రాష్ట్రం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-08-16T05:03:29+05:30 IST

జిల్లాలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రాష్ట్రం దేశానికే ఆదర్శం
జెండాకు సెల్యూట్‌ చేస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

  • సకలజనుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు
  • జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలి
  • జాతీయ జెండా ఆవిష్కరణలో మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
  • పోలీస్‌ కమిషనరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు


జిల్లాలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండావిష్కరణ గావించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. పోలీసు దళాల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 15 : వినూత్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గచ్చిబౌలిలోని పోలీస్‌ కమిషనరేట్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు వెలమ రాంరెడ్డిని సన్మానించారు. గ్రామీణ అభివృద్దిశాక ద్వారా 5,735 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.258కోట్ల 38లక్షల చెక్కును అందజేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8 నుంచి నేటి వరకు రోజువారి కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో, పట్టణ స్థానిక సంస్థల్లో, ఇతర గుర్తించిన ప్రదేశాల్లో ఆగస్టు 16వ తేదీన ఉదయం 11-30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. 


టీఎ్‌సఐపాస్‌ కింద 1,123 పరిశ్రమలు, 4,64,792 మందికి ఉపాధి

జిల్లాలో ఇప్పటివరకు టీఆఎస్‌ ఐపాస్‌ కింద 1,123 పరిశ్రమలు రూ.42,769 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయడం జరిగిందని... ఇందులో 4,64,792 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వం 19,333 ఎకరాల విస్తీర్ణంలో రూ.63 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రైల్వే కోచ్‌ తయారీ సంస్థ మేధా సేర్వో డ్రైవ్స్‌ రూ.625 కోట్లతో ప్రముఖ టైర్ల తయారీ సంస్థ స్విన్‌ మ్యాక్స్‌, రూ.250 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబడి ప్రత్యేక్ష్యంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కేటేక్స్‌ గ్రూప్‌ జిల్లాలోని సీతారాంపూర్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా జిల్లాలోని 10వేల మంది యువతకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు. టాటా గ్రూప్‌, అమెజాన్‌, పీఆర్‌జివెల్‌ స్పన్‌, విప్రో, పోకర్ణ, ప్రీమియర్‌, ఎనెర్జీస్‌ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తి పరిశ్రమలను మన జిల్లాలో ఏర్పాటు చేశారని తెలిపారు. 


131 రోడ్ల అభివృద్ధికి  రూ.1,542 కోట్లు మంజూరు

జిల్లాలో ఇప్పటివరకు 131 రహదారుల పనులు 820 కిలోమీటర్లకుగాను రూ.1,542 కోట్లు మంజూరు కాగా, 83 పనులను రూ.874 కోట్లు ఖర్చు చేసి 694  కిలోమీటర్ల పనిని పూర్తిచేయడం జరిగిందన్నారు. మిగతా 48 రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రోడ్డు విస్తరణ, అభివృద్దికి కందుకూరు నుంచి యాచారం రోడ్డు వయా మీర్‌ఖాన్‌పేట్‌ వరకు రూ.85 కోట్లు కొత్తూరు నుంచి సోలిపూర్‌ వరకు రూ.68 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. పంచాయతీ రాజ్‌ ద్వారా గ్రామీణ రహదారుల కింద 70పనులు రూ. 225 కోట్ల అంచనాతో చేపట్టగా ఇప్పటివరకు 47 పనులను రూ.124 కోట్ల వ్యయంతో మొత్తం 199 కిలో మీటర్లు బీటీ రహదారిని పూర్తి చేయ డం జరిగిందన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 23 పనులకు రూ.73 కోట్ల అంచనాతో చేపట్టగా ఇప్పటి వరకు 11పనులను రూ.40 కోట్ల వ్యయంతో మొత్తం 78 కిలోమీటర్లు బీటీ రహదారి పూర్తిచేసినట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకం ద్వారా 794 పనులు రూ.49.50 కోట్ల అంచనాతో చేపట్గాఆ 597 పనులు రూ.33.14 కోట్లు వ్యయంతో పూర్తి చేసినట్లు వివరించారు. ప్రత్యేక అభివృద్ది నిధుల ద్వారా 115 పనులను రూ. 81.54 కోట్లతో చేపట్టాగా రూ.54.74 కోట్లతో పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. జిల్లా ఖనిజ నిధి ద్వారా 411 పనులను రూ.42.16 కోట్ల అంచనాతో చేపట్టగా 265 పనులను రూ.22.43 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. 


పాలమూరు పథకం ద్వారా 2.09లక్షల ఎకరాలకు సాగునీరు

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని 20 మండలాలకు చెందిన 330 గ్రామాల్లో 2 లక్షల 9 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నట్లు తెలిపారు. సాగునీటితోపాటు హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే లక్ష్యాలతో పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు రెండో దశ పనులు జరుగుతున్నాయన్నారు.


54,661 మందికి కొత్త పింఛన్లు

జిల్లావ్యాప్తంగా అర్హులైన  1,57,393 మందికి ఆసరా పింఛన్ల కింద ప్రతినెలా రూ.36.65కోట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 లక్షల పింఛన్లు మం జూరు చేయాలని నిర్ణయించిందని, తొలుత పెండింగ్‌లో ఉన్న 3.30లక్షల మందికి వెంటనే మంజూరుకు కార్యాచరణ ప్రారంభించిందని, మన జిల్లాలో 54,661 మందికి కొత్తగా పింఛన్లు అందనున్నాయని తెలిపారు. 

 జిల్లాలో ఉచిత విద్యుత్‌ ద్వారా 1,14,480 మంది రైతులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతినెలా రూ.9.07 కోట్లు నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 854 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 639 వాటికి స్థలాలను గుర్తించి 504 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు చేపట్టగా 94 పూర్తి చేసినట్లు చెప్పారు. ‘మన ఊరు-మన బడి’ కింద జిల్లాలో మొదటి విడతలో 464 పాఠశాలలు ఎంపిక కాగా, 429 పాఠశాలలకు రూ.90 కోట్ల 40 వేల అంచనా వ్యయంగా మౌలిక వసతులకు అనుమతులు ఇవ్వడం జరిగిందని, 303 పాఠశాలలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయేతర జీవనపాధి పెంచేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 వేల 220 స్వయం సహాయక సంఘాలకు రూ.591 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3,144 సంఘాలకు రూ.185 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించడం జరిగిందన్నారు. స్ర్తీనిధి సంస్థ ద్వారా 2021-22 సంవత్సరానికి రూ.105 కోట్లు రుణాలను మహిళలకు అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉద్యాన, పట్టుపరిశ్రమ ద్వారా 72,426 ఎకరాల్లో కూరగాయలు, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఔషద మొక్కలు, మల్బరరీ సాగు అవుతుందని తెలిపారు. సూక్ష్మనీటి పథకం ద్వారా 383 రైతులకు 420 హెక్టార్లకు బిందు సేద్యం, 149 రైతులకు 125 హెక్టార్లకుగాను తుంపర సేద్యం పరికరాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు గొల్ల కురుమలకు మొదటి విడతలో 11,685 గొర్రెల యూనిట్లను రూ.146 కోట్ల వ్యయంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. పౌర సరఫరాల ద్వారా ఆగస్టు నెలకు 6కిలోలకు బదులుగా 15 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా 1 లక్ష 116 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. 2021-22 సంవత్సరానికి 14,160 మంది ఆడ పిల్లలకు 141 కోట్లు, 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 2,029 మందికి రూ.20.30 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. జిల్లాలో 6,637 డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు కాగా 2,637 ఇండ్లు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, తెలిపారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా నాలుగు దశంలో రూ.170 కోట్లతో 1022 చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టాగా 806 చెరువులు 104 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వికలాంగుల సంక్షేమం ద్వారా 39 మంది వికలాంగులకు రూ.26 లక్షల సబ్సిడి రుణాలు, 51 మందికి ట్రై సైకిళ్లు, 20 మందికి వీల్‌ చైర్లు అందించామని తెలిపారు.

 

ఓ వైపు వర్షం.. మరో వైపు విద్యార్థుల ఆటపాటలు

ఓ వైపు వర్షం పడుతుంది... మరో వైపు విద్యార్థులు తమ ప్రదర్శనను కొనసాగించారు. జోరు వర్షం కురుస్తుండటంతో మంత్రి సబితాఇంద్రారెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను స్టాప్‌ చేయించారు. వర్షం తగ్గాక మళ్లీ విద్యార్థులు అద్బుతంగా తమ కళను ప్రదర్శన చేశారు. దేశ భక్తిని చాటే విధంగా నృత్యాలు చేశారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపే విధంగా స్టాల్స్‌, శకటాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. 


ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుతో కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలోని వివిధ శాఖల్లో 151 మంది ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులుగా సన్మానం పొందారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-16T05:03:29+05:30 IST