ఫ్రైడే..రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు

ABN , First Publish Date - 2020-05-23T10:49:19+05:30 IST

నింగి నుంచి సూరీడు నిప్పులు కక్కాడు. జిల్లాను అగ్నిగోళంగా మార్చాడు.

ఫ్రైడే..రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు

ఒంగోలు, మే 22 (ఆంధ్రజ్యోతి) : నింగి నుంచి సూరీడు నిప్పులు కక్కాడు. జిల్లాను అగ్నిగోళంగా మార్చాడు. ఎండ ప్రచండంతో ఠారెత్తించాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్ర తలు జిల్లాలోనే నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. టంగుటూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 47.43 డిగ్రీల సెల్సియస్‌గా  నమోదైంది. కురిచేడులో 47.40, చీమకుర్తిలో 47.35, కారంచేడులో 47.14 డిగ్రీలుగా ఉంది. అనేక మండలాల్లో 45 డిగ్రీలు దాటింది. దీంతో వృద్ధు లు, చిన్నారులు విలవిల్లాడారు. కురిచేడు, సంతనూతలపాడు, లింగసముద్రం, దోర్నాల, మర్రిపూడి తదితర మండలాల్లో రెండు మూడ్రోలుగా ఉష్ణోగ్రత్తలు 45 నుంచి 47 డిగ్రీలు  నమోదవుతున్నాయి. ప్రభుత్వం గంటకోసారి రాష్ట్రంలోని 855 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు తీస్తుం డగా అధికంగా నమోదయ్యే తొలి 50 కేంద్లాలో మన జిల్లాలో 10నుంచి 18 వరకూ ఉన్నాయి.


శుక్రవారం మద్యాహ్నం ఒంటి గంట సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా కారంచేడులో 47.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 2 గంటల సమయంలో టంగుటూరులో 47.43 డిగ్రీలు, మూడు గంటలకు చీమకుర్తిలో 47.35డిగ్రీలు, 4గంటలకు మర్రిపూడిలో 46.96డిగ్రీలుగా ఉంది. ఇలా వరుసగా నాలుగు సార్లు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదయ్యాయి. పలు పట్టణాల్లోనూ 43నుం చి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా ఉదయం 11 గంటల నుంచే ఆయా పట్టణాల్లో నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లోనూ మధ్యాహ్న సమయంలో ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-05-23T10:49:19+05:30 IST