మానవ తప్పిదమే!

ABN , First Publish Date - 2021-12-05T08:01:09+05:30 IST

కడప జిల్లాలో గత నెలలో సంభవించిన ప్రకృతి విలయం కన్నా.. మానవ తప్పిదంతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టమే చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన కేంద్ర అధికారుల బృందం పేర్కొన్నట్లు

మానవ తప్పిదమే!

  • వర్షం, వరద అంచనాలో రాష్ట్ర ప్రభుత్వానిది ఘోర వైఫల్యం
  • ‘అన్నమయ్య’పై కేంద్ర బృందం నివేదిక
  • గతనెల 13 నుంచే భారీ వర్షాలు
  • డ్యాములకు ముప్పుందని 2 రోజుల ముందే మీడియా హెచ్చరిక
  • అయినా పట్టించుకోని యంత్రాంగం
  • సొంత అంచనాలనే నమ్మి ముంచేశారు
  • నివేదికలో కేంద్ర బృందం స్పష్టీకరణ?
  • దీని ఆధారంగానే షెకావత్‌ వ్యాఖ్యలు
  • కేంద్ర అధికారుల ప్రశ్నలను 29నే
  • వెలుగులోకి తీసుకొచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ అయినా అద్భుతంగా పనిచేశారని
  • కితాబిచ్చినట్లు జగన్‌ సర్కారు ప్రచారం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కడప జిల్లాలో గత నెలలో సంభవించిన ప్రకృతి విలయం కన్నా.. మానవ తప్పిదంతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టమే చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన కేంద్ర అధికారుల బృందం పేర్కొన్నట్లు తెలిసింది. విపత్తులను అంచనా వేయడం నుంచి అది చేసే విఽధ్వంసం ఎంతటి భయానకంగా ఉంటుందో రాష్ట్రప్రభుత్వం ముందుగా అంచనా వేయలేకపోయిందని స్పష్టంచేసినట్లు తెలిసింది. అన్నమయ్య ఆనకట్ట తెగిపోవడానికి 48 గంటలు ముందుగానే.. ముప్పు పొంచి ఉందని, ప్రాజెక్టులు డేంజర్‌  జోన్‌కు వెళ్లిపోయాయని మీడియా ప్రముఖంగా వార్తలు ప్రచురించినా.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సీరియ్‌సగా తీసుకోలేదని తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్ర బృందం వస్తుంది.. తాము చెప్పింది విని రాసుకుని పోతుందన్న భ్రమల్లో ఉన్న వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఇది నిజంగా భారీ షాకే! చెప్పేవి రాసుకోవడమే కాదు.. విపత్తుల్లో జరిగిన భారీనష్టాన్ని స్వయంగా పరిశీలించి.. దానికి బాధ్యతెవరిదో కూడా సదరు బృందం కేంద్రానికి నివేదిస్తుందన్న విషయం వారికి ఆలస్యంగా తెలిసింది. రాబోయే పరిస్థితిని శాస్త్రీయంగా అంచనా వేయకపోవడం, వేసుకున్న ముందస్తు అంచనాలు దారుణంగా దెబ్బతినడం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ఆ బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తుఫాన్ల సమయంలో భారీ వర్షాలు, వరదలు రావడం సహజమేనని.. కానీ వాటి తీవ్రతను పసిగట్టి ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బలికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ యంత్రాంగ కర్తవ్యమని ప్రస్తావించినట్లు తెలిసింది.


కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో గత నెల 13 నుంచి 23వ తేదీ వరకు భారీ వర్షాలు, వరదలు సంభవించి పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిన సంగతి విదితమే. ఈ నష్టాల అంచనాకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం గత నెల 26 నుంచే ఆయా జిల్లాల్లో పర్యటించింది. 27న కడప జిల్లాలో డాక్టర్‌ మనోహరన్‌, శివానీశర్మ, శ్రీనివా్‌సలతో కూడిన అధికారుల బృందం ఫించా, అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాలతోపాటు జిల్లా అధికార యంత్రాంగం సూచించిన వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడింది. జిల్లా అధికారులు ముందస్తుగా ఇచ్చిన నివేదికలను పరిశీలించింది. కడప కలెక్టర్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడింది. అనంతరం 29వ తేదీన అమరావతిలో సీఎం సమక్షంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని, తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు అందించాలని వారిని సీఎం కోరారు. వరద సమయంలో రాష్ట్ర అధికారులు బాగా పనిచేశారని కేంద్ర బృందం కితాబిచ్చినట్లుగా ప్రభుత్వం మీడియాకు ప్రకటనలు విడుదల చేసింది.


2న ప్రాథమిక నివేదిక..

వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఈ నెల 2వ తేదీన కేంద్ర హోం శాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఇదే ప్రతిని కేంద్ర జలశక్తి శాఖకు కూడా పంపింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన అంశంపై జలశక్తి శాఖ ఆరా తీయంతో దానికీ సమర్పించింది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రకృతి విపత్తుతోపాటు మానవ తప్పిదం వల్ల అధిక నష్టం జరిగిన విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. ‘నవంబరు 13 నుంచే రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాకు ఎగువన ఉన్న చిత్తూరు జిల్లా నుంచి భారీ వరద వస్తోంది. 16వ తేదీ నాటికే కడప జిల్లాలోని ఫించా, అన్నమయ్య ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరినట్లుగా ఇంజనీరింగ్‌ విభాగం సమర్పించిన నివేదికలను బట్టి అర్థమవుతోంది. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోంది. అంటే.. అప్పటికే కురిసిన వర్షాలతో వరద తీవ్రమవడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరిగిపోతున్నప్పుడే ఇరిగేషన్‌ విభాగం అప్రమత్తమవ్వాల్సి ఉంది. భారీగా వరద నీరు వస్తుండడంతో అన్నమయ్య ప్రాజెక్టు 17వ తేదీ నాటికే నిండుకుండలా మారిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దిగువకు భారీగా నీటి విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రాజెక్టుతోపాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మునిగిపోతాయని హెచ్చరించాయి. ఫించాతోపాటు అన్నమయ్య ప్రాజెక్టుకు వరద ముంపు పొంచి ఉందని, ప్రాజెక్టులు డేంజర్‌జోన్‌లో ఉన్నాయంటూ 18వ తేదీన కూడా తెలియజేశాయి.


మరుసటి రోజు తెల్లవారుజామునే అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోయింది. ఈ సంఘటనకు సరిగ్గా గంటన్నర ముందు ముప్పు పొంచి ఉందన్న సమాచారం స్థానికులకు చేరింది. వారంతా హుటాహుటిన అర్ధరాత్రి ఊరు విడిచి.. సమీపంలో ఉన్న కొండమీదకు వెళ్లారు. ముప్పు నుంచి బయటపడ్డామని తేరుకునేలోపే వరద నీరు ఊరిని ముంచేసింది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం, దిగువకు నీటి విడుదల చేసే సామర్థ్యంపై ఇంజనీర్లకు గట్టి నమ్మకం ఉంది. ఎంత వరద వచ్చినా తట్టుకోగలదన్న ధీమాలో వారున్నారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతోపాటు స్థానికంగా భారీ వర్షాలు ఉండటంతో పరిస్థితులకు తగినట్లుగా అంచనాలు వేయలేకపోయారు. నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువ కు విడుదల చేస్తున్నా.. అంతకు రెట్టింపు స్థాయిలో వరద వచ్చిచేరడంతో ఆనకట్ట కొట్టుకుపోయింది. వారి అంచనా ప్రకారం దిగువకు 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా.. అంతకు రెట్టింపుగా 2.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరి ఉంటుంది. స్థానికంగా పడిన వర్షపునీటితోపాటు ఎగువ నుంచి భారీ వరద వస్తుంది.. అది మరీ ఎక్కువైతే ప్రాజెక్టు తట్టుకోలేదన్న కనీస అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీని ఆధారంగా ప్రాజెక్టు భద్రతతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల రక్షణపై ముందుగానే తగిన మాస్టర్‌ప్లాన్‌ రూపొందించుకోవాలి. రెండ్రోజుల ముందే మీడియాలో వార్తలు వచ్చినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.


సొంత అంచనాలనే అనుసరించారు. దీని ఫలితంగానే అన్నమయ్య ఆనకట్ట తెగిపోయి.. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇందులో మానవ తప్పిదమే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వరద పెరిగి ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని మీకనిపిస్తే సేఫ్టీ ప్లాన్‌ ఏమిటి.. నష్టం జరిగే లోపే దాన్ని ఎలా అమలు చేస్తారని మేం ప్రశ్నిస్తే.. ఆ పరిస్థితి వస్తుందనుకోలేదని అధికారులు బదులిచ్చారు. సొంత అంచనాలపై ఉన్న అతి విశ్వాసమే దీనికి కారణం’ అని కేంద్ర బృందం తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది.


ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

రాష్ట్రంలో వరద నష్టంపై కేంద్ర బృందం వైఖరి గురించి ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే చెప్పింది. గత నెల 27న కడప జిల్లాలో పర్యటించినప్పుడు బృంద సభ్యులు అక్కడి అధికారులపై అనేక ప్రశ్నలు సంధించారు. వాటికి బదులివ్వలేక వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనిపై ‘కట్ట తెగేవరకు ఏం చేస్తున్నారు’ అన్న శీర్షికన 29న ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది. వరద ముప్పును ఎందుకు పసిగట్టలేకపోయారు? ఆనకట్ట తెగేవరకు మీరేం చేశారు? తీసుకున్న ముందు జాగ్రత్తలేమిటని కేంద్ర అధికారులు అడిగారు. ప్రాజెక్టు నీటి నిర్వహణ, విడుదల, ఇతర అంశాలపై ఇరిగేషన్‌ విభాగం నుంచి సమగ్ర వివరాలు తీసుకున్నారు. ప్రజలతో తాము మాట్లాడిన అంశాలు, అధికారులు చెప్పిన సమాధానాలు, వారిచ్చిన నివేదికలను క్రోడీకరించాకే ఈ విపత్తులో మానవ తప్పిదం ఉందని కేంద్ర బృందం నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది.



ఆ నివేదిక చూశాకే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు?

అన్నమయ్య ప్రాజెక్టు వరదకు కొట్టుకుపోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా అని ఆక్షేపిస్తూ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద ముంచుకొస్తున్నా సరైన నిర్ణయం తీసుకోకుండా నీటిని పక్కాగా దిగువకు విడుదల చేయని కారణంగానే ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, ఈ పాపం రాష్ట్రప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. ఈ పరిణామం జగన్‌ సర్కారును ఓ కుదుపు కుదిపింది. అనూహ్యంగా కేంద్రం ఎందుకిలా దాడిచేసిందో తొలుత బోధ పడలేదు. కానీ వరద నష్టంపై కేంద్ర బృందం ఇచ్చిన వాస్తవిక నివేదిక ఆధారంగానే కేంద్ర మంత్రి విరుచుకుపడ్డారని ఆ తర్వాత అర్థమైంది. ఈ నివేదిక ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ పరిశీలనకు వెళ్లింది. దీని ఆధారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రాజెక్టు కొట్టుకుపోవడం, మానవ తప్పిదాలపై పలు కఠిన చర్యలను కేంద్రం సిఫారసు చేయనుందని సమాచారం. ఇదిలా ఉంటే.. కేంద్ర బృందం వరద నష్టంపై మరో రెండ్రోజుల్లో తుది నివేదిక అందించనున్నట్లు తెలిసింది. దీని ఆధారంగానే కేంద్రం ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటిస్తుంది.

Updated Date - 2021-12-05T08:01:09+05:30 IST