శ్రీకాళహస్తి భూములపై..అక్రమార్కుల పంజా

ABN , First Publish Date - 2020-05-30T09:08:23+05:30 IST

దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రూ.కోట్ల విలువ చేసే శ్రీకాళహస్తి దేవాలయ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది.

శ్రీకాళహస్తి భూములపై..అక్రమార్కుల పంజా

12 ఎకరాల భూముల కబ్జాకు యత్నం

రూ.150 కోట్ల విలువైన భూమిపై కన్ను 

చేష్టలుడిగిన దేవదాయ శాఖ అధికారులు

అదేమంటే ప్రభుత్త పెద్దల పేరిట దందా


గుడివాడ, మే 29 : దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రూ.కోట్ల విలువ చేసే శ్రీకాళహస్తి దేవాలయ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. గుడివాడ రూరల్‌ మండలం వలివర్తిపాడు గ్రామంలో శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన 12 ఎకరాల భూములున్నాయి. ఈ భూములకు నలువైపులా రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లు వేయడంతో ప్రస్తుతం వాటి ఉనికికి ముప్పు వచ్చింది. ఇటీవల వివాదాస్పదమైన ప్రైవేటు భూముల పక్కనే ఈ భూములు ఉండటంతో వీటికి ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో శ్రీకాళహస్తి భూముల్లో ఇష్టారాజ్యంగా రోడ్లు నిర్మించారు. అధికారుల అనుమతి లేకుండా జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి పనులు చేయడంతో వాటి కబ్జాకు యత్నిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వ భూములు, అందులోనూ దేవాలయ భూముల్లో ఎలాంటి పనులు చేయకూడదని నిబంధనలున్నా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.


కొంత మంది స్థానికులు భూముల ఆక్రమణ విషయమై దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, స్థానిక అధికారులు భూములను పరిశీలించి వెంటనే ఖాళీ చేయాలని ఆక్రమణదారులను హెచ్చరించారు. పక్కనే ఉన్న తమ స్థలాల్లో పనుల కోసం కొద్దిగా మట్టి వేసుకున్నామని, ఒక్క రోజులో వాటిని తీసివేస్తామని ఆక్రమణదారులు వారితో చెప్పారు. ఇది జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంత వరకూ ఆ భూముల్లో వేసిన రోడ్లను తొలగించకపోవడం గమనార్హం. తమ స్థలాల్లో  ప్రైవేటు వ్యక్తులు పాగా వేశారని దేవదాయ శాఖ అధికారులు కనీసం పోలీసు కేసు కూడా పెట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 


రాష్ట్రంలో కీలక ప్రజాప్రతినిధి అనుచరుడినని చెప్పుకునే ఓ వ్యక్తి ఈ కబ్జాకు తెరతీశాడని తెలిసి దేవదాయ శాఖ స్థానిక అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన 12 ఎకరాల విలువైన భూమి కబ్జాకు ఇంత దర్జాగా యత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడలో తాత్సారం చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై దేవదాయ శాఖ తనిఽఖీ అధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా ఖాళీ చేయాలని సదరు వ్యక్తులకు నాలుగు రోజుల క్రితం చెప్పామనీ, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శనివారమే రోడ్లు ధ్వంసం చేస్తామని చెప్పారు.

Updated Date - 2020-05-30T09:08:23+05:30 IST