షుగర్స్‌ నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం

ABN , First Publish Date - 2022-01-29T06:10:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అవగాహన లోపం, అనాలోచిత నిర్ణయాల కారణంగా సహకార చక్కెర కర్మాగారాలు నష్టాలు చవిచూస్తూ నిర్వీర్యం అవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.

షుగర్స్‌ నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం
తాండవ చక్కెర కర్మాగారం గేటు వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవడంలేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

పాయకరావుపేట, జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వ అవగాహన లోపం, అనాలోచిత నిర్ణయాల కారణంగా సహకార చక్కెర కర్మాగారాలు నష్టాలు చవిచూస్తూ నిర్వీర్యం అవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌తో కలిసి స్థానిక తాండవ చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులు, చెరకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెరకు కర్మాగారాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉప ఉత్పత్తులను తయారుచేసేలా కేంద్రం పలువిధాలా ప్రోత్సహిస్తున్నదని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని సద్వినియోగం చేసుకోకుండా షుగర్‌ ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. తాండవ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లింపు, కార్మికులకు వేతాలు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ చేతగానితనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు, కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు ఒక కమిటీ వేసి అధ్యయనం చేయాలని వీర్రాజు సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఇంజరపు సూరిబాబు, కువల కుమార్‌, వేముల వెంకటేశ్వరరావు తదితరులు వున్నారు.


Updated Date - 2022-01-29T06:10:02+05:30 IST