రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-20T04:48:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆరోపించారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం


కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 19: రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాలు, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో పెద్దఎత్తున యువకులు, మహిళలు, ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పంట చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని అన్నారు. పంట మార్పిడి పేరుతో రైతుల్లో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఒకసారి మొక్కజొన్న వద్దని, మరోసారి వరి వద్దని చెబుతూ తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను మాత్రం అర్థం చేసుకోవడం లేదని అన్నారు. జిల్లాలో పండిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు ఆనందరావు, నాయకులు శ్రీధర్‌రావు, ప్రవీణ్‌రావు, భాస్కర్‌, నర్సింలు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:48:13+05:30 IST