ఆ విగ్రహం తూర్పు గాంగుల కాలం నాటిదే

ABN , First Publish Date - 2022-07-20T05:17:28+05:30 IST

సుక తవ్వకాల్లో లభ్యమైన విగ్రహం గాంగుల కాలం నాటిదిగా పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. గోపాలపెంట వంశధార నదిలో రెండు రోజుల కిందట ఇసుక తవ్వకాల్లో దుర్గాదేవి విగ్రహం లభ్యమైన సంగతి తెలిసిందే. అయితే నాటి గాంగుల చరిత్రకు దగ్గ

ఆ విగ్రహం తూర్పు గాంగుల కాలం నాటిదే
బయటపడిన విగ్రహం ఇదే..

అంచనాకు వచ్చిన పురావస్తుశాఖ అధికారులు

అధ్యయనం చేసేందుకు సన్నాహాలు

నరసన్నపేట, జూలై 19: ఇసుక తవ్వకాల్లో లభ్యమైన విగ్రహం గాంగుల కాలం నాటిదిగా పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. గోపాలపెంట వంశధార నదిలో రెండు రోజుల కిందట ఇసుక తవ్వకాల్లో దుర్గాదేవి విగ్రహం లభ్యమైన సంగతి తెలిసిందే. అయితే నాటి గాంగుల చరిత్రకు దగ్గరగా విగ్రహం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గాంగులు నిర్మించిన మిగతా ఆలయాల్లో విగ్రహాలకు.. ఇక్కడ లభ్యమైన విగ్రహానికి దగ్గర పోలిక ఉంది. తూర్పు గాంగులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 11వ శాతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకూ పాలించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను కలుపుతూ ఉన్న ప్రాంతాలు తూర్పు గాంగుల ఏలుబడిలో ఉండేవి. శిల్పకళా సౌందర్యానికి గాంగులు ప్రాధాన్యత ఇచ్చేవారు. నాడు దంతపురి, దీర్ఘాశి మెట్ట, శ్రీముఖలింగం దేవస్థానం, ఒడిశాలోని కోణార్క్‌ దేవాలయం ఇందుకు మచ్చుతునకలు. 14వ శాతాబ్దం తరువాత తూర్పు గాంగులపై ముస్లిం రాజులు దండయాత్ర చేశారు. ఆ సమయంలో విగ్రహాలను ధ్వంసం చేసి సమీప నదులు, కాలువలు, చెరువుల్లో పడేశారు. అలా పడేసిన విగ్రహాలే నేడు బయటపడుతున్నట్టు విశ్లేషకులు, నిపుణులు భావిస్తున్నారు. పదేళ్ల కిందట పోలాకి మండలం తలసముద్రం చెరువులో రెండు పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. మళ్లీ ఇప్పుడు వంశధార నదిలో విగ్రహం వెలుగుచూసింది. అయితే విగ్రహ ఆనవాళ్లును చూస్తే మాత్రం మిగతా ఆలయాల్లో విగ్రహాలకు పోలి ఉన్నాయి. దీనిపై పురావాస్తు శాఖ మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముంది. ప్రస్తుతానికి లభ్యమైన విగ్రహం నరసన్నపేట పోలీసుల భద్రతలో ఉంది. కొద్దిరోజుల్లో పురావాస్తు శాఖ పరిశోధనలు ప్రారంభించే అవకాశం ఉంది. 


కళింగాంధ్రకు చిహ్నం

ఇసుక తవ్వకాల్లో వెలుగుచూసిన చోడ గంగాదేవి విగ్రహం కళింగాంధ్ర చరిత్రకు చిహ్నం. 11వ శాతాబ్దం నుంచి తూర్పు గాంగులు ఈ ప్రాంతాన్ని ఏలారు. నాడు ఆధ్యాత్మిక శిల్ప కళా సౌందర్యానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఆలయాలను నిర్మించారు. నాటి విగ్రహాలే నేడు వెలుగుచూస్తున్నాయి. పురావస్తు శాఖ పరిశోధనలు విస్తృతం చేయాలి. 

-సీహెచ్‌ కృష్ణారావు, హిస్టరీ అధ్యాపకుడు, శ్రీకాకుళం మహిళా కళాశాల


పరిశోధనలు ప్రారంభిస్తాం

వంశధార నదిలో బయటపడిన విగ్రహం తూర్పు గాంగుల కాలం నాటిదిగా గుర్తించాం. అప్పటి చరిత్రకు విగ్రహం దగ్గరగా ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి నిర్ధారిస్తాం. ఇందుకుగాను అధికారుల బృందాన్ని నియమించాం. ఒకటి రెండు రోజుల్లో పరిశోధనలు ప్రారంభిస్తాం. ఉన్నతాధికారులు సైతం వంశధార ప్రాంతాన్ని సందర్శించనున్నారు.

-ఎస్‌.వెంకట్రావు, పురావస్తు శాఖ ఏడీ, విశాఖపట్నం

    





Updated Date - 2022-07-20T05:17:28+05:30 IST