కదం తొక్కిన కమలదళం

ABN , First Publish Date - 2022-05-15T06:27:06+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభ విజయవంతమైంది.

కదం తొక్కిన కమలదళం
సభకు హాజరైన జనం


  • అట్టహాసంగా ముగిసిన అమిత్‌షా సభ
  • 2 లక్షల మందికిపైగా హాజరైన జనం
  • సభ విజయవంతం... పార్టీశ్రేణుల్లో నూతనోత్సాహం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభ విజయవంతమైంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా విచ్చేయడంతో సభకు హాజరైన వారిలో జోష్‌ కనిపించింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సభకు భారీగా జనం తరలిరావడంతో బీజేపీ శ్రేణులు సంబరపడ్డాయి. పార్టీ నేతలు దారి పొడవునా ౅ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో తుక్కుగూడ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. 

రంగారెడ్డి అర్బన్‌/ ఇబ్రహీంపట్నం/ షాద్‌నగర్‌/ శంషాబాద్‌ రూరల్‌ / ఆదిభట్ల / మహేశ్వరం /కందుకూరు, మే 14 : అవినీతి అంతం.. బీజేపీ పంతం.. అనే నినాదంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు కమలదళం కదం తొక్కింది. సభకు భారీగా జనం తరలొచ్చి జేజేలు పలికారు. మహేశ్వరం మండలం తుక్కుగూడలో నిర్వహించిన అమిత్‌షా సభ అట్టహాసంగా ముగిసింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభలో బీజేపీ శ్రేణులు సత్తా చాటారు. పార్టీ అగ్రనేత అమిత్‌ షా హాజరుతో  కమలనాథుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎనిమిది నెలల కాలంలో అమిత్‌షా రెండోసారి రావడం కీలకంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 2 లక్షల మందికి పైగా విచ్చేశారు. సభా ప్రాంగణ సమీపంలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం అయింది. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. రింగ్‌రోడ్డు ఎగ్జిట్‌ 14వ గేట్‌ పోలీసులు మూసి వేయడంతో అమిత్‌షా సభకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గేట్లు తోసుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం నెలకొంది. టోల్‌గేట్‌ వద్ద వాహనాలను ఆపితే.. 2 గంటల్లో డీజీపీ కార్యాలయాన్ని ముట్డడిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. దీంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధులు సభకు భారీగా హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యత నెలకొంది. పార్టీ టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులు అమిత్‌షా సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించారు. 2023లో బీజేపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే అంశంపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. అమిత్‌షా రాకతో కాషాయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండింది. సభా వేదిక వద్ద పార్టీశ్రేణుల సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌, శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్‌, బీజేపీ జాతీయ నాయకులు సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌రావు, ఎంపీ అరవింద్‌, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, గరికపాటి రామ్మోహన్‌రావు, విజయశాంతి, వివేక్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు బాలసుబ్రమణ్యం, ఇంద్రసేనారెడ్డి, మనోహర్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బెక్కరి జనార్దన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌, పార్టీ ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి కొత్త అశోక్‌, బీజేవైఎం జిల్లా అఽధ్యక్షులు యాదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

అమిత్‌షాకు ఘన స్వాగతం

తుక్కుగూడలో జరిగిన ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు విచ్చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షాకు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు యాత్రప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బుక్క వేణుగోపాల్‌తోపాటు కొంత మంది నేతలు శాలువా కప్పి, పూల దండ వేసి జ్ఞాపికను అందజేసి ఘనస్వాగతం పలికారు. 

కాషాయమయంగా తుక్కుగూడ..

అమిత్‌షా బహిరంగ సభ ప్రాంగణంతోపాటు తుక్కుగూడ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. పార్టీ నేతలు దారి పొడవునా ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. టికెట్‌ ఆశిస్తున్న ఆశా వహులు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమిత్‌షా సభకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోక పోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా పలుచోట్ల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. 

సభ సైడ్‌లైట్స్‌

  • బండి సంజయ్‌ దేవేంద్ర విద్యాలయం నుంచి పాదయాత్ర చేస్తూ సాయంత్రం 6:13 గంటలకు సభాస్థలానికి చేరుకున్నారు.
  • 7:10గంటలకు బండి సంజయ్‌ సభా వేదికపైకి వచ్చారు.
  • 7:15 గంటలకు అమిత్‌షా సభా వేదికపైకి వచ్చారు.
  • సభా స్థలంలో బైబై సబితమ్మ, హ్యాపీ లాస్టు 18 మంత్స్‌ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.
  • వీఐపీ పాసులను అందక సభ వద్దకు అనుమతించలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
  • అమిత్‌షా ప్రసంగం రాత్రి 8:25 గంటలకు ముగిసింది.

Updated Date - 2022-05-15T06:27:06+05:30 IST