విస్తరిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2022-01-27T06:59:01+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్నా.. వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అన్ని గ్రామాల పరిధిలో ఈ కేసులు నమోదవుతున్నాయి.

విస్తరిస్తున్న వైరస్‌

జిల్లాలో  పెరుగుతున్న కరోనా కేసులు

ఫీవర్‌ సర్వేలో భారీగా బయటపడ్డ పాజిటివ్‌లు

జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

బుధవారం 230 పాజిటివ్‌ కేసుల నమోదు

నిజామాబాద్‌, జనవరి 26:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్నా.. వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అన్ని గ్రామాల పరిధిలో ఈ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో చేపట్టిన ఫీవర్‌ సర్వేలో ఎక్కువ కేసులు బయటపడడంతో లక్షణాలు ఉన్న వారందరికీ మందుల కిట్ల ను అందించారు. సీరియస్‌గా ఉన్నవారిని జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పీహెచ్‌సీల పరిధిలో పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫీవర్‌ సర్వే ద్వారా లక్షణాలు ఉన్న వారందరికీ మందులు ఇవ్వడంతో హోం క్వారంటైన్‌లోనే  చికిత్స పొందుతున్నారు. ఈ నెలాఖరులోపు కేసులు తగ్గే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని రోజురోజుకూ పెంచుతున్నారు. 

ఫ నిత్యం వందల సంఖ్యలో కేసులు..

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో పరీక్షలను నిర్వహిస్తుండగా ప్రతిరోజూ 500 వరకు పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. జిల్లాలో గడిచిన ఆరు రోజులుగా నిర్వహించిన ఫీవర్‌ సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారిని అంతకంటే ఎక్కువ మందిని గుర్తించారు.  జిల్లాలోని గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు ఉన్న మొత్తం 3లక్షల 50వేల 879 ఇళ్లలో సర్వే నిర్ణయించారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు 3లక్షల 47వేల 009 ఇళ్లలో సర్వే పూర్తిచేశారు. జిల్లాలో ఈ సర్వేలో 13లక్షల 95వేల 359 మందిని పరిశీలించారు. వీరందరిలో కరోనా లక్షణా లు ఉన్న 6,638 మందిని గుర్తించారు. వీరందరికీ హోం ఐసొలేషన్‌ కిట్లను అందించారు. 


ఫ కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ..

జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పెంచారు. ఇప్పటికే మొదటి విడత 96శాతం పూర్తికాగా రెండో విడత డోసులను పెంచారు. వీరితో పాటు బూస్టర్‌ డోసును కూడా అందిస్తున్నారు. త్వరగా వ్యాక్సినేషన్‌ ఎక్కువ మందికి ఇచ్చేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 20లక్షల 9వేల 293 డోసుల వ్యాక్సిన్‌ను అందించారు. జిల్లాలో మొదటి, రెండో డోసులను ఇవ్వడంతో పాటు బూస్టర్‌ డోసును కూడా అందిస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటు 60 సంవత్సరాలు నిండిన వారందరికీ ఈ బూస్టర్‌ డోసును ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,3787 మందికి బూస్టర్‌ డోసును వేశారు. ప్రతిరోజూ వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద 2వ డోసుతో పాటు ఈ బూస్టర్‌ డోసును వేస్తున్నారు. 2వ డోసు తీసుకున్న 9 నెలలు నిండిన వారందరికీ ప్రికాషన్‌ పేరుమీద ఈ బూస్టర్‌ డోసు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల రోగ నిరోదకశక్తి ఎక్కువగా ఉండడం, ఒమైక్రాన్‌తో పాటు కరోనాను తట్టుకునే సామర్థ్యం పెరగడంతో ఎక్కువ మందికి త్వరగా డోసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో డోసుతో పాటు బూస్టర్‌ డోసు ఎక్కువ మందికి ఇచ్చేందుకు ప్రతిరోజూ వ్యాక్సిన్‌ కేంద్రాలకు టార్గెట్‌ పెంచుతూ వేస్తున్నారు. జిల్లాలో చేపట్టిన ఫీవర్‌ సర్వే వల్ల లక్షణాలు ఉన్నవారందరిని ముందే గుర్తించడం వల్ల వ్యాప్తిని అరికట్టే అవకాశం ఏర్పడిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ చేస్తున్నామని డాక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. మొదటి, రెండో డోసులతో పాటు బూస్టర్‌ డోసులను వేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ వేసుకోనివారు కేంద్రాలకు వచ్చి వేయించుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-01-27T06:59:01+05:30 IST