరులకే వెళ్తోంది.  

-అమర్‌జీత్‌ కౌర్‌, ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి  


అన్ని పక్షాలూ రోడ్డుపైకి రావాలి..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోడానికి అన్ని పక్షాలూ కలిసికట్టుగా రోడ్డుపైకి వచ్చి సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందరూ ఐక్యంగా పోరాడితే విశాఖ ఉక్కును అమ్మే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. విశాఖ స్టీల్‌ప్లాంటు లాభాలతో ఉంది. నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. 

-బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు 


కేంద్రం మూర్ఖంగా వ్యవహరిస్తోంది..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూర్ఖత్వంతో వ్యవహరిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. కేంద్రం మొండివైఖరితో వ్యవహరిస్తోంది. ఈ ఉద్యమానికి అందరూ కలిసి రావాలి.

-కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి


ఉక్కు కార్మికులకు రైతుల అండ..

విశాఖ స్టీల్‌కు మద్దతుగా కిసాన్‌ సంసద్‌(రైతుల పార్లమెంటు)లో  తీర్మానం చేస్తాం. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి విశాఖ స్టీల్‌ ఉద్యోగులు అందించిన సహకారం మరవలేనిది. ఉక్కు కార్మికుల ఉద్యమానికి రైతులు అండగా ఉంటారు.  

-బి.వెంకట్‌, ఏఐడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి 


ఐక్యంగా పోరాడాలి..

దేశంలోని కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాల్సిన సమ యం ఆసన్నమైంది. విశాఖ స్టీల్‌ ఐక్య ఉద్యమానికి ప్రతీక.

-విజూ కృష్ణన్‌, ఏఐకేఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి