Abn logo
Sep 20 2021 @ 00:37AM

సిబ్బంది ఆకలి కేకలు

టెక్కలిలో సిబ్బందికి టమోటా రైస్‌ వండిస్తున్న సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌

టెక్కలి/టెక్కలి రూరల్‌/ఇచ్ఛాపురం రూరల్‌: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో  ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఆకలు కేకలు ఎదురయ్యాయి. ఈ కేంద్రంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు సంబంధించి ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. సిబ్బందికి తాగునీరు, భోజనాలు సమకూర్చడంలో ఏఆర్‌వోలు విఫలమయ్యారు 1200 మంది సిబ్బందికి మధ్యాహ్నం భోజనం అందజేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ తక్షణమే స్పందించి టమోటా రైస్‌ను తయారు చేయించి సిబ్బందికి అందించారు. తాగునీరు సమకూర్చడంలోనూ అధికారులు  వైఫల్యం చెందడంతో సబ్‌ కలెక్టరే నేరుగా వెళ్లి 1500 వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేసి సిబ్బందికి అందజేశారు.

-  ఇచ్ఛాపురం నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక పురుషోత్తపురం మోడల్‌ స్కూల్‌ వద్ద నాలుగు మండలాలకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. మధ్యాహ్నానికి భోజనాలు అందించకపోవడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి విధుల్లో ఉండగా ఆహారం అందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు బయట నుంచి భోజనాలు అందించారు.