వరి.. తప్పిన సర్కారు గురి!

ABN , First Publish Date - 2022-01-28T08:05:24+05:30 IST

రాష్ట్రంలో వరి దిగుబడి విషయంలో సర్కారు గురి తప్పింది. ధాన్యం కొనుగోళ్లపై లెక్క మారింది.

వరి.. తప్పిన సర్కారు గురి!

  • రాష్ట్రంలో 1.30 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
  • కొనుగోలు కేంద్రాలకు వచ్చింది మాత్రం 69 లక్షల టన్నులే..
  • రాష్ట్రంలో ఆ మేరకు ఇప్పటికే పూర్తయిన కొనుగోళ్లు
  • 6878 కొనుగోలు కేంద్రాల్లో 6627 మూసివేత


హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి దిగుబడి విషయంలో సర్కారు గురి తప్పింది. ధాన్యం కొనుగోళ్లపై లెక్క మారింది. ఈ వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, 1.30 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని తొలుత అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. అయితే కేంద్రం.. 40 లక్షల టన్నుల బియ్యం మాత్రమే సేకరిస్తామని స్పష్టం చేసింది. అంతకుమించి కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే సరిపోతుంది. కానీ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం సేకరణను పెంచాలని కోరారు. ఇందుకు కేంద్రం అంగీకరించకపోతే.. మొత్తం ధాన్యాన్ని తామే కొనుగోలు చేసి ఢిల్లీలో పారబోస్తామని కూడా హెచ్చరించారు. అయినా.. తొలుత కేంద్రం టార్గెట్‌ పెంచేందుకు అంగీకరించ లేదు. 


రాష్ట్ర ప్రభుత్వం పట్టు వదలకుండా ప్రయత్నించడంతో.. ఎట్టకేలకు మరో 6 లక్షల టన్నుల బియ్యం అదనంగా తీసుకుంటామని చెప్పింది. దీంతో.. దాదాపు మరో 10 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి లభించినట్లయింది. అలాగే, మొత్తం తెలంగాణ నుంచి తీసుకునే బియ్యం టార్గెట్‌ 46 లక్షల టన్నులకు పెరగ్గా.. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సుమారు 70 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఈ దిశగా ఇప్పటివరకు రాష్ట్రంలో 69.10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది.అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన మేరకు ధాన్యం.. కొనుగోలు కేంద్రాలకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగా రైతుల నుంచి చివరి గింజ వరకూ కొన్నా.. కేంద్రం ఏ మేరకు బియ్యం కొంటామని చెప్పిందో.. సరిగ్గా అంతే మొత్తానికి సరిపడా ధాన్యం సేకరణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో.. వరి దిగుబడి అంశంలో కేసీఆర్‌ సర్కారు లెక్కలు తప్పాయన్న విషయం స్పష్టమవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సుమారు 20 లక్షల టన్నుల వరకు రైస్‌ మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారని,  రైతులు కూడా ఆహార, విత్తన అవసరాలకు కొంత ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారని అంటున్నారు. అలాగే, అధిక వర్షాల ప్రభావం వల్ల సుమారు 25 లక్షల టన్నుల పంట దిగుబడి తగ్గిందని భావిస్తున్నారు.  


ముగింపు దశకు కొనుగోళ్లు..

రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దాదాపు ముగిశాయి. ఈ నెలాఖరు వరకు కేంద్రాలను తెరిచి ఉంచి, తర్వాత మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెసుస్తోంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. 6,878 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పౌరసరఫరాల సంస్థ.. ఇప్పటివరకు 13 లక్షల మంది రైతుల నుంచి 69.10 టన్నుల ధాన్యాన్ని కొలుగోలు చేసింది. ఇప్పటి వరకు 24జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తవడంతో 6,637 కేంద్రాలను మూసివేశారు. ప్రస్తుతం భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 241 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఈ కేంద్రాలకు రోజుకు 8-9 వేల టన్నుల వరకు ధాన్యం వస్తోంది. మిల్లర్లు ధ్రువీకరించిన తర్వాతే రైతులకు ఓపీఎమ్మెస్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దీంతో.. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో రైతులకు ఇంకా రూ.2,620 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం.


ధాన్యం సేకరణలో మూడో స్థానంలో..

ధాన్యం సేకరణలో తెలంగాణ.. దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం... 187 లక్షల టన్నులు (1.87కోట్ల టన్నులు) వరి ధాన్యం కొనుగోలుతో పంజాబ్‌ మొదటి స్థానంలో నిలవగా.. 82.63 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో ఛత్తీ్‌సగఢ్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 69.10 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఇక 56.50 లక్షల టన్నులతో నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్‌, 55.31లక్షల మెట్రిక్‌ టన్నులతో ఐదో స్థానంలో హరియాణా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా, దేశవ్యాప్తంగా ఽఎఫ్‌సీఐ పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా దాన్యం సేకరణ సాగలేదు. 5 కోట్ల టన్నుల ముడి బియ్యాన్ని(7.50 కోట్ల టన్నుల ధాన్యం) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 6కోట్ల టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే పూర్తయింది. వరి అధికంగా సాగయ్యే పంజాబ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, మఽధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ దాదాపుగా ముగిసింది. ఈ పరిస్థితుల్లో మరో కోటిన్నర టన్నుల సేకరణపై అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-01-28T08:05:24+05:30 IST