వెల్లివిరియనున్న ఆధ్యాత్మిక శోభ

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. దుర్గాదేవీ. శక్తిస్వరూపిణీ, లయకారిణీగా కీర్తింపబడుతున్న దుర్గాదేవి నవరాత్రులుప్రారంభం కానున్నాయి.‘

వెల్లివిరియనున్న ఆధ్యాత్మిక శోభ
వర్గల్‌ శంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రం

నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు 

వేడులకు ముస్తాబైన ఆలయాలు

వర్గల్‌ విద్యాధరికి రానున్న పీఠాధిపతులు, ప్రముఖులు

భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి


 వర్గల్‌/కొండపాక/చేర్యాల, సెప్టెంబరు 24: అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. దుర్గాదేవీ. శక్తిస్వరూపిణీ, లయకారిణీగా కీర్తింపబడుతున్న దుర్గాదేవి నవరాత్రులుప్రారంభం కానున్నాయి.‘‘అమ్మ శరణం..భవానీ శరణం. బంగారు మాతల్లీ నీకు శరణం...’’అని జిల్లా వాసులు నేటి నుంచి దుర్గాదేవీ  నామస్మరణతో భక్తిపారవశ్యం చెందనున్నారు. 

రాష్ట్రంలో రెండో బాసరగా పేరొందిన వర్గల్‌ శంభుగిరి కొండపై వెలసిన విద్యాధరి క్షేత్రం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. చిన్నారుల అక్షర శ్రీకారాలు, కుంకుమార్చనలతో విద్యాసరస్వతీ అమ్మవారి సన్నిధి నిత్యం కళకళలాడుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ వైపు ధర్మప్రచారం, మరోవైపు భారత ప్రాచీన వారసత్వ సంపదైన వేదాల వ్యాప్తి, నిత్యాన్నదాన కార్యక్రమాలు, సామాజిక సేవలతో వర్గల్‌ విద్యాధరి క్షేత్రం ప్రత్యేకత చాటుతున్నది. నేటినుంచి ప్రారంభంకానున్న ఉత్సవాలు నవంబరు 5వ తేదీ బుధవారం విజయదశమితో ముగియనున్నాయి. 

 విద్యా సరస్వతీ అమ్మవారి శరన్నవరాత్ర్సోవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయవ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖర్‌ శర్మ సిద్ధాంతి తెలిపారు.  ఏర్పాటు పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు ప్రత్యేక రూపంలో దర్శనమివ్వనున్నట్లు ఆయన తెలిపారు.  వేడుకల దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భజన. భక్తిపాటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

వేడుకలకు రానున్న పీఠాధిపతులు, ప్రముఖులు  

వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో జరగనున్న శరన్నవరాత్రోత్సవాలకు పుష్పగిరి పిఠాధిపతులు  విద్యా శంకర భారతీ స్వామి, తొగుట రాంపురం పీఠాధిపతులు మాధవానంద సరస్వతీ స్వామి, నాచారం శ్రీ క్షేత్రం పీఠాధిపతులు మధుసూదనానంద సరస్వతీ స్వామిజీ, మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, జడ్పీ చైర్మన్‌ రోజాశర్మ, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, నాచగిరి లక్ష్మీనరసింహాస్వామి క్షేత్రం ఆలయ కమిటీ చైర్మన్‌ హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హాజరుకానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 


 ముస్తాబైన మర్పడగ క్షేత్రం

 కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రం శరన్నరాత్రోత్సవాలకు ముస్తాబైంది. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు డాక్టర్‌ హరినాథ శర్మ తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 26న సూర్యహోరలో కలశస్థాపన, దీక్షధారణ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతిరోజు శతుష్షష్ఠి ఉపచార పూజ, మంగళ హారతి, నవావరణ హవనము కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 


చేర్యాలలో..

 సకల శుభాలు, విజయాలను చేకూర్చే విజయదశమిని పురస్కరించుకుని నిర్వహించే ఉత్సవాలలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దస్‌ అంటే పది, హరా అనగా పండుగ అని అర్థం. విజయానికి నాంది అయిన విజయదశమిని పురస్కరించుకుని దుర్గాదేవీని ఆరాధిస్తే సకలశుభాలు, విజయప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. 


 ఏర్పాట్లు పూర్తి 

చేర్యాలలోని చావడి వద్ద దేవీస్నేహాయూత్‌ అసోసియేషన్‌, వేణుగోపాలస్వామి వీధిలో సాయిచైతన్యయూత్‌, మహమ్మాయి ఆలయం, అయ్యప్పస్వామి, పెట్రోల్‌పంప్‌ సమీపంలో దేవీవాసవీ పరపతిసంఘం, రాజీవ్‌నగర్‌ కాలనీ, భరత్‌నగర్‌, బీడీ కాలనీతో పాటు కొమురవెల్లి గ్రామం, మండలంలోని మర్రిముచ్ఛాల తదితర గ్రామాల్లో ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలనుఅలంకరించి సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.





Updated Date - 2022-09-25T05:30:00+05:30 IST