రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా మారింది

ABN , First Publish Date - 2022-07-04T05:24:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా మార్తిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా మారింది
రాజీవ్‌ స్వగృహ ఆర్జీదాలతో మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

 - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

తిమ్మాపూర్‌, జూలై 3: రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా మార్తిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం ఆద్వర్యంలో ఆదివారం మండలంలోని రామకృష్ణ కాలనీ సమీపంలోని రాజీవ్‌ స్వగృహ స్ధలాన్ని ఆయన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పరిశీలించారు. అనంతరం విశ్రాంతి ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటెషన్‌ను చూసి ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పేద, మధ్య తరగతుల వారికి గత ప్రభుత్వాలు భూములు ఇస్తే ప్రస్తుతం ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం భూస్వాముల పక్షాన, భూ బకాసురుల పక్షాన ఉన్నదని, బహుజన సమాజ్‌ పార్టీ ఎల్లప్పుడు నిరుపేదల, ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల వైపు ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌కు బీఎస్పీ భయం పట్టుకుందని, అందుకే కోట్ల రూపాయలు పెట్టి ప్రశాంత్‌ కిషోర్‌ను అరువు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. 2007లో అప్పటి ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇంటిని ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా  జిల్లాలో రాజీవ్‌ స్వగృహ పేరిట 90 ఎకరాల స్ధలాన్ని కొనుగోలు చేసిందని, దీనికోసం సొంతగా ఇంటిని నిర్మించుకొవాలని ఆశతో ఉన్న సుమారు 7,524 మంది ఒకొక్కరు ఐదు వేల రూపాయల చొప్పున కట్టారని, మొత్తం 3.95 కోట్ల రూపాయలను సేకరించారని అన్నారు.  అప్పటి నుంచి రాజీవ్‌ స్వగృహ అర్జీదారులకు, విశ్రాంత అధికారులకు గృహ స్ధలాలు కేటాయించకుండా జాప్యం చేశారని విమర్శించారు. అర్జీదారుల డబ్బులతో కొనుగోలు చేసిన భూమిని వారికి ఇవ్వకుండా ప్రభుత్వం ఆ భూమితో రియల్‌ ఎస్టేట్‌ దందాకు తెరలేపారన్నారు. రాజీవ్‌ స్వగృహ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులకు కాకుండా వేరే వాళ్లకు అమ్మడం అంటే అది ప్రభుత్వం మోసం చేసినట్టేనని అభిప్రాయపడ్డారు. ఈ స్ధలం పైన సభ్యులు కోర్డుకు వెళ్లారని, ఆ భూమి కోర్టు వివాదంలో ఉండగా వేరే వాళ్లకు కేటాయిస్తే వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. రాజీవ్‌ స్వగృహకు సంబందించిన భూముల వేలం వెంటనే నిలిపివేయాలని, రాజీవ్‌ స్వగృహ వెల్ఫేర్‌ సొసైటి సభ్యులకు వేలం ద్వారా కాకుండా 2500 రూపాయలకు గజం చొప్పన కేటాయిచాలని డిమాండ్‌ చేశారు. స్ధానిక మంత్రి రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా మారిపోయారని, మంత్రి తన అనుచరులతో రాజీవ్‌ స్వగృహ భూముల వేలంలో పాల్గొన్నారని ఆరోపించారు. పేదల భూములను వేలం పెట్టిన రాజీవ్‌ స్వగృహ ఎండీపై క్రిమినల్‌ కేసు పెట్టాలని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. రాజీవ్‌ స్వగృహ సభ్యులకు న్యాయం చేయాలని, లేకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమం చేస్తామని ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చారించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డె సమ్మయ్య, జిల్లా ఇన్‌చార్జి మాతంగి అశోక్‌, నల్లాల రాజేందర్‌, జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్‌, నాయకులు మల్లేశం, లింగయ్య, ప్రభాకర్‌ ఇతర నాయకులు, రిటైర్డ్‌ ఆర్మీ అధికారులు, వెల్ఫెర్‌ సొసైటి సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T05:24:38+05:30 IST