రాష్ట్రం అధోగతిపాలు

ABN , First Publish Date - 2022-07-04T09:00:14+05:30 IST

పచ్చి అబద్ధాలు, మోసంతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగుతోందని, ఈ ఏనిమిదేళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఇందుకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ పేర్కొంది.

రాష్ట్రం అధోగతిపాలు

  • ఎనిమిదేళ్లలో ఆర్థిక, సామాజిక, మానవాభివృద్ధిలో క్షీణత
  • ఈ సర్కారు గద్దె దిగితేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారం
  • బీజేపీయే ప్రత్యామ్నాయం
  • జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ పరిస్థితులపై 
  • భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్‌


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పచ్చి అబద్ధాలు, మోసంతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగుతోందని, ఈ ఏనిమిదేళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఇందుకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ పేర్కొంది. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ  కుటుంబ పాలనలో నలిగిందని, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, కుటుంబ సభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అక్రమ సంపదను కూడబెట్టారని ఆరోపించింది. టీఆర్‌ఎస్‌ వారసత్వ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారానే ప్రజల ఆకాంక్షలు సాకారమవుతాయని, ఆ ప్రత్యామ్నా యాన్ని బీజేపీ అందిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ డిక్లరేషన్‌ను.. జాతీయ కార్యవర్గం ఎజెండాలో భాగంగా ఆదివారం జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని భావించి వందలాది మంది యువత ప్రాణత్యాగం చేశారని.. కానీ, ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేసిందని, ఒక కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తుండడం, తెలంగాణ తల్లి బందీ కావడం దురదృష్టకరం అని డిక్లరేషన్‌లో బీజేపీ పేర్కొంది.


 తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ ఉద్వేగభరితమైన ప్రజా ఉద్యమా నికి నాయకత్వం వహించిందని, 2014లో రాష్ట్ర ఏర్పాటు కు సహకరించిందని తెలిపింది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా జరిగింది ఏమీ లేదని ధ్వజమెత్తింది. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ పరిస్థితి మరింత దిగజారిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని దుయ్యబట్టింది. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014 మేనిఫెస్టోలో అధికార పార్టీ హామీ ఇచ్చిందని, దానిని అమలు చేయడంలో విఫలమైందని డిక్లరేషన్‌లో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాల్లో నేడు 70ు అధ్యాపక పదవులు ఖాళీగా ఉన్నాయని.. పరిశోధన, అభివృద్థి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను విడుదల చేయడం లేదని తెలిపింది. పాఠశాల విద్య పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించింది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొంది. 

 



ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..

తెలంగాణ ఏర్పాటైనప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండేదని.. నేడు అప్పులపాలయిందని, కాళేశ్వరం నిధుల దుర్విని యోగంపై ఆరోపణలు వస్తున్నాయని, రూ.40 వేల కోట్ల నుంచి రూ. 1.30 లక్షల కోట్ల వరకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని బీజేపీ తన డిక్లరేషన్‌లో పేర్కొంది. ఈ ప్రాజె క్టును సాకుగా చూపి, మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యానికి గురిచేశారని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పాలమూరు- రంగా రెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించింది. నెట్టెంపాడు, డిండి తదితర ప్రాజెక్టుల పరిస్థితీ ఇలాగే ఉందని పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, అధికార పార్టీ నాయకులు, వారి భాగస్వాము లు, వారి తోబుట్టువులు దారుణమైన నేరాలకు పాల్పడు తున్నా చర్యలు తీసుకోవట్లేదని మండిపడింది. 


ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టిస్తు న్నారని, ఎమ్మెల్యే పిల్లలు కీచకులుగా మారారని ఆరోపించింది. సరైన నిఘా లేకపోవడంతో డ్రగ్స్‌ సంస్కృతి కొనసాగుతోందని.. బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయని గుర్తుచేసింది. రైతులకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదని.. రైతు బంధు పేరుతో ఇతర సబ్సిడీలను ఎత్తివేశారని విమర్శించింది. రాష్ట్ర అభివృద్థికి కేంద్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నప్పటికీ.. అవినీతి కారణంగా రాష్ట్రంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మండిప డింది. కాంగ్రెస్‌ హయాంలో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 2015లో తాము తిరిగి తెరిపించామని, జాతీయ రహదారులను పొడిగించామని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల 340 కిలోమీటర్ల పొడవునా రూ.8 వేల కోట్లతో రీజనల్‌ రింగ్‌ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామని డిక్లరేషన్‌లో పేర్కొంది.  


బీజేపీ బలపడుతోంది..

2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము నాలుగు సీట్లు గెలిచామని.. తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లను గెలుచుకుందని.. తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక  టీఆర్‌ఎస్‌ భవితవ్యాన్ని ఖరారు చేసిందని బీజేపీ తన డిక్లరేషన్‌లో పేర్కొంది.  ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరుల్లో కని పిస్తున్న నిరుత్సాహన్ని చూస్తే రాష్ట్రంలో బీజేపీ బల పడుతోందన్న విషయం స్పష్టమవుతోందని తెలిపింది. అనంతరం ఈ డిక్లరేషన్‌పై పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థాగతంగా బీజేపీ బలోపేతానికి ఈటల కొన్ని సూచనలు చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-07-04T09:00:14+05:30 IST